Advertisement

Advertisement


Home > Politics - Analysis

ఉమ్మ‌డి అనంత‌లో టీడీపీ ఇలా అయ్యిందేంటి!

ఉమ్మ‌డి అనంత‌లో టీడీపీ ఇలా అయ్యిందేంటి!

తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో ఎప్పుడు అధికారం చేప‌ట్టాల‌న్నా.. ఆ పార్టీ మెజారిటీ సీట్ల‌ను సాధించాల్సిన జిల్లాల్లో ఒక‌టి అనంత‌పురం జిల్లా. ఏపీ రాజ‌కీయ చ‌రిత్ర‌ను గ‌త మూడు ద‌శాబ్దాల మేర చూస్తే.. తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో ఎప్పుడు అధికారం చేప‌ట్టినా 14 అసెంబ్లీనియోజ‌క‌వ‌ర్గాల ప‌రిధిలోని అనంత‌పురం జిల్లాలో మెజారిటీ సీట్ల‌ను సాధించి ఉంటుంది. టీడీపీ చివ‌రి సారి ఏపీలో అధికారం సాధించింది 2014లో. అప్పుడు ఈ జిల్లాలో ఆ పార్టీకి ఏకంగా 12 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో విజ‌యం ద‌క్కింది! 2019 నాటికి సీన్ రివ‌ర్స్ అయ్యింది. టీడీపీ రెండంటే రెండే అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో విజ‌యం సాధించింది. మ‌రి ఈ సారి రాష్ట్రంలో అధికారం చేప‌ట్టాలంటే టీడీపీ ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లాలో సాధించాల్సి చాలానే ఉంది!

క‌ర్నూలు, క‌డ‌ప‌, నెల్లూరు, చిత్తూరు, ప్ర‌కాశం, అనంతపురం, చిత్తూరు.. ఉమ్మ‌డి జిల్లాల లెక్క‌లో తీసుకుంటే.. వీట‌న్నింటిలో కెళ్లా టీడీపీ ఆశ‌లు అనంత‌పురం మీదే ఉంటాయి! మిగ‌తా రాయ‌ల‌సీమ‌లో అయినా, నెల్లూరు-ప్ర‌కాశంల‌లో అయినా తెలుగుదేశం పార్టీ మెజారిటీ సీట్ల‌ను సాధించ‌లేక‌పోయినా ఫ‌ర్వాలేదు కానీ, అనంత‌పురం జిల్లాలో ఆ పార్టీకి 10కి పైగా అసెంబ్లీ సీట్ల‌ను సాధించ‌లేక‌పోతే.. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ రాష్ట్రంలో అధికారాన్ని సొంతం చేసుకోలేదు! ఇదీ చ‌రిత్ర‌, ఇదీ సంప్ర‌దాయం! అనంత‌పురంలో ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీకి ప‌ది అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో విజ‌యం సాధించే ప‌రిస్థితి ఉంటుందో.. అప్పుడే దానికి రాష్ట్రంలో అధికారం ద‌క్కుతుంది. క‌నీసం ఏడు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ గెలిచిన సంద‌ర్భాల్లో కూడా ఏపీలో టీడీపీకి అధికారం ద‌క్క‌లేదు! 2004లో కూడా టీడీపీ అనంత‌పురం జిల్లాలో చెప్పుకోద‌గిన స్థాయిలో సీట్ల‌ను నెగ్గింది. 2009లోనూ ఉనికి చాటింది. ఆ నాటి ఎన్నిక‌ల్లో టీడీపీ ఐదారు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో అల‌వోక‌గా గెలింది. కానీ అప్పుడు కూడా అధికారం అంద‌లేదు! అనంత‌పురంలో టీడీపీ 10 సీట్లు అంత‌కు మించిన స్థాయిలో గెలిచిన సంద‌ర్భాల్లో మాత్ర‌మే రాష్ట్రంలో మాత్ర‌మే దానికి అధికారం అందింది.

మ‌రి ఇప్పుడు ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లాలో టీడీపీకి ప‌ది అసెంబ్లీ సీట్లు ద‌క్కే అవ‌కాశాలున్నాయా? అంటే.. ఇప్పుడు ఆ పార్టీలో రేగిన క‌ల్లోలాన్ని బ‌ట్టి చూస్తే అంత సీన్ కనిపించ‌డం లేద‌ని స్ప‌ష్టం అవుతోంది! అభ్య‌ర్థుల ఎంపిక ముందు టీడీపీ ప‌రిస్థితి ఏమిటో కానీ.. అభ్య‌ర్థుల ప్ర‌క‌ట‌న త‌ర్వాత టీడీపీలో దుమారం రేగుతూ ఉంది! గుంత‌క‌ల్లు నుంచి పుట్ట‌ప‌ర్తి వ‌ర‌కూ ఏదో ఒక ర‌చ్చ కొన‌సాగుతూ ఉండ‌టం గ‌మ‌నార్హం!గుంత‌క‌ల్ లో టీడీపీ ఒక‌ప్పుడు మంచి బ‌లాన్ని క‌లిగి ఉండేది. ఎంత‌లా అంటే.. 2014 ఎన్నిక‌ల్లో టీడీపీ రెబ‌ల్ ను పెట్టి మ‌రీ గెలిచింది. అప్పుడు ఆ సీటును పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించింది టీడీపీ. మొద‌ట బీజేపీకే అని చెప్పి, ఆ త‌ర్వాత తెలుగుదేశం పార్టీ త‌న అభ్య‌ర్థిగా జితేంద‌ర్ గౌడ్ ను పోటీ చేయించింది. బీజేపీ అడ్ర‌స్ లేకుండా పోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థిపై టీడీపీ అభ్య‌ర్థి జితేంద‌ర్ గౌడ్ ఆ ఎన్నిక‌లో నెగ్గాడు! 

మ‌రి అలా తెలుగుదేశం పార్టీకి సంప్ర‌దాయ నాయ‌క‌త్వం ఉన్నా.. తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు నాయుడు మాత్రం ప‌క్క జిల్లా నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేను తీసుకొచ్చి అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించారు. ఆయ‌నే గుమ్మ‌నూరు జ‌య‌రాం!. ఈయ‌న‌పై తెలుగుదేశం పార్టీ ఎన్ని ఆరోప‌ణ‌లు చేసిందో, ప‌చ్చ‌మీడియా ఎన్ని క‌థ‌లు రాసిందో లెక్కేలేదు! గుమ్మ‌నూరు జ‌య‌రాం తీవ్ర అవినీతి ప‌రుడు అంటూ ఇన్నాళ్లూ ఏకారు. వీరి దెబ్బ‌కు జ‌గ‌న్ కూడా గుమ్మ‌నూరుకు సొంత నియోజ‌క‌వ‌ర్గం టికెట్ ను నిరాక‌రించాడు. అలాంటి వ్య‌క్తిని తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ వేరే జిల్లాలో అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించింది! ఇన్నాళ్లూ ప‌ని చేసిన వారిలో ఇలాంటి నిర్ణ‌యం ఎలాంటి క‌సి రేపుతుందో వేరే చెప్ప‌న‌క్క‌ర్లేదు! చంద్ర‌బాబు అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించ‌డానే.. గుమ్మ‌నూరు జ‌య‌రాం మంచివాడు అయిపోయాడ‌ని వేరే నియోజ‌క‌వ‌ర్గాల్లోని ప‌చ్చ‌భ‌క్తులు కూడా అనుకోవ‌చ్చు కానీ, ఆయ‌న పోటీ చేస్తున్న చోట మాత్రం అలాంటి ప‌రిస్థితి ఉండ‌దు! గుంత‌క‌ల్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్క‌డైనా ఎదురీదాల్సిన ప‌రిస్థితి ఉన్నా.. గుమ్మ‌నూరు అభ్య‌ర్థిత్వం త‌ర్వాత ఆ పార్టీలో కాన్ఫిడెన్స్ పెరిగింది. స్థానికేత‌రుడు, మొన్న‌టి వ‌ర‌కూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప‌ని చేసిన జ‌యరాం తెలుగుదేశం అభ్య‌ర్థి అనే ప్ర‌క‌ట‌న త‌ర్వాత టీడీపీ లో నైరాశ్యం తీవ్ర‌మైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇది వ‌ర‌ప్ర‌దంగా మారుతోంది!

తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న వేళ క‌చ్చితంగా గెలిచే సీట్ల‌లో మ‌రోటి అనంత‌పురం అర్బ‌న్. ఈ సీటు విష‌యంలో బోలెడు వార్త‌లు వ‌చ్చాయి. ఇది జ‌న‌సేన‌కు అన్నారు. జ‌న‌సేన త‌ర‌ఫున బ‌లిజ సామాజిక‌వ‌ర్గానికి చెందిన అభ్య‌ర్థిని బ‌రిలోకి దించుతార‌నే వార్త‌లు వ‌చ్చాయి. అయితే  ఈ సీటును క‌మ్మ‌వాళ్ల‌కు కాకుండా చంద్ర‌బాబు వేరే వాళ్ల‌కు వ‌ద‌ల‌డ‌నే అంచ‌నాలే నిజం అయ్యాయి. క‌మ్మ‌వాళ్ల‌కే ఈ టికెట్ అంటే.. అది ప్ర‌భాక‌ర్ చౌద‌రికే అని అంతా అనుకున్నారు! అయితే ఈ చౌద‌రిని కాద‌నిచంద్ర‌బాబు ఇంకో చౌద‌రిని తెర‌పైకి తెచ్చారు. ఆయ‌న పేరు ద‌గ్గుపాటి వెంక‌టేశ్వ‌ర ప్ర‌సాద్ అట‌! మ‌రి జ‌నాల‌కు పెద్ద‌గా ప‌రిచయంలేని పేరు ఇది! ఈ నిర్ణ‌యం అటు తెలుగుదేశం పార్టీలోనూ, ఇటు జ‌న‌సేన‌లో కూడా చిచ్చు రేపుతోంది. 

జ‌న‌సేన త‌ర‌ఫున అభ్య‌ర్థిత్వం ద‌క్కుతుంద‌ని బ‌లిజ‌లు ఆశించారు. అనంత‌పురం టౌన్లో బ‌లిజ‌ల జ‌నాభా 50 వేల‌కుపైనే ఉంటుంది. మెజారిటీ బ‌లిజ‌లు తెలుగుదేశం పార్టీకి సానుకూలంగా ఉంటారెప్పుడూ, అయితే ఎప్పుడూ టీడీపీ వారికి అవ‌కాశం ఇవ్వ‌లేదు. 2009లో ఒకే ఒక్క‌సారి మ‌హాల‌క్ష్మీ శ్రీనివాస్ కు అవ‌కాశం ఇచ్చారు, అయితే  ఆయ‌న‌ను క‌మ్మ వాళ్లు గెలవ‌నివ్వ‌లేదు. త‌న‌కు టికెట్ ద‌క్క‌ని ప్ర‌తిసారీ రెబ‌ల్ గా మార‌డం ప్ర‌భాక‌ర్ చౌద‌రికి అల‌వాటు. మ‌రి ఇప్పుడు కూడా ఆయ‌న‌కు టికెట్ ద‌క్క‌లేదు. ఒక‌వేళ జ‌న‌సేన‌కు టికెట్ ఇచ్చి ఉంటే ప్ర‌భాక‌ర్ చౌద‌రి రెబ‌ల్ గా నామినేష‌న్ వేసేవారు. అయితే ఇప్పుడు అనూహ్యంగా వేరే క‌మ్మ వ్య‌క్తి తెర‌పైకి వ‌చ్చారు. అయిన‌ప్ప‌టికీ ప్ర‌భాక‌ర్ చౌద‌రి శాంతిస్తార‌ని అనుకోవ‌డానికి ఏమీ లేదు! అనంత‌పురం అర్బ‌న్ విష‌యంలో టీడీపీ త‌ర‌ఫున కొత్త పేరు తెర‌పైకి రావ‌డం, అది కూడా ఇన్నాళ్లూ వినిపించ‌ని పేరు రావ‌డం ఆ పార్టీలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది!

ఇక ధ‌ర్మ‌వ‌రం ర‌చ్చ స‌రేస‌రి! ఇక్క‌డ నుంచి గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓడిపోయిన క‌మ్మ కాంట్రాక్ట‌ర్ వ‌ర‌దాపురం సూరి ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చిన వెంట‌నే బీజేపీలో చేరిపోయారు. త‌న కాంట్రాక్టు వ్య‌వహారాల‌ను న‌డుపుకోవ‌డానికి ఆయ‌న బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీ క్యాడ‌ర్ ను ప‌ట్టించుకోవ‌డం మానేశారు. ఆ స‌మ‌యంలో ప‌రిటాల శ్రీరామ్ ను తెచ్చి ఇన్ చార్జిగా ప్ర‌క‌టించారు.  అయితే పొత్తులో భాగంగా ఈ సీటుకు బీజేపీకి అనే ప్ర‌చారం జ‌రిగే స‌రికి శ్రీరామ్ వ‌ర్గం ర‌చ్చ రేపింది. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ వ‌ర‌దాపురం సూరికి టికెట్ ఇవ్వ‌కూడ‌ద‌ని ఒత్తిడి చేసింది. చివ‌ర‌కు ఈ సీటును బీజేపీ పోటీకే కేటాయించినా, వ‌ర‌దాపురం సూరికి కాకుండా స‌త్య‌కుమార్ అనే స్థానికేత‌రుడికి, స్థానికుల‌కు తెలియ‌ని వ్య‌క్తికి టికెట్ ను కేటాయించారు. 

ఇప్పుడు సూరి వ‌ర్గం అగ్గిమీద గుగ్గిలం అవుతోంది. స‌త్య‌కుమార్ కు ఎలాగూ సూరి స‌హ‌కారం ఉండ‌దు. అంతేకాకుండా.. ఇండిపెండెంట్ గా బ‌రిలోకి దిగినా పెద్ద ఆశ్చ‌ర్యం లేదు! లేదా ఆఖ‌రి నిమిషంలో సూరి టీడీపీ బీఫారం సంపాదిస్తాడేమో కూడా చూడాల్సి ఉంది. ఇలాంటి టెక్నిక్ లు చంద్ర‌బాబు కొత్త కాదు. అయితే.. సూరికి ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ప‌రిటాల వ‌ర్గం స‌హ‌క‌రించ‌దు. ఆఖ‌రికి కేతిరెడ్డికి అయినా ప‌రిటాల వ‌ర్గం లోలోప‌ల ఓట్లేస్తుందేమో కానీ.. వ‌ర‌దాపురం సూరిని మాత్రం వారు స‌హించ‌రు! మ‌రోవైపు ఇక్క‌డ జ‌న‌సేన నేత రేగాటిప‌ల్లి మ‌ధుసూద‌న్ రెడ్డి ఉన్నారు. ఆయ‌నా  కోసం రోడ్డెక్కారు. ఎంత ర‌చ్చ జ‌రగాలో అంత ర‌చ్చా జ‌రుగుతోంది ధ‌ర్మ‌వ‌రంలో! ఏపీలో టీడీపీ అధికారం ఎప్పుడో చేప‌ట్టినా ధ‌ర్మ‌వ‌రం లో ఆ పార్టీనే గెలుస్తుంది. ఏపీలో టీడీపీ ఓడిపోయినప్పుడు గెలిచిన సంద‌ర్భాలున్నాయి! అలాంటి సీటు చోట ఇప్పుడు ఆ పార్టీ ప‌రిస్థితి దాదాపు ద‌య‌నీయంగా మారింది!

ఇక టీడీపీకి ఒక‌ప్ప‌టి కంచుకోట అయినా పెనుకొండ‌, రాప్తాడు నియోజ‌వ‌కవ‌ర్గాల్లో ఆ పార్టీ ఎదురీదుతోంది! వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నియోజ‌క‌వ‌ర్గాల్లో గ‌త ఎన్నిక‌ల్లో భారీ మెజారిటీలు సాధించ‌డం ద్వారా వ‌చ్చిన విశ్వాసంతో గ‌ట్టి పోటీ ఇస్తోంది. రాప్తాడులో అయితే ప‌రిటాల ఫ్యామిలీకి అంత తేలిక కాదు అని స్ప‌ష్టం అవుతోంది. మా తాత‌లు నేతులు తాగారు కాబ‌ట్టి.. అన్న‌ట్టుగా సాగుతోంది ప‌రిటాల సునీత‌, శ్రీరామ్ ల వ్య‌వ‌హారం. ఇంకా ప‌రిటాల ర‌వి పేరు చెప్పే ఓట్లు అడుగుతున్నారు త‌ప్ప‌, తాము ఇది చేశాం కాబ‌ట్టి.. ఓటేయండి అనే ఓట‌డిగే ప‌రిస్థితి లేకుండా పోయింది. మ‌రి ప‌రిటాల ర‌వి ఉద్ధ‌రించింది ఏమైనా గ‌ట్టిగా ఉందా చెప్పుకోవ‌డానికి అంటే... ఫ్యాక్ష‌న్ చ‌రిత్ర త‌ప్ప ఇంకేం లేదు! జ‌నాలు వాటిని ఇప్పుడు ప‌ట్టించుకునే ప‌రిస్థితుల్లో కూడా లేరు.

తాము ఫ‌లానా చెరువు నీళ్లు అందించాం కాబ‌ట్టి, తాము ఫ‌లానా సంక్షేమ ప‌థ‌కం ఇచ్చాం కాబ‌ట్టి తమ‌కు ఓటేయ‌మ‌ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే  ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వెళ్ల‌గ‌లుగుతున్నాడు. అయితే ప‌రిటాల ఫ్యామిలీకి ఇలాంటి అవ‌కాశం లేకుండా పోయింది. ఇక డ‌బ్బులు కూడా ఖ‌ర్చు పెట్ట‌రు అనే పేరూ ఉంది! క‌రోనా స‌మ‌యంలో కానీ.. ఆ త‌ర్వాత కానీ.. క్యాడ‌ర్ కోస‌మో, ప్ర‌జ‌ల కోస‌మో ఎక్క‌డా రూపాయి కూడా ఖ‌ర్చు పెట్ట‌లేదు, వాళ్లంతా డ‌బ్బులు ఖ‌ర్చు పెట్ట‌రు.. కేవ‌లం త‌మ పేరు చూసి ఓటేయాల‌న్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తార‌నే అభిప్రాయం కూడా స్థానికంగా ఉంది! ఇది కూడా ఇక్క‌డ గ‌ట్టి గా ఎదురుత‌న్నుతోంది. ఈ ఎన్నిక‌ల్లో గ‌నుక రాప్తాడులో ప‌రిటాల సునీత ఓడిపోతే.. వారి రాజ‌కీయ జీవితానికి కూడా ఫుల్ స్టాప్ ప‌డిన‌ట్టే!

ఇక ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుస‌రిస్తున్న సామాజిక‌వ‌ర్గ స‌మీక‌ర‌ణాలు కూడా తెలుగుదేశం పార్టీకి చుక్క‌లు చూపిస్తున్నాయి. అనంత‌పురం ఎంపీ సీటును కురుబ‌ల‌కు, హిందూపురం ఎంపీ సీటును బోయ‌ల‌కు కేటాయించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇది అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల మీద కూడా ప్ర‌భావం చూపుతోంది. తెలుగుదేశం పార్టీ కూడా ఎంపీ సీట్ల‌ను బీసీల‌కే కేటాయించినా..  అదంత ప్ర‌భావం చూపే అవ‌కాశాలు క‌నిపించ‌డం లేదు! బీసీలు తెలుగుదేశం పార్టీతో విసిగిపోయారు! అది స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది.

ఎక్క‌డైతే అభ్య‌ర్థుల‌పై వ్య‌తిరేక‌త ఉందో అక్క‌డ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థుల‌ను మార్చేసింది. మ‌డ‌కశిర‌లో సామాన్య స‌ర్పంచ్ ను, శింగ‌న‌మ‌ల‌లో సామాన్య కార్య‌క‌ర్త‌ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థులుగా ప్ర‌క‌టించింది. మ‌డ‌క‌శిర‌లో తెలుగుదేశం పార్టీ అభ్య‌ర్థిత్వంపై స్థానిక నాయ‌క‌త్వంలో వ్య‌తిరేక‌త ఎదురవుతోంది. క‌ల్యాణ‌దుర్గంలోనూ సేమ్ సీన్‌! పాత వాళ్ల‌ను కాదని కొత్త అభ్యర్థిని ప్ర‌క‌టించేస‌రికి వాళ్లు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు!

తెలుగుదేశం పార్టీ త‌ర‌ఫున అభ్య‌ర్థిత్వాల విష‌యంలో వివాదాలు లేని నియోజ‌క‌వ‌ర్గాలు చెప్ప‌డ‌మే క‌ష్టంగా మారింది. క‌దిరిలో కందికుంట వెంక‌ట‌ప్ర‌సాద్ కు టికెట్ కేటాయించారు. ఇక్క‌డ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనారిటీల‌కు టికెట్ ఇచ్చింది. గ‌తంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన అత్తార్ చాంద్ భాషా టీడీపీలోకి ఫిరాయించాడు. ఆయ‌న‌ను పూచిక‌పుల్ల కింద టీడీపీ ప‌క్క‌న పెట్టింది. రూర‌ల్ లో రెడ్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అక్క‌డ ద‌న్నుగా ఉంటారు. క‌దిరి టౌన్లో మైనారిటీలు క‌లిసి వ‌స్తే.. క‌దిరిలో వ‌ర‌స‌గా మూడోసారి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగ‌ర‌డంలో ఆశ్చ‌ర్యం లేదు!

పుట్ట‌ప‌ర్తి, తాడిప‌త్రి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల విష‌యంలో టీడీపీకి ర‌చ్చల్లేవు! తాడిప‌త్రిలో జేసీ ఫ్యామిలీ త‌ప్ప ఇంకో దిక్కులేదు, పుట్ట‌ప‌ర్తిలో ప‌ల్లె ర‌ఘ‌నాథ్ రెడ్డి త‌ప్ప ఇంకో దిక్కులేదు. పుట్ట‌ప‌ర్తిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే గ్రూపులు ఏర్ప‌డ్డాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేపై కొన్ని ప‌ల్లెల్లో కార్య‌క‌ర్త‌ల అసంతృప్తి ఉంది. మ‌రి ఆఖ‌రి స‌మ‌యంలో అయినా దుద్దుకుంట శ్రీధ‌ర్ రెడ్డి దాన్ని స‌రి చేసుకుంటే.. విజ‌యం సుల‌భం అవుతుంది. అయితే ప‌ల్లెను కాకుండా ఆయ‌న కోడ‌లిని టీడీపీ అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించింది! ఏనాడూ ఎండ క‌న్నెర‌గ‌ని ఆమె ప్రచారం తొలి వారంలోనే వ‌డ‌దెబ్బ పాలైంది! ఎమ్మెల్యే అంటే వారితో పురుషులే సుల‌భంగా యాక్సెస్ కోరుకుంటారు. ప‌ల్లె అభ్య‌ర్థిగా ఉంటే ఆయ‌న మ‌ద్ద‌తుదార్లైనా ఉత్సాహం చూప‌డానికి, ఆయ‌న కోడ‌లు అభ్య‌ర్థిత్వానికి చాలా తేడా ఉంటుంది. గ‌ట్టి పోటీ ఇచ్చే సీట్లో.. ఇలాంటి అభ్య‌ర్థిత్వం లో చిన్న మార్పు ద్వారా తెలుగుదేశం పార్టీ కాస్త వెనుక‌బ‌డింది! హిందూపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గ్రూపుల గోల టీడీపీకి క‌లిసి రావొచ్చు! ఉర‌వ‌కొండ‌లో పోటాపోటీ ప‌రిస్థితి క‌నిపిస్తోంది!

14 అసెంబ్లీ సీట్ల‌కు గానూ మినిమం ప‌ది చోట్ల విజ‌యం సాధించాల్సిన ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లా ప‌రిధిలో టీడీపీకి ఆ ఊపు అయితే క‌నిపించ‌డం లేదు! స‌గం చోట్ల విజ‌యం మీద ఎలాంటి ధీమా కనిపించ‌డ‌మే లేదు! మిగిలిన ఏడింటా.. గ‌ట్టి పోటీ అయితే ఉంటుంది కానీ, విజ‌యం ఎవ‌రైనా వ‌రించ‌వ‌చ్చు అనేలా క‌నిపిస్తోంది ప‌రిస్థితి. ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లాలో  స్వీప్ చేయ‌లేక‌పోతే మాత్రం టీడీపీ రాష్ట్రంలో అధికారం ఆశించ‌డం కూడా వ్య‌ర్థ‌మే! స్వీప్ సంగ‌తి మ‌రిచిపోయి.. స‌గం సీట్ల‌లో పోటీ ఇవ్వ‌డానికి టీడీపీ అల్లాడుతూ ఉంది!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?