Advertisement

Advertisement


Home > Politics - Analysis

‘సారీ కేసీఆర్‌! ఇట్లు.. తమ అవిధేయులు’

‘సారీ కేసీఆర్‌! ఇట్లు.. తమ అవిధేయులు’

ప్రజలు ప్రజలే.. మారరు మారుస్తారు. పచ్చనోట్లు పుచ్చుకుని వోటు వేసే వారు కూడా ప్రజలేనా.. అంటే.. అవును ప్రజలే..! ముమ్మాటికీ ప్రజలే. మేసేవాడే, విసురుతాడు. తక్కువ మేసేవాడు తక్కువ విసిరితే, ఎక్కువ మేసేవాడు ఎక్కువ విసురుతాడు. ఈ కిటుకు తెలిసిపోయిన వోటరు ఈవీఎం దగ్గరకు వెళ్ళాక నోటు ఇచ్చిన వాడి ‘మీటే’ నొక్కాలని లేదు. ఒక వేళ్ళ బరిలో వున్న పెద్ద పార్టీల వాళ్ళందరూ పంచేస్తానో..? వోటరుపని మరీ సుఖం. ఎలాంటి నేర భావనలేకుండా నొక్కేస్తాడు. మాట మీద నేత నిలవనప్పుడు, నోటు మీద వోటరు ఎందుకు నిలబడాలి?

అసెంబ్లీకి ఒక తెలుగు రాష్ట్రం (తెలంగాణ)లో ఎన్నికలు ముగిస్తే, ఇంకో తెలుగు రాష్ట్రంలో (ఆంధ్రప్రదేశ్‌)లో ఎన్నికలు మొదలవుతున్నాయి. తెలంగాణలో గెలిచిన కాంగ్రెస్‌ ఎలా గెలిచిందో, వోడిన బీఆర్‌ఎస్‌ ఎలా వోడిరదో వోటరుకు ఎరుక! రెండు పదవీ కాలాల పాటు పాలించిన బీఆర్‌ఎస్‌ వోడిపోవటం ఆశ్చర్యేమేమీ కాదు. కానీ వోడిపోయిన వెంటనే, బీఆర్‌ఎస్‌ పార్లమెంటు ఎన్నికలకు తలపడాల్సి వచ్చింది. కర్రసాములో చతికిలపడ్డ వాడిని కత్తి సాముకి దించుతున్నట్లయ్యింది.

‘టికెట్‌.. టికెట్‌..!’ అని బీఆర్‌ఎస్‌ అధినాయకత్వం అరుస్తున్నా స్వీకరించటానికి కాస్త పేరున్న నేతలు కూడా సిధ్ధంగా లేరు. నేతలు కాకపోతే, నేతల బిడ్డల కిద్దాం` అంటూ వారికిస్తున్నా పారిపోతున్నారు. కొందరు అయితే ముందే ‘సారీ అంకుల్‌!’ అనేస్తున్నారు. ఇంకొందరు అంగీకరించినట్టే అంగీకరించి, తర్వాత తిరస్కరిస్తున్నారు. కడియం శ్రీహరి తనయ కావ్య అలాగే చేశారు. అదే అసెంబ్లీ ఎన్నికలప్పుడయితే, టికెట్‌ రానందుకు కొందరు దొర్లి దొర్లి ఏడ్చారు.

(ఉపముఖ్యమంత్రి గా చేసిన రాజయ్య మాత్రమే కాదు, ఇలాంటి ప్రహసనాల్ని పలువరు అప్పట్లో సృష్టించారు.) బీఆర్‌ఎస్‌ మళ్ళీ గెలవటం ఖాయం అన్న భరోసా తో ఇలాంటి చవకబారు అలకలకు ఒడిగట్టారు. మరి ఇప్పుడో..? పార్లమెంటు ఎన్నికలలో బీఆర్‌ఎస్‌ వోటమి ఖాయం` అని వీళ్ళకి ఎవరయినా చెప్పేస్తున్నారా? సీనియర్‌ నేత కే. కేశవరావు సైతం, బీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పి, ఇంత లేటు వయసు (84వయేట)లో కాంగ్రెస్‌ పార్టీకి వెళ్ళిపోతున్నారంటే.. తెలంగాణకున్న 17 పార్లమెంటు సీట్లలో బీఆర్‌ఎస్‌కు సగానికి సగం కన్నా తక్కువ వస్తాయానా? కేకే వరకూ, తన పదవి కన్నా తన తనయ గద్వాల్‌ విజయలక్ష్మి హైదరాబాద్‌ మేయర్‌ పదవి భద్రంగా వుండాలనా?

వెళ్ళిపోతున్న వారందరూ ఒకే ఒక కారణాన్ని అత్యంత ఆకస్మికంగా కనిపెడుతున్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వహయాంలో జరిగిన అవినీతి కేసులూ, ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులూ ఒక్కొక్కటిగా బయిటకు వస్తున్నాయి కాబట్టి, ఆ పార్టీ ‘నిజ స్వరూపం’ ఇప్పుడు మాత్రమే తమకు బోధపడ్డట్టుగా చెబుతున్నారు. కావ్య బీఆర్‌ఎస్‌ పార్టీకి రాసిన లేఖలో ఈ కారణాన్నే బయిట పెట్టారు. దానికి తోడు ఢిల్లీ మద్యం కేసులో కేసీఆర్‌ తనయ కవిత ఆరెస్టు కావటాన్ని అదనంగా జోడిస్తున్నారు. వీరు చెబుతున్న కారణాలు విన్న వారికి రెండు అనుమానాలు వస్తాయి.

ఒకటి: వీరు లేదా వీరి తండ్రులు ఆ పార్టీ ప్రభుత్వంలో భాగం కారా?

రెండు: ఇలాంటి ‘భాగోతాలు’ నడుస్తున్నాయని వారు లోపల వున్నప్పుడు తెలియదా?

వెళ్ళిపోతున్న వాళ్ళని అలా వుంచితే, ఆహ్వానిస్తున్న కాంగ్రెస్‌ పార్టీ వీరి రాక పట్ల ద్విగిణీకృత ఉత్సాహంతో వుంది. అతి జాగ్రత్తగా చూస్తే, గతంలో (2019లో) బీఆర్‌ఎస్‌ (అప్పటి టీఆర్‌ఎస్‌) చేసిన తప్పే చేస్తోంది. ఆ తప్పిదం మరేమీ కాదు: ప్రధాన ప్రతిపక్షాన్ని శూన్యం చెయ్యటమే. ఈ తలంపే ప్రమాదకరం. ఎవరికీ? అధికార పక్షానికే!

‘గేట్లు ఎత్తేసాం’ అని ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి బహిరంగ ఆహ్వానం పలుకుతున్నారు. అంటే, బీఆర్‌ఎస్‌ శాసన సభ్యుల్లో మూడిరటా రెండో వంతు (ఫిరాయింపు చట్టం అడ్డుకోకుండా) ఖాళీ చేసే పని పెట్టుకున్నారా అని అనుమానం కూడా రావచ్చు. బీఆర్‌ఎస్‌ చేసిన పరి కూడా అదే. అప్పట్లో కాంగ్రెస్‌ శాసన సభ్యుల్ని ఇలాగే గోడ దూకించి ‘గులాబీ ఆకర్ష్‌’కు పాల్పడిరది. ఫలితంగా ఏమయింది? రాష్ట్రంలో  కాంగ్రెస్‌ కు బదులు బీజేపీ బలపడి ‘ఏక్‌’ మేకయ్యింది.

(అప్పట్లో రాజాసింగ్‌ ఏకైక బీజేపీ సభ్యుడిగా వుండేవారు). వెనువెంటనే వచ్చిన పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ నాలుగు స్థానాలు గెలుచుకోవటమే కాకుండా, తర్వాత జీహెచ్‌ఎంసి ఎన్నికల్లో ఓడినా, గెలిచినంత పనిచేసింది. దాంతో టీఆర్‌ఎస్‌ పని ఉక్కిరి బిక్కిరి అయ్యింది. దాంతో బీజేపీనే ‘పెద్ద బూచి’గా చూపే ప్రచారానికి బీఆర్‌ఎస్‌ అధినేత తెర తీయ్యాల్సి వచ్చింది.

హైదరాబాద్‌ మోడీ వచ్చినా, మర్యాద పూర్వకంగా కలిసే సంప్రదాయానికి సైతం తిలోదకాలిచ్చి ముఖం చాటేసేవారు. గవర్నర్‌ వున్న తమిళ సై అసెంబ్లీలో చెయ్యాల్సిన ప్రసంగాన్నే పరిహరించేశారు. దీంతో మళ్ళీ కాంగ్రెస్‌కు జాగా దొరికింది. కానీ కాంగ్రెస్‌ గెలిచేంతగా ఎదిగి పోతుందని మాత్రమ కేసీఆర్‌ ఊహించి వుండక పోవచ్చు. పెద్ద శత్రువు స్థానంలో చిన్న శత్రువును తెచ్చుకున్నానన్న సంబరంలో మునిగి వుండవచ్చు.

ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్‌ అదే పని చేసి బీఆర్‌ఎస్‌ను ఖాళీ చేస్తే, ఆ స్థానంలోకి బీజేపీ సునాయసంగా వచ్చి కూర్చుంటుంది. జరిగిన(2023) అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్‌ఎస్‌ 39 స్థానాలు పొందితే, బీజేపీ తన స్కోరును 8 కి పెంచుకుంది.  ఇప్పటికే  ముంచుకొస్తున్న పార్లమెంటు ఎన్నికలలో తెలంగాణ వరకూ పోటీ బీజేపీకీ బీఆర్‌ఎస్‌కీ అన్నట్టుగా వుంది. అదే నిజమైతే, పార్లమెంటు ఎన్నికలు ముగిసిన మరుక్షణం బీఆర్‌ఎస్‌ స్థానంలోకి బీజేపీకి వచ్చేస్తుంది.

అయితే కాంగ్రెస్‌ ఆహ్వానించక పోయినా, బీఆర్‌ఎస్‌ తనంతట తాను ప్రతిపక్షంలో నిలిచే శక్తిని ఇన్నేళ్లుగా కూడ బెట్టుకోలేక పోయింది. ఉద్యమం, ఉద్యమం అని వల్లించే కేసీఆర్‌, తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చిన పార్టీలా వుంచలేదు. జార్ఖండ్‌ ఉద్యమాన్ని సృష్టించిన శిబు సోరెన్‌, ఎన్ని ఆటు పోట్లు వచ్చినా, శ్రేణులు, సహ నేతలు ఆయనకు వెన్ను దన్నుగా వున్నారు. అలాంటి శ్రేణుల్ని కానీ, నేతల్ని కానీ సృష్టించుకోవటంలో బీఆర్‌ఎస్‌ ఘోరంగా విఫలమయ్యింది. విధేయుల ముసుగులో వున్న అవిధేయులే ఆ పార్టీ నిండా కనిపిస్తున్నారు. ఆ పార్టీకి కాయకల్ప చికిత్స తక్షణ ఆవసరం.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?