Advertisement

Advertisement


Home > Movies - Movie News

వ‌న్ అండ్ ఓన్లీ .. కే విశ్వ‌నాథ్!

వ‌న్ అండ్ ఓన్లీ .. కే విశ్వ‌నాథ్!

సినిమాకు మాన‌వీయ స్ప‌ర్శ ఉంటే అది భ‌లే ఉంటుంది. కొంత డ్రామా యాడ్ అయితే అయ్యుండొచ్చు.. సామాజిక అంశాల మ‌ధ్య‌న మ‌నిషి జీవితాన్ని తెర‌పై చూపితే అది హ‌త్తుకుంటుంది. సినిమా క‌ళ ఆవిష్కృతం అయిన ఆదిలో పౌరాణికాలు, భ‌క్తి సినిమాలు రాజ్య‌మేలాయి. ఆ త‌ర్వాత కుటుంబ క‌థ‌లు బోలెడ‌న్ని వ‌చ్చాయి. అయితే సామాజిక క‌ట్టుబాట్లు, సంప్ర‌దాయాలు, కులం వీటిని ప్ర‌స్తావించ‌గ‌ల సినిమాలు రావ‌డానికి చాలా స‌మ‌యమే ప‌ట్టింది. 

తెలుగు చిత్ర ప‌రిశ్రమే కాదు ఇత‌ర చిత్ర ప‌రిశ్ర‌మ‌ల ప‌రిస్థితి కూడా దాదాపు ఇంతే. అయితే త‌మిళంలో చిత్ర ప‌రిశ్ర‌మ కుటుంబ క‌థా చిత్రాల నుంచి సామాజిక ప‌రిస్థితుల ఆధారంగా సినిమాల వైపు అల్లుకోవ‌డంలో దూకుడుగా వెళ్లింది. బాల‌చంద‌ర్, భార‌తిరాజా వంటి ద‌ర్శ‌కులు సంచ‌ల‌న క‌థాంశాల‌ను ప‌ట్టుకున్నారు. వీరిలో కూడా బాల‌చంద‌ర్ సినిమాలు ప్ర‌ధానంగా మాన‌వ సంబంధాల మీదే ఉంటాయి. భార‌తిరాజా సినిమాలు కులం, వివ‌క్ష, గ్రామీణ త‌మిళ జీవితాన్ని ప‌చ్చిగా చూపించాయి. ఈ విష‌యాల్లో బాల‌చంద‌ర్, భార‌తిరాజాల‌కు బోలెడంత‌మంది అభిమానులు. అయితే వారిక‌న్నా మేటిగా సామాజిక ప‌రిస్థితుల గురించి సినిమాల్లో క‌థాంశంగా ప్ర‌స్తావించిన ధిగ్ధ‌ర్శకుడు కే విశ్వ‌నాథ్.

1980లు, అంత‌కు పూర్వం నాటి ప‌రిస్థితులు దేశంలో ఎలా ఉండేవో, సామాజికంగా, ఆర్థికంగా నాటి ప్ర‌జ‌ల జీవ‌న స్థితిగ‌తులు ఎలా ఉండేవో.. అత్యంత లోతుల్లోకి వెళ్లి చ‌ర్చించి అర్థ‌వంత‌మైన సినిమాలుగా చూపిన ద‌ర్శ‌కులు సౌత్ లో ఉన్నారు. కే విశ్వ‌నాథ్, పుట్ట‌ణ్ణ‌, బాపు, బాల‌చంద‌ర్, భార‌తిరాజా  ఈ జాబితాలో ముందు వ‌ర‌స‌లో నిలుస్తారు. స‌మాజం, కుటుంబం, వ్య‌క్తులు, వ్యవ‌స్థ, సంప్ర‌దాయాలు, క‌ట్టుబాట్ల మ‌ధ్య న‌లిగిపోయే మ‌నుషుల క‌థ‌ల‌ను వీరు తెర‌పై చూపించారు. త‌మిళ ద‌ర్శ‌కులు, క‌థ‌కులు విసు, భాగ్య‌రాజా, తెలుగు ద‌ర్శ‌కుడు వంశీ  కూడా ఈ వార‌స‌త్వాన్ని కొన‌సాగించిన వారే. అయితే వంశీ కామెడీల బాట ప‌ట్టి గాడి త‌ప్పార‌నిపిస్తుంది. 

విశ్వ‌నాథ్ సినిమాలంటే చాలా వ‌ర‌కూ సంగీతం, సాహిత్యం అనే చ‌ర్చ‌నే ఎక్కువ‌గా జ‌రుగుతూ ఉంటుంది. విశ్వ‌నాథ్ సినిమాలు చాలా వ‌ర‌కూ మ్యూజిక‌ల్ హిట్స్. క్లాసిక్స్. దీంతో విశ్వ‌నాథ్ సినిమాల్లో పాట‌లు, పాట‌ల్లోని సాహిత్యం గురించి బోలెడంత‌మంది మాట్లాడేస్తారు. విశ్వ‌నాథ్ సినిమాల గురించి యూట్యూబ్ విశ్లేష‌ణ‌లు, చ‌ర్చ‌ల్లో కూడా .. సాహిత్యం, సంగీతం అంటారు. వాటి చ‌ర్చ మొద‌లుపెడితే వేటూరి, సిరివెన్నెల‌, కేవీ మ‌హ‌దేవ‌న్, ఇళ‌య‌రాజా ల గురించి మాట్లాడుకోవాలి. అయితే.. విశ్వ‌నాథ్ గురించి మాట్లాడాలంటే కాసేపు వేటూరిని, సిరివెన్నెల‌ను, కేవీని, ఇళ‌య‌రాజ‌ను, బాలూనూ ప‌క్క‌న పెట్టాలి. వారంద‌రితో పాటు నిర్మాత‌ల వ‌ల్ల‌నే త‌ను మంచి సినిమాలు తీయ‌గ‌లిగాన‌ని విశ్వ‌నాథ్ ఎంత విన‌మ్రంగా చెప్పినా.. .సామాజిక అంశాల ఆధారంగా, సమాజంలో వేళ్లూనుకుపోయిన కుల వ్య‌వ‌స్థ ఆధారంగా త‌న క‌థ‌ల‌ను విశ్వ‌నాథ్ అల్లుకున్న తీరు న‌భూతో న‌భ‌విష్య‌తి.

సంగీతం, సాహిత్యం, సినిమాల్లోని పాత్ర‌లు ఏదో కళ‌కు జీవితాన్ని అంకితం ఇచ్చిన‌ట్టుగా ఉండ‌టం.. ఇవ‌న్నీ షుగ‌ర్ కోటెడ్. వీటికి మించి విశ్వ‌నాథ్ సినిమాల్లో నాటి స‌గ‌టు వ్య‌క్తుల జీవితం క‌నిపిస్తుంది. త‌ర‌చి చూస్తే నాటి సామాజిక ప‌రిస్థితులు క‌ళ్ల‌కు క‌డ‌తాయి.

కులాల మ‌ధ్య‌న అంత‌రాలు, ప్రేమ‌కు కులాల అడ్డుగోడ‌ల గురించి అర్థ‌మ‌య్యే రీతిలో, అర్థ‌వంతంగా చూపారాయ‌న స‌ప్త‌ప‌దిలో. అది కూడా వేరు కుల‌స్తుడిపై మ‌న‌సు పెట్టుకున్న యువ‌తికి స్వ‌కుల‌స్తుడితో పెళ్లి కావ‌డం, ఆ త‌ర్వాతి ప‌రిస్థితులు.. ఇంత సంచ‌ల‌న క‌థాంశం మ‌రే సినిమాలో క‌నిపిస్తుంది? త‌క్కువ కుల‌స్తుడిని ప్రేమించ‌డ‌మే పాపం అనే ప‌రిస్థితుల్లో, ఆమెకు పెళ్లి కూడా అయిపోవ‌డం, అస‌లు విష‌యం తెలిసిన అబ్బాయి త‌ర‌ఫు కుటుంబం ఆ ప‌రిస్థితుల‌ను ఎదుర్కొనే తీరు అద్భుతంగా చూపారు. ప‌రువు హ‌త్య‌ల గురించి ఇప్పుడు సినిమాలు చాలా మంది తీశారు. ఇవే సంచ‌ల‌నాలు అనుకుంటే, ద‌శాబ్దాల కింద‌టే అలాంటి క‌థ‌ను తెర‌పై చెప్పిన విశ్వ‌నాథ్ ను  ప్ర‌శంసించ‌డానికి ఎన్ని మాట‌లు కావాలి!

క‌ళ‌ల‌కు జీవితాన్ని అంకితం ఇచ్చి, పేద‌రికంలో కూడా గుట్టుగా గ‌డిపేసే కుటుంబాల ప‌రిస్థితులు, ఆ కుటుంబాల యువ‌తీయువ‌కుల రంగుల క‌ల‌లు ఎలా ఉంటాయో మ‌రో వందేళ్ల‌కు అయినా అర్థ‌మ‌య్య‌లా చెప్ప‌డానికి 'స్వ‌ర్ణ‌క‌మ‌లం' ఒక్క‌టి చాల‌దా! 

క‌ళ‌కు జీవితాన్ని అంకిత‌మిచ్చి కూడా లైమ్ లైట్ లోకి రాలేక‌పోయినా క‌ళాకారుడిని విశ్వ‌నాథ్ చూపిన రీతిలో మ‌రొక‌రు చూప‌లేదు ఇప్ప‌టికీ! వితంతు పున‌ర్వివాహం గురించి స్వాతిముత్యం ఏ ఛాంద‌సుల ఆలోచ‌న‌నో ఎంతో కొంత మార్చి ఉండ‌దా! అంద‌వికారంగా ఉన్నాన‌ని అపార‌ప్ర‌తిభ ఉన్నా అంద‌రి ముందుకు రాలేని చెల్లెలుకాపురం సినిమాలో శోభ‌న్ బాబు పాత్రను మ‌రపురానిది కాదా! తిండిపోతు, సోమ‌రిపోతు వ్య‌క్తిత్వాన్ని ఫుల్ లెంగ్త్ రోల్ లో పెట్టి సినిమా తీయొచ్చ‌ని ఇప్పుడు చెప్పినా న‌వ్వుతారు! సాధ్యం కాద‌నుకుంటారు. శుభోద‌యం సినిమా చూస్తే 'ఔరా.. విశ్వ‌నాథ్' అనుకోని వారుంటారా!

సమాజంలో త‌క్కువ‌గా చూడ‌బ‌డే వ్య‌క్తులే విశ్వ‌నాథ్ సినిమాల్లో ప్ర‌ధాన పాత్ర‌లు. చెప్పులు కుట్టుకునేవాడు, పాల‌మ్ముకునేవాడు, వితంతువులు, క‌ళ్లు లేని వారు, మాట‌లు రాని వారు, అపార‌మైన ప్ర‌తిభ ఉన్నా.. కళ‌ల్లో గుర్తింపును ద‌క్కించుకోలేని వాళ్లు! ఇలా స‌మాజంలో ఎవ‌రైతే చిన్న‌చూపు చూప‌బ‌డుతున్నారో.. వారి గురించి హృద్యంగా, అద్భుతంగా చూప‌డం విశ్వ‌నాథ్ కే సాధ్య‌మైంది. విశ్వ‌నాథ్ సినిమాల్లో చూపినంత సోష‌ల్ రిఫార్మ్స్ ను చూపిన మ‌రో భార‌తీయ ద‌ర్శ‌కుడు లేరు. సామాజిక ప‌రిస్థితుల‌పై తిరుగుబాటు చూపిన సినిమాలు, ఈ మ‌నుషుల‌కు దూరంగా పారిపోవాల‌నే సినిమాలు చాలా వ‌చ్చాయి కానీ, ప‌రివ‌ర్త‌నే విశ్వ‌నాథ్ సినిమాల్లో ముగింపు. ఈ విష‌యంలో విశ్వ‌నాథ్ వ‌న్ అండ్ ఓన్లీ!

-జీవ‌న్ రెడ్డి. బి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?