మీటింగ్ ముగిసింది.. ప్రశ్నలు మిగిలాయి

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై ఇండస్ట్రీ పెద్దల ముందు రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారు?

అల్లు అర్జున్ కు, తెలంగాణ ప్రభుత్వానికి మధ్య నడుస్తున్న వివాదంపై మీటింగ్ లో చర్చించారా లేదా?

సీఎంతో మీటింగ్ కు అల్లు అర్జున్ తండ్రి, అల్లు అరవింద్ వెళ్లారు కదా.. ఆయనతో మాట్లాడ్డానికి సీఎం అంగీకరించారా?

తెలంగాణలో టికెట్ రేట్లపై చర్చించారా? చర్చిస్తే దానిపై ఏం మాట్లాడారు?

సంక్రాంతి సినిమాల సంగతేంటి? వాటికి ప్రత్యేక అనుమతులిస్తారా?

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై ఇండస్ట్రీ పెద్దల ముందు రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారు?

తొక్కిసలాట ఘటనపై అక్కడే ఉన్న పోలీస్ బాస్ లు ఎలాంటి సూచనలు చేశారు?

ఇలా ఒకటి కాదు, ఎన్నో ప్రశ్నలు, మరెన్నో అనుమానాలు. వీటిలో కనీసం ఒకట్రెండు డౌట్స్ అయినా క్లియర్ అవుతాయని మీడియా పడిగాపులు కాసింది. కానీ బయటకొచ్చి దిల్ రాజు మాట్లాడిన మాటలు, పూర్తిగా విషయాన్ని, వివాదాల్ని పక్కదోవ పట్టించేలా ఉన్నాయి.

టాలీవుడ్ కు ప్రపంచవ్యాప్తంగా ఓ బ్రాండ్ ఎలా క్రియేట్ చేయాలనే అంశంపై అందరూ కూర్చొని మాట్లాడుకున్నారట. దీని కోసం దిల్ రాజు అమెరికా నుంచి వచ్చి, నిద్రలేని రాత్రులు గడిపి, టాలీవుడ్ పెద్దల్ని కలుపుకొని ముఖ్యమంత్రితో మీటింగ్ కు వెళ్లారన్నమాట.

ఇండస్ట్రీని ఎలా పైకి తీసుకురావాలనే అంశంపై ప్రభుత్వం నుంచి మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తారట, ఇటు ఇండస్ట్రీ నుంచి ఎఫ్ డీ సీ ఆధ్వర్యంలో ఓ సంఘం ఏర్పడుతుందంట. అంతా కలిసి టాలీవుడ్ ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తారంట. పూర్తిగా దీనిపైనే సమావేశంలో మాట్లాడుకున్నారట.

మరి ఇదంతా మాట్లాడుకుంటే అల్లు అరవింద్ ఏం చేశారు.. ఆయన తన కొడుకు ఇష్యూ గురించి మాట్లాడ్డానికి ముఖ్యమంత్రిని ప్రత్యేక సమయం కోరలేదా? అదే మీటింగ్ లో నాగార్జున కూడా ఉన్నారు. తన ఎన్-కన్వెన్షన్ గురించి మాట్లాడ్డానికి సీఎంను కాస్త సమయం కోరలేదా? ఇవన్నీ పక్కనపెడదాం. చిరంజీవి ఎందుకు ఈ మీటింగ్ కు రాలేదు? ఆయన చెన్నైలో ఉంటే, మీటింగ్ కు రావడం ఎంత సేపు?

మరికొన్ని వారాల్లో సంక్రాంతి సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో ఆ సినిమాలకు ప్రత్యేక అనుమతులు ఇస్తున్నారా లేదా? ఎప్పట్లానే బెనిఫిట్ షోలు వేసుకోవచ్చా లేదా? వీటిపై స్పష్టత ఎక్కడ? మరీ ముఖ్యంగా సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై ఇంతముంది ప్రముఖుల్లో ఒక్కరు కూడా ముఖ్యమంత్రి ముందు మాట్లాడలేదా? మాట్లాడితే సీఎం రియాక్షన్ ఏంటి?

ఇవి కదా కావాల్సింది. ముందు జరగాల్సింది చూడకుండా, ముఖ్యమంత్రి పెద్ద టార్గెట్ పెట్టారంటూ ప్రకటించి వెళ్లిపోతే ఎలా? అయితే ఈ మీటింగ్ తో ఒకటి మాత్రం స్పష్టమైంది. ఎప్పట్లానే పెద్ద సినిమాలకు అనుమతులొస్తాయి. మీటింగ్ తర్వాత బయటకొచ్చిన సెలబ్రిటీల వెలిగిపోతున్న ముఖాలు చూస్తే ఈ విషయం మాత్రం అర్థమౌతోంది. కాకపోతే నేరుగా చెప్పలేదంతే. దిల్ రాజు మాటల్లో చెప్పాలంటే వాళ్లకది పెద్ద ఇంపార్టెంట్ పాయింట్ కాదు.

8 Replies to “మీటింగ్ ముగిసింది.. ప్రశ్నలు మిగిలాయి”

  1. పర్లేదు రేపు చంద్రబాబు గారిని కలిసి మేము తెలంగాణ లో టికెట్స్ రేట్స్, బెన్ఫిట్ షూస్ లేక పోయినా ఇంటర్నేషనల్ స్థాయి కి డెవలప్ చేసుకుంటున్నాము మా తెలంగాణ సిఎం కి హామీ ఇచ్చాము ,మాకు ఏపీ తో సంబంధం లేదు బెన్ఫైట్ షూస్, టికెట్స్ హైక్స్ మాత్రం ఏపీ లో చేసుకుంటాము అని చెపుతారు, ఇక్కడ సినిమా పరిశ్రమ ఎక్సపాండ్ చేయం

Comments are closed.