Advertisement

Advertisement

indiaclicks

Home > Politics - Analysis

నామినేష‌న్ల త‌ర్వాతే పిఠాపురంలో అస‌లు సినిమా!

నామినేష‌న్ల త‌ర్వాతే పిఠాపురంలో అస‌లు సినిమా!

జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్‌క‌ల్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తుండ‌డంతో అంద‌రి దృష్టి ఆ నియోజ‌క‌వ‌ర్గంపై ప‌డింది. గ‌త ఎన్నిక‌ల్లో గాజువాక‌, భీమ‌వ‌రం రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో పోటీ చేసిన ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, గెలుపు సాధించ‌లేక‌పోయారు. ఈ ద‌ఫా ఆయ‌న పిఠాపురానికి మ‌కాం మార్చారు. పిఠాపురంలో త‌న సామాజిక వ‌ర్గం ఓట్లు ఎక్కువ‌గా వుండ‌డం వ‌ల్లే అక్క‌డికి మారార‌నేది బ‌హిరంగ ర‌హ‌స్య‌మే.

మ‌రోవైపు వైసీపీ నుంచి కూడా కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన వంగా గీత పోటీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. వంగా గీత స్థానికురాలు కావ‌డం, కాపుల్లో మంచి ప‌ట్టు వుండ‌డంతో ఫ‌లితంపై స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కుంది. ఇదిలా వుండ‌గా వైసీపీ ఓ రేంజ్‌లో ప‌వ‌న్‌ను, జ‌న‌సేన నాయ‌కుల్ని భ‌య‌పెడుతోంది. అస‌లు సినిమా నామినేష‌న్ల త‌ర్వాత పిఠాపురంలో మొద‌లువుతుంద‌ని వైసీపీ విస్తృతంగా ప్ర‌చారం చేస్తోంది.

ఈ నెల 25న నామినేష‌న్ల ఘ‌ట్టం ముగుస్తుంది. అనంత‌రం వైసీపీ వ్యూహాలు ప‌క‌డ్బందీగా అమ‌లవుతాయ‌నే టాక్ వినిపిస్తోంది. మ‌రీ ముఖ్యంగా టీడీపీ ఇన్‌చార్జ్ వ‌ర్మ‌ను వైసీపీలో చేర్చుకోవ‌డం లేదా ఆయ‌న మ‌ద్ద‌తుదారులంద‌రిని త‌మ వైపు తిప్పుకోవ‌డంపై వైసీపీ ప్ర‌ధానంగా దృష్టి సారించింది. ఇప్ప‌టికే వ‌ర్మ‌పై టీడీపీ శ్రేణులు తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డుతున్నాయి. ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు మ‌ద్ద‌తు ఇవ్వ‌డాన్ని ఏ మాత్రం అంగీక‌రించ‌డం లేదు. వ‌ర్మ చెప్పినా టీడీపీ నాయ‌కులు వినిపించుకునే ప‌రిస్థితిలో లేరు.

ఇటీవ‌ల ప్ర‌చారానికి వెళ్లిన వ‌ర్మ‌పై టీడీపీ కార్య‌క‌ర్త‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన సంగ‌తి తెలిసిందే. నామినేష‌న్ల త‌ర్వాత వ‌ర్మ వెన్నుపోటు పొడుస్తార‌నే భ‌యం జ‌న‌సేన‌ను వెంటాడుతోంది. అందుకు త‌గ్గ‌ట్టుగానే వ‌ర్మ ప్ర‌వ‌ర్త‌న వుంద‌ని అంటున్నారు. త‌న‌కు తెలియ‌కుండా ఏదీ జ‌ర‌గ‌కూడ‌ద‌ని వ‌ర్మ ష‌ర‌తులు విధించ‌డాన్ని జ‌న‌సేన నాయ‌కులు అనుమానిస్తున్నారు. చివ‌రికి ఎన్నిక‌ల‌కు కొన్ని రోజులు ముందు న‌మ్మించి, త‌మ‌ను న‌ట్టేట ముంచుతార‌నే భ‌యం జ‌న‌సేన నేత‌ల్లో వుంది.

దీంతో వ‌ర్మ క‌ద‌లిక‌ల‌పై జ‌న‌సేన నాయ‌కులు ప్ర‌త్యేక నిఘా వుంచారు. వైసీపీ నేత‌ల‌తో వ‌ర్మ ట‌చ్‌లో ఉన్నారా? అనే కోణంలో నిత్యం జ‌న‌సేన ఆరా తీస్తుండ‌డం తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది. మ‌రో వైపు వ‌ర్మ నేరుగా వైసీపీలో చేర‌క‌పోయినా, ఆయ‌న మ‌ద్ద‌తు జ‌న‌సేన‌కు లేకుండా చేసేందుకు వైసీపీ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. అందుకే పిఠాపురంపై అంద‌రికీ ఆస‌క్తి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?