Advertisement

Advertisement


Home > Politics - Andhra

మోడీ వస్తూంటే.. పవన్, బాబు లకు టైం లేదా?

మోడీ వస్తూంటే.. పవన్, బాబు లకు టైం లేదా?

ప్రధాని మోడీ ప్రచారానికి వస్తూంటే.. బిజెపితో పొత్తు ఉన్న స్థానిక పార్టీలు పండగ చేసుకోవాలి. మోడీకి ఉన్న బ్రాండ్ ఇమేజీ అటువంటిది. స్థానిక నాయకులు తమ సభలకు జనాన్ని తోలించినట్టుగా అంత పెద్ద అవసరం ఉండదు. మోడీ వస్తున్నారంటేనే స్వచ్ఛందంగా ఎగబడి వచ్చే జనం కూడా ఉంటారు. అలాంటిది మోడీతో కలిసి సభలో పాల్గొనడాన్ని నాయకులు ప్రివిలేజీగా భావిస్తారు.

కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం పొత్తు పార్టీలు చిత్రంగా ప్రవర్తిస్తున్నాయి. ప్రధాని నరేంద్రమోడీ కలికిరిలో సభ నిర్వహిస్తే.. ఆయనతో వేదికను పంచుకోవడానికి చంద్రబాబునాయుడుకు, జనసేనాని పవన్ కల్యాణ్ కు టైం లేకపోవడం విశేషం.

భారతీయ జనతా పార్టీ తరఫున మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రాజంపేట ఎంపీగా పోటీచేస్తున్నారు. పీలేరు ఆయన సొంత అసెంబ్లీ నియోజకవర్గం. కలికిరి సొంత ఊరు. తాను ముఖ్యమంత్రిగా ఉండగా.. కలికిరి అభివృద్ధికి అనేక రకాల పనులు చేశారాయన. అలాగే ఇప్పుడు ఎంపీ ఎన్నికల్లో గెలుస్తానో లేదో.. కనీసం తన సొంత ఊరికి ఒకసారి ప్రధానిని తీసుకువచ్చిన ఘనత తన పరం చేసుకోవాలనుకున్నట్టుగా.. ఆయన కలికిరిలో ప్రధాని సభ ఏర్పాటు చేయించారు.

సాధారణంగా నాయకులు తమకు సొంత బలం అపరిమితంగా ఉన్న చోట కాకుండా, పోటా పోటీ ఉన్న ప్రాంతాల్లో సెలబ్రిటీ సభలు ఏర్పాటు చేయిస్తుంటారు. అలాంటప్పుడు.. ఆ సెలబ్రిటీల వల్ల కొన్ని ఓట్లు అదనంగా కలిసి వస్తాయనే ఆశ ఉంటుంది. కానీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం తన రూటే సెపరేటు అన్నట్టుగా వ్యవహరించారు.

ఈ ఎంపీ ఎన్నికల్లో ఆయనకు అంతో ఇంతో ఓట్లు పడతాయంటే.. అవి పీలేరు నియోజకవర్గం పరిధిలోని కలికిరి నుంచి మాత్రమే. అలా కాకుండా ఆయనకు ఓట్లు రాబట్టుకోవడం క్లిష్టమైన కడపజిల్లా పరిధిలోని రాజంపేట, కోడూరు నియోజకవర్గాల్లో మోడీ సభ పెట్టించుకుని ఉంటే బాగుండేది. గెలుపు ఎటూ దక్కేది కాదు గనుక.. కనీసం తన సొంత ఊరి ప్రజల్లో తన పట్ల క్రేజ్ ఉంటుందని.. కలికిరిలోనే కిరణ్ , మోడీ సభ పెట్టించుకున్నట్టుంది.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఈ సభకు చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ హాజరు కాలేదు. వారి పార్టీల తరఫున నారా లోకేష్, నాగబాబు మాత్రమే వచ్చారు. కూటమి ఐక్యతలో లుకలుకలకు ఇది కూడా నిదర్శనమా అనే చర్చ జరుగుతోంది. అయితే నల్లారి కిరణ్ కుటుంబంతో ఆయన తండ్రి తరంనుంచి చంద్రబాబుకు విభేదాలు ఉన్నాయి. ఆల్రెడీ ఒకసారి ఆయన పీలేరు పరిధిలో ప్రచారం నిర్వహించారు

తనకు ఆజన్మశత్రువైన కిరణ్ గెలుపుకోసం మరోసారి రావడం చంద్రబాబుకు ఇష్టం లేదేమో అనే చర్చ కూడా నడుస్తోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?