Advertisement

Advertisement


Home > Movies - Movie News

భారతీయ సినిమా అంటే..?

భారతీయ సినిమా అంటే..?

ఒకప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం చాలా సింపుల్. భారతీయ సినిమా అంటే బాలీవుడ్. బాలీవుడ్ అంటే ఇండియన్ సినిమా. ఇలా ఫిక్స్ అయిపోయారంతా. కానీ రోజులు మారాయి. భారతీయ సినిమా అంటే బాలీవుడ్ ఎంత మాత్రం కాదు. ఈ స్థానాన్ని సౌత్ ఆక్రమించి చాన్నాళ్లయింది.

ఒకప్పుడు సౌత్ వెర్సెస్ నార్త్ అనే పోటీ ఉండేది. దీనిపై టీవీల్లో చర్చలు, పత్రికల్లో కథనాలు చాలా వచ్చేవి. కానీ ఇప్పుడు చర్చకు తావు లేదు. ఇండియన్ సినిమా అంటే సౌత్ సినిమానే. సౌత్-నార్త్ అనే హద్దుల్ని చెరిపేస్తూ సౌత్ సినిమాలు దేశవ్యాప్తంగా రఫ్ఫాడిస్తున్నాయి. ఆ మాటకొస్తే, ప్రపంచవ్యాప్తంగా సౌత్ సినిమానే పాపులర్.

ఒకప్పుడు అంతర్జాతీయ వేదికపై షారూక్, అమీర్ పేర్లు వినిపించేవి. ఇప్పుడు రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి పేర్లు వినిపిస్తున్నాయి. ఇండియన్ సినిమాపై కాస్త అవగాహన ఉన్న ఇంటర్నేషనల్ అవార్డ్ ఫంక్షన్లలో ప్రత్యేకంగా సౌత్ ఇండియా సినిమా అనే ప్రస్తావన కూడా తెస్తున్నారు. కానీ ఇకపై ఆ 'గీత' అవసరం లేదు. ఇండియన్ సినిమా అంటే సౌత్ సినిమానే.

ఒకే టైమ్ లో బాలీవుడ్ డౌన్ అవ్వడం, సౌత్ సినిమాలు రైజ్ అవ్వడం మొదలయ్యాయి. సుశాంత్ సింగ్ మరణానికి ముందు, ఆ తర్వాత బాలీవుడ్ లో చాలా మార్పులు జరిగాయి. నెపొటిజంపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అదే టైమ్ లో సామాన్య జనానికి సంబంధం లేని కథలతో బాలీవుడ్ లో సినిమాలు రావడంతో జనాలకు మొహం మొత్తింది.

సౌత్ సినిమాల విషయానికొస్తే ఎక్కువగా బేసిక్స్ పై ఆధారపడి సినిమాలు తెరకెక్కుతుంటాయి. మూలాల్ని మరవని సినిమాలు మనవి. భాషతో సంబంధం లేకుండా ఎమోషన్ పండించే సినిమాలు సౌత్ సొంతం. లార్జన్ దేన్ లైఫ్ కథలను కళ్లకు కట్టేట్టు, వినసొంపుగా చెప్పే సామర్థ్యం సౌత్ సొంతం. అందుకే సౌత్ సినిమా కళ్లముందే తారాజువ్వలా దూసుకెళ్లింది. నార్త్ ను ఆక్రమించేసింది.

బాహుబలి బాటలు వేసింది, ఆర్ఆర్ఆర్ దూసుకుపోయింది. కేజీఎఫ్ మైమరిపించింది. పుష్ప పిచ్చెక్కించింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఉత్తరాదిన సత్తా చాటిన దక్షిణాది సినిమాలు చాలానే ఉన్నాయి. నిఖిల్, తేజ సజ్జా లాంటి హీరోలు కూడా నార్త్ బెల్ట్ లో హిట్స్ కొట్టారంటే, అది మనం ఎంచుకున్న కథల గొప్పదనం. మన మేకింగ్ లో నేటివిటీ.

ఉత్తరాది మార్కెట్లలో దక్షిణ భారత చిత్రాలకు పెరుగుతున్న డిమాండ్, సౌత్ సినిమా సార్వజనీయం అనేందుకు ప్రత్యక్ష ఉదాహరణ. లార్జర్ దేన్ లైఫ్ పాత్రలు, భారీ యాక్షన్ సీక్వెన్సులు, మనసుకు హత్తుకునే ఎమోషన్ కు భాషతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఆకర్షితులవుతున్నారు. అందుకే ప్రభాస్ నుంచి రాబోయే కల్కి కోసం దేశం మొత్తం ఎదురుచూస్తోంది. 'తగ్గేదేలే' అంటూ పుష్ప-2లో బన్నీ చెప్పే డైలాగ్ కోసం అర్రులుచాస్తోంది. అందుకే ఆర్ఆర్ఆర్ స్టార్లు ఎన్టీఆర్-చరణ్ చేస్తున్న దేవర, గేమ్ చేంజర్ సినిమాలు జాతీయ స్థాయిలో వైరల్ అవుతున్నాయి.

ఇప్పటికీ ఈ ఆధిపత్యాన్ని కొంతమంది బాలీవుడ్ జనాలు అంగీకరించరు. దీన్ని ఫ్లూక్ గా కొట్టి పడేస్తారు. కానీ ఇది గాలివాటం కాదు, సాలిడ్ స్ట్రాంగ్. బాలీవుడ్ నటీనటులు సౌత్ లో సినిమాలు చేయడం.. సౌత్ స్టార్లు బాలీవుడ్ సినిమాల్లో మెరవడం గాలివాటం కాదు. మారిన మార్కెట్ కు నిదర్శనం. 

దీనికి మరింత బలం చేకూరుస్తూ త్వరలోనే మరిన్ని సినిమాలు రాబోతున్నాయి. నార్త్ ఆడియన్స్ ను మరింతగా ఎంటర్ టైన్ చేయబోతున్నాయి. జయహో.. (సౌత్) ఇండియన్ సినిమా.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?