Advertisement

Advertisement


Home > Politics - Analysis

చిత్తూరులో గెలిచేదెవ‌రు? హోరాహోరీ ఎక్క‌డంటే?

చిత్తూరులో గెలిచేదెవ‌రు? హోరాహోరీ ఎక్క‌డంటే?

ఏపీ రాజ‌కీయాల్లో చిత్తూరుకు ప్ర‌త్యేక స్థానం వుంది. ఇక్క‌డి నుంచి ఇద్ద‌రు ముఖ్య‌మంత్రులు వ‌చ్చారు. నారా చంద్ర‌బాబునాయుడు, న‌ల్లారి కిర‌ణ్‌కుమార్‌రెడ్డి ఈ జిల్లా నుంచి ఎదిగిన రాజ‌కీయ నేత‌లు. మ‌రీ ముఖ్యంగా కూట‌మికి నాయ‌క‌త్వం వ‌హిస్తున్న చంద్ర‌బాబునాయుడి సొంత జిల్లాలో రాజ‌కీయ ఆధిప‌త్యం ఎవ‌రిదో తెలుసుకోవాల‌నే ఉత్కంఠ ప్ర‌తి ఒక్క‌రిలో వుంటుంది.

చంద్ర‌బాబునాయుడి సొంత జిల్లా అయిన‌ప్ప‌టికీ, రాజ‌కీయ‌, సామాజిక స‌మీక‌ర‌ణ‌ల రీత్యా ఆయ‌న ఆధిప‌త్యం ప్ర‌ద‌ర్శించ‌లేకపోతున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో కేవ‌లం చంద్ర‌బాబునాయుడు ప్రాతినిథ్యం వ‌హిస్తున్న కుప్పంలో మాత్ర‌మే టీడీపీ విజ‌యం సాధించింది. మిగిలిన 13 నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ విజ‌య కేత‌నం ఎగుర వేసింది. 2014 ఎన్నిక‌ల్లోనూ టీడీపీ ఆరు, వైసీపీ 8 స్థానాల్లో గెలుపొందాయి. అయితే ప‌ల‌మ‌నేరు నుంచి గెలుపొందిన ఎన్‌.అమ‌ర్నాథ్‌రెడ్డి టీడీపీలో చేరారు. ఈ నేప‌థ్యంలో 2024 ఎన్నిక‌ల్లో ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాలో ఫ‌లితాలు ఎలా ఉండ‌బోతున్నాయో తెలుసుకోడానికి ప్ర‌జానీకం ఎదురు చూస్తోంది.

క్షేత్ర‌స్థాయిలో రాజ‌కీయ ప‌రిస్థితుల్ని చూసి, ఏఏ నియోజ‌క‌వ‌ర్గంలో ఎవ‌రి బ‌లం ఎంతో అంచ‌నా వేయ‌డ‌మే ఈ క‌థ‌నం ఉద్దేశం. ముందుగా చంద్ర‌బాబు ప్రాతినిథ్యం వ‌హిస్తున్న కుప్పం నియోజ‌క‌వ‌ర్గంలో ఎలా వుందో చూద్దాం. గ‌త ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబునాయుడు త‌న స‌మీప ప్ర‌త్య‌ర్థి కె.చంద్ర‌మౌళిపై 30,722 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014 ఎన్నిక‌ల‌తో పోలిస్తే చంద్ర‌బాబు మెజార్టీ త‌గ్గింది. ఈ ద‌ఫా చంద్ర‌బాబు ప్ర‌త్య‌ర్థి చంద్ర‌మౌళి కుమారుడు కెఎస్ భ‌ర‌త్‌. ప్ర‌స్తుతం ఈయ‌న ఎమ్మెల్సీ కూడా. చంద్ర‌బాబుపై భ‌ర‌త్‌ను గెలిపిస్తే త‌న కేబినెట్‌లో చోటు క‌ల్పిస్తాన‌ని ప‌దేప‌దే ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ చెబుతున్నారు.

వై నాట్ 175 నినాదంతో జ‌గ‌న్ దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ఎలాగైనా కుప్పంలో కూడా వైసీపీ గెల‌వాల‌న్న ల‌క్ష్యంతో మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డికి జ‌గ‌న్ బాధ్య‌త అప్ప‌గించారు. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేయ‌డంతో, ఆ స్ఫూర్తితో ఈ ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబును ఓడించాల‌నే ప‌ట్టుద‌ల‌తో వైసీపీ నాయ‌కులున్నారు. అయితే కుప్పంలో చంద్ర‌బాబును ఓడించ‌డం అంత సులువు కాదు. ఈ ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు మెజార్టీని పెంచేలా వైసీపీ నేత‌ల చేష్ట‌లున్నాయి. ఎమ్మెల్సీ భ‌ర‌త్ ప్ర‌తి చిన్న ప‌నికి లంచం అడుగుతున్నారనే ఆరోప‌ణ బ‌లంగా వుంది. పైగా చంద్ర‌బాబు సీఎం అభ్య‌ర్థి కావ‌డంతో, ఆయ‌న వైపే అక్క‌డి ప్ర‌జానీకం మొగ్గు వుంది.

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యంతో చంద్ర‌బాబు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. రెండు మూడు నెల‌ల‌కు ఒక‌సారి కుప్పానికి వెళుతూ, ఎప్ప‌టిక‌ప్పుడు నియోజ‌క‌వ‌ర్గ ప‌రిస్థితుల‌పై స‌మీక్షిస్తున్నారు. గ్రామస్థాయి నాయ‌కుల‌తో కూడా ఆయ‌న మాట్లాడుతున్నారు. ఎమ్మెల్సీ శ్రీ‌కాంత్ నేతృత్వంలో కుప్పంలో ప‌క‌డ్బందీ నెట్‌వ‌ర్క్‌ను చంద్ర‌బాబు ఏర్పాటు చేసుకున్నారు. కావున కుప్పంపై వైసీపీ ఆశ‌లు వ‌దిలేసుకోవ‌చ్చు. ఈ నియోజ‌క‌వ‌ర్గంపై పెట్టే శ్ర‌ద్ధ‌, ఖ‌ర్చు ...ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాలోని ఇత‌ర నియోజ‌క వ‌ర్గాల‌పై పెడితే ప్ర‌యోజ‌న‌మ‌ని వైసీపీ పెద్ద‌లు గ్ర‌హిస్తే మంచిది.

పుంగనూరుకు వెళ్దాం. ఇక్క‌డి నుంచి మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి ప్రాతినిథ్యం వ‌హిస్తున్నారు. ఈయ‌న ప్ర‌త్య‌ర్థులు టీడీపీ నుంచి చ‌ల్లా బాబు, బీసీవై పార్టీ నుంచి రామ‌చంద్ర యాద‌వ్. టీడీపీ నుంచి పెద్దిరెడ్డి పెద్ద‌గా ఇబ్బంది ప‌డ‌డం లేదు. కానీ బీసీవై పార్టీ అధ్య‌క్షుడు రామ‌చంద్ర‌యాద‌వ్ చెవిలో జోరీగ మాదిరిగా పెద్దిరెడ్డిని ఇబ్బంది పెడుతున్నారు. ఎలాగైనా రామ‌చంద్ర‌యాద‌వ్‌ను అణ‌చివేయాల‌ని పెద్దిరెడ్డి విశ్వ ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ అత‌ను మాత్రం త‌గ్గేదే లే అని రెచ్చిపోతున్నారు. కానీ ఎన్నిక‌ల్లో మాత్రం పెద్దిరెడ్డిదే విజ‌యం.

చిత్తూరులో రాజ‌కీయ ప‌రిస్థితి ఏంటో తెలుసుకుందాం. ఇక్క‌డి వైసీపీ అభ్య‌ర్థిగా ఎం.విజ‌యానంద‌రెడ్డి, టీడీపీ త‌ర‌పున గుర‌జాల జ‌గ‌న్‌మోహ‌న్‌రావు (క‌మ్మ‌) నువ్వానేనా అనే రీతిలో త‌ల‌ప‌డుతున్నారు. సిటింగ్ ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీ‌నివాసులుకు సీటు ఇవ్వ‌లేదు. వైసీపీ, టీడీపీ రెండు పార్టీలు కొత్త అభ్య‌ర్థుల్ని బ‌రిలో నిలిపాయి. బ‌లిజ సీటు అయిన చిత్తూరులో క‌మ్మ నాయ‌కుడిని నిల‌ప‌డం ఏంటంటూ ఆ సామాజిక వ‌ర్గానికి చెందిన నేత‌లు భారీ ర్యాలీ నిర్వ‌హించారు. జ‌గ‌న్‌మోహ‌న్‌రావును మార్చ‌క‌పోతే ఓడిస్తామ‌ని బ‌లిజ‌లు హెచ్చ‌రించారు.

ఆ త‌ర్వాత ఏమైందో తెలియ‌దు కానీ, అంతా స‌ర్దుబాటు అయ్యింది. టీడీపీ అభ్య‌ర్థికి మాజీ ఎమ్మెల్యే సీకేబాబు మ‌ద్ద‌తు తోడైంది. దీంతో టీడీపీ, వైసీపీ మ‌ధ్య పోరు హోరాహోరీని త‌ల‌పిస్తోంది. ఎవ‌రు గెలుస్తారో చెప్ప‌లేని ప‌రిస్థితి. ఖ‌ర్చు విష‌యంలో ఇరు పార్టీల నేత‌లు ఒక‌రికి మించి మ‌రొక‌రు ఉన్నారు. దీంతో జ‌యాప‌జ‌యాల‌ను అంచ‌నా వేయ‌లేక‌పోతున్నారు.

తిరుప‌తిలో వైసీపీ త‌ర‌పున సిటింగ్ ఎమ్మెల్యే భూమ‌న కరుణాక‌ర‌రెడ్డి త‌న‌యుడు అభిన‌య్‌, కూటమి త‌ర‌పున జ‌న‌సేన అభ్య‌ర్థి ఆర‌ణి శ్రీ‌నివాసులు త‌ల‌ప‌డుతున్నారు. చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే ఆర‌ణికి జ‌గ‌న్ టికెట్ ఇవ్వ‌క‌పోవ‌డంతో జ‌న‌సేనలో చేరి టికెట్ తిరుప‌తి టికెట్ ద‌క్కించుకున్నారు. డిప్యూటీ మేయ‌ర్‌గా అభిన‌య్ తిరుప‌తి రూపు రేఖ‌లు మార్చిన ఘ‌న‌తను సొంతం చేసుకున్నారు. అలాగే ప్ర‌త్య‌ర్థి పార్టీల్లోని లుక‌లుక‌లు వైసీపీకి క‌లిసొచ్చే అంశాలు. మ‌రోసారి తిరుప‌తిలో వైసీపీ జెండా రెప‌రెప‌లాడ‌నుంది.

జీడీనెల్లూరుకు వెళితే... ఇక్క‌డో విచిత్ర ప‌రిస్థితి. ఈ నియోజ‌క‌వ‌ర్గం వైసీపీకి కంచుకోట‌. ఇక్క‌డి నుంచి డిప్యూటీ సీఎం కె.నారాయ‌ణ‌స్వామి ప్రాతినిథ్యం వ‌హిస్తున్నారు. ఇప్పుడు ఆయ‌న కుమార్తె కృపాల‌క్ష్మి వైసీపీ త‌ర‌పున పోటీ చేస్తున్నారు. టీడీపీ నుంచి థామ‌స్ బ‌రిలో నిలిచారు. జీడీనెల్లూరు అభ్య‌ర్థిని సీఎం జ‌గ‌న్‌ రెండుసార్లు మార్చారంటే, ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఎంత గంద‌ర‌గోళం ఉందో అర్థం చేసుకోవ‌చ్చు.

నారాయ‌ణ‌స్వామిని మొద‌ట చిత్తూరు ఎంపీ అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించారు. చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప‌ను జీడీనెల్లూరు ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించారు. దీంతో నారాయ‌ణ‌స్వామితో విసిగిపోయిన జీడీనెల్లూరు నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు, ముఖ్యంగా వైసీపీ శ్రేణులు హ‌మ్మ‌య్య అని ఊపిరి పీల్చుకున్నాయి. మ‌రోసారి వైసీపీదే విజ‌యం అని అంతా అనుకున్నారు. ఈ లోపు ఏం జ‌రిగిందో తెలియ‌దు. మ‌ళ్లీ రెడ్డెప్ప‌ను చిత్తూరు ఎంపీ అభ్య‌ర్థిగా, నారాయ‌ణ‌స్వామిని జీడీనెల్లూరు అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించారు. ఆ త‌ర్వాత కొన్ని రోజుల‌కు మ‌ళ్లీ నారాయ‌ణ‌స్వామి కూతురిని అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించారు.

మ‌రోవైపు టీడీపీ అభ్య‌ర్థి థామ‌స్ ప‌రిస్థితి అంత గొప్ప‌గా లేదు. ఆయ‌న‌కు టీడీపీ, జ‌న‌సేన నుంచి  స‌హ‌కారం అంతంత మాత్ర‌మే. గ‌త ఎన్నిక‌ల్లో ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి త‌న స‌మీప టీడీపీ అభ్య‌ర్థిపై 45,594 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. జీడీనెల్లూరులో రెడ్ల సామాజిక వ‌ర్గం ఓట్లు సుమారు 60 వేలు ఉన్న‌ట్టు ఓ లెక్క‌. అయితే రెడ్ల‌ను నిత్యం బండ‌బూతులు తిట్ట‌డ‌మే ప‌నిగా నారాయ‌ణ‌స్వామి పెట్టుకున్నారు. సీఎం జ‌గ‌న్‌పై స్వామి భ‌క్తిని ప్ర‌ద‌ర్శిస్తూ, నియోజ‌క‌వ‌ర్గానికి వ‌చ్చే స‌రికి గౌర‌వం లేకుండా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే కోపం రెడ్ల‌లో వుంది. దీంతో తాను జంతువును నిల‌బెట్టినా గెలిపిస్తార‌నే ధీమాతో ఉన్న సీఎం జ‌గ‌న్‌కు గుణ‌పాఠం చెప్పేందుకు, ఈ ద‌ఫా జీడీనెల్లూరు ఓట‌ర్లు సిద్ధంగా ఉన్నారు. కంచుకోట అయిన జీడీనెల్లూరులో నారాయ‌ణ‌స్వామి కుటుంబాన్ని ప‌క్క‌న పెట్ట‌ని సీఎం జ‌గ‌న్ రానున్న ఎన్నిక‌ల్లో త‌గిన మూల్యాన్ని చెల్లించుకునే అవ‌కాశాలే ఎక్కువ‌.

చంద్ర‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో పోటాపోటీ వుంది. వ‌రుస‌గా రెండు సార్లు ఇక్క‌డి నుంచి చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి విజ‌యం సాధించారు. ఇప్పుడు చెవిరెడ్డి ఒంగోలు పార్ల‌మెంట్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. భాస్క‌ర్‌రెడ్డి కుమారుడు మోహిత్‌రెడ్డి ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా బ‌రిలో వున్నారు. టీడీపీ నుంచి పులివ‌ర్తి నాని ముచ్చ‌ట‌గా మూడోసారి త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకోడానికి సిద్ధ‌మ‌య్యారు. జ‌నానికి ఏం కావాలో, వాటిని నిత్యం పంచ‌డంలో చెవిరెడ్డి కుటుంబం త‌ల‌మున‌క‌లై వుంటుంది. పులివ‌ర్తి నాని కుటుంబం మాత్రం... నీతి క‌థ‌లు చెబుతూ, చెవిరెడ్డి పంప‌కాల‌ను అడ్డుకునే ప‌నిలో నిమ‌గ్న‌మైంది. ఇక్క‌డ చెవిరెడ్డి మోహిత్ విజ‌యాన్ని పులివ‌ర్తి అడ్డుకునే ప‌రిస్థితిలో లేరు.

తంబ‌ళ్ల‌ప‌ల్లెలో పెద్దిరెడ్డి ద్వార‌క‌నాథ‌రెడ్డి (వైసీపీ), దాస‌రిప‌ల్లె జ‌యచంద్రారెడ్డి (టీడీపీ) త‌ల‌ప‌డుతున్నారు. టీడీపీ ఇన్‌చార్జ్‌, బీసీ నాయ‌కుడు శంక‌ర్‌యాద‌వ్‌ను ప‌క్క‌న పెట్ట‌డం ఆ పార్టీకి పెద్ద దెబ్బే. ఇదే సంద‌ర్భంలో ద్వార‌కనాథ‌రెడ్డికి నోటి దురుసు ఎక్కువ‌నే మాట వినిపిస్తోంది. వైసీపీపై అభిమానం ఉన్నా, వ్య‌క్తిగ‌తంగా ద్వార‌కనాథ‌రెడ్డి అభ్య‌ర్థిత్వంపై పెద‌వి విరుపు. ఇక్క‌డ శంక‌ర్‌యాద‌వ్‌కు టికెట్ ఇచ్చినా, లేదంటే జ‌య‌చంద్రారెడ్డికి అత‌ని మ‌ద్ద‌తు ఉన్నా... టీడీపీ త‌ప్ప‌క గెలిచేది. ఇప్పుడు టీడీపీలో టికెట్ రేపిన చిచ్చు... వైసీపీకి అదృష్ట‌వ‌శాత్తు క‌లిసి రావాలి. అంతే త‌ప్ప‌, ద్వార‌క‌నాథ‌రెడ్డిపై పెద్ద‌గా స‌ద‌భిప్రాయం లేదని చెప్ప‌క త‌ప్ప‌దు. ప్ర‌స్తుతానికి గ‌ట్టి పోటీ వుండ‌నుంది.

పీలేరు నుంచి వైసీపీ త‌ర‌పున చింత‌ల రామ‌చంద్రారెడ్డి, టీడీపీ నుంచి న‌ల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి త‌ల‌ప‌డుతున్నారు. రెండు సార్లు ఓడిపోయిన కిషోర్‌, ఈ ద‌ఫా ఎలాగైనా గెలుపొందాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. కిషోర్‌రెడ్డి అన్న, మాజీ ముఖ్య‌మంత్రి కిర‌ణ్‌కుమార్‌రెడ్డి రాజంపేట లోక్‌స‌భ స్థానం నుంచి బీజేపీ అభ్య‌ర్థిగా పోటీ చేస్తున్నారు. పిలేరులో ముస్లిం మైనార్టీల ఓట్లు ఎక్కువ‌. సొంత అన్న బీజేపీ అభ్య‌ర్థి కావ‌డం, టీడీపీ పొత్తులో ఉండ‌డంతో ఆ ఎఫెక్ట్ త‌న‌పై ప‌డుతుంద‌ని ఆయ‌న ఆందోళ‌న చెందుతున్నారు. బీజేపీపై వ్య‌తిరేక‌త‌తో ముస్లిం మైనార్టీ ఓట‌ర్లు గంప‌గుత్త‌గా వైసీపీకి ఓట్లు వేస్తే ... మ‌రోసారి కిషోర్ ఓట‌మి త‌ప్ప‌క పోవ‌చ్చు. లేదంటే కిషోర్‌కు గెలుపు అవ‌కాశాలున్నాయి.

ప‌ల‌మ‌నేరులో వెంక‌టేష్ గౌడ్ (వైసీపీ), ఎన్‌.అమ‌ర్నాథ్‌రెడ్డి (టీడీపీ) త‌ల‌ప‌డుతున్నారు. వెంక‌టేష్ గౌడ్ ఆర్థికంగా ఇబ్బందులు ప‌డుతున్నార‌నే మాట వినిపిస్తోంది. అమ‌ర్నాథ్‌రెడ్డి కుటుంబానికి నియోజ‌క‌వ‌ర్గంలో చెప్పుకోద‌గ్గ ప‌లుకుబ‌డి వుంది. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో అమ‌ర్నాథ్‌రెడ్డి వైపు మొగ్గు క‌నిపిస్తోంది. ఇంకా ఎన్నిక‌ల‌కు స‌మ‌యం ఉంది. ఈ లోపు వైసీపీ అధిష్టానం ప్ర‌త్యేక శ్ర‌ద్ధ చూపి, లోపాల‌ను స‌రిదిద్దుకుంటే వైసీపీకి చాన్స్ వుంటుంది.

పూత‌ల‌ప‌ట్టు (ఎస్సీ రిజ‌ర్వ్‌డ్‌) నియోజ‌క‌వ‌ర్గంలో ఎం.సునీల్‌కుమార్ (వైసీపీ), క‌లికిరి ముర‌ళీమోహ‌న్ (టీడీపీ) పోటీ ప‌డుతున్నారు. సిటింగ్ ఎమ్మెల్యే ఎంఎస్ బాబుకు టికెట్ ద‌క్క‌లేదు. సునీల్‌కుమార్ వైపు వైసీపీ మొగ్గు చూపింది. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో మ‌రోసారి వైసీపీ పాగా వేయ‌నుంది. జ‌ర్న‌లిస్టు అయిన టీడీపీ అభ్య‌ర్థి ముర‌ళీమోహ‌న్‌కు భంగ‌పాటు త‌ప్ప‌దు.

శ్రీ‌కాళ‌హ‌స్తి నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ త‌ర‌పున బియ్య‌పు మ‌ధుసూద‌న్‌రెడ్డి బ‌రిలో నిలిచారు. టీడీపీ నుంచి దివంగ‌త మాజీ మంత్రి బొజ్జ‌ల గోపాల‌కృష్ణారెడ్డి త‌న‌యుడు సుధీర్‌రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇద్ద‌రు నేత‌లు ఒక‌రు మ‌న్ను, మ‌రొక‌రు దుమ్ము. బియ్య‌పు మ‌ధుసూద‌న్‌రెడ్డిపై ఫ‌లానా ఆరోప‌ణ లేద‌ని చెప్ప‌లేని ప‌రిస్థితి. ప్ర‌త్య‌ర్థుల‌పై ఇష్టానుసారం కేసులు పెట్టారంటారు. క‌రోనా స‌మ‌యంలో మాత్రం ప్ర‌జానీకానికి కావాల్సిన ఇంటి స‌రుకులు పంపిణీ చేశారు. వైసీపీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల్ని పూర్తిగా విస్మ‌రించార‌నే ఆరోప‌ణ‌లున్నాయి. అందుకే ఎన్నిక‌ల స‌మ‌యం వ‌చ్చే స‌రికి మండ‌ల‌, గ్రామ‌స్థాయి నాయ‌కులు దూర‌మ‌వుతున్నారు.

బొజ్జ‌ల సుధీర్‌రెడ్డి ఎక్కువ‌గా హైద‌రాబాద్‌కే ప‌రిమితం అయ్యారు. ఏడాదిన్న‌ర‌గా మాత్ర‌మే ఆయ‌న శ్రీ‌కాళ‌హ‌స్తి నియోజ‌క‌వ‌ర్గంలో తిరుగుతున్నారు. సుధీర్‌కు మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు, జ‌న‌సేన ఇన్‌చార్జ్ కోటా వినుత స‌హ‌కారం లేదు. అంద‌ర్నీ క‌లుపుకుని వెళ్ల‌డంలో సుధీర్ విఫ‌ల‌మ‌య్యారు. ఇరుపార్టీల్లోనూ లుక‌లుక‌లు స‌మాన స్థాయిలో వున్నాయి. అందుకే పోటీ హోరాహోరీని త‌ల‌పిస్తోంది.

న‌గ‌రిలో సినీ, రాజ‌కీయ సెల‌బ్రిటీ ఆర్కే రోజా వైసీపీ నుంచి మూడోసారి బ‌రిలో నిలిచారు. జ‌గ‌న్ కేబినెట్‌లో రోజా మంత్రి. రెండు తెలుగు రాష్ట్రాల దృష్టిని న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గం ఆక‌ర్షిస్తోంది. టీడీపీ నుంచి గాలి భానుప్ర‌కాశ్ పోటీ చేస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో రోజా చేతిలో భాను ఓట‌మి రుచి చూశారు. ఈ ద‌ఫా రోజా సొంత పార్టీ నేత‌ల నుంచి వ్య‌తిరేక‌త ఎదుర్కొంటున్నారు. అయితే వాళ్లంతా ఓట్లు లేని వాళ్ల‌ని రోజా కొట్టి పారేస్తున్నారు. ఇదే సంద‌ర్భంలో గాలి భానుప్ర‌కాశ్‌పై టీడీపీలో తీవ్ర వ్య‌తిరేక‌త వుంది. చివ‌రికి సొంత కుటుంబ స‌భ్యులు కూడా ఆయ‌న‌కు స‌హ‌క‌రించ‌డం లేదు. దీంతో పోరు ఉత్కంఠ రేకెత్తిస్తోంది. చివ‌రి వ‌ర‌కూ విజ‌యం ఎవ‌రిదో చెప్ప‌లేని ప‌రిస్థితి.

స‌త్య‌వేడులో ఆస‌క్తిక‌ర రాజ‌కీయ ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. వైసీపీ సిటింగ్ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలానికి సీఎం జ‌గ‌న్ టికెట్ నిరాకరించారు. ఆదిమూలాన్ని తిరుప‌తి ఎంపీ అభ్య‌ర్థిగా, అలాగే తిరుప‌తి ఎంపీ డాక్ట్ మ‌ద్దిల గురుమూర్తిని స‌త్య‌వేడు ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా వైసీపీ ప్ర‌క‌టించింది. అయితే ఎంపీగా వెళ్ల‌డానికి కోనేటి ఆదిమూలం ఏ మాత్రం ఇష్ట‌ప‌డ‌లేదు. త‌న‌కు ఎమ్మెల్యే టికెట్ రాకుండా మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి చేశార‌ని ఆదిమూలం తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. దీంతో ఆయ‌న్ను ఎంపీ అభ్య‌ర్థిగా త‌ప్పించారు.

తిరుప‌తి ఎంపీ అభ్య‌ర్థిగా సిటింగ్ ఎంపీ గురుమూర్తినే కొన‌సాగించారు. స‌త్య‌వేడు ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా నూక‌తోటి రాజేష్‌ను బ‌రిలో నిలిపారు. మ‌రోవైపు టీడీపీ అభ్య‌ర్థిగా కోనేటి ఆదిమూలాన్ని ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం. దీంతో స‌త్య‌వేడు టీడీపీ నాయ‌కుడు జేడీ రాజ‌శేఖ‌ర్ తిరుగుబాటు బావుగా ఎగుర వేశారు. ఇప్పుడాయ‌న కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి న్యాయం చేయాల‌ని ప్ర‌తి గ‌డ‌పా తొక్కుతున్నారు. అయితే వైసీపీ అభ్య‌ర్థి రాజేష్ యాక్టీవ్ కావాల్సిన అవ‌స‌రం వుంది. అమావాస్య‌, పుణ్నానికో సారి ఆయ‌న ఎన్నిక‌ల ప్ర‌చారానికి వెళ్తున్నార‌నే ఆరోప‌ణ వుంది. ప్ర‌స్తుతానికి అక్క‌డ వైసీపీకి అనుకూల ప‌రిస్థితి వుంది.

చివ‌రిగా మ‌ద‌న‌ప‌ల్లెలో రాజ‌కీయ ప‌రిస్థితి ఎలా వుందో తెలుసుకుందాం. మ‌ద‌న‌ప‌ల్లె సిటింగ్ ఎమ్మెల్యేను మార్చ‌డం వైసీపీ ఆన‌వాయితీగా పెట్టుకుంద‌ని జ‌నం అనుకుంటున్నారు. మ‌ద‌న‌ప‌ల్లె సిటింగ్ ఎమ్మెల్యే మ‌హ‌మ్మ‌ద్ న‌వాజ్‌బాషాను కాద‌ని నిస్సార్ అహ్మ‌ద్‌కు వైసీపీ టికెట్ ఇచ్చింది. టీడీపీ కూడా ముస్లిం అభ్య‌ర్థి వైపే మొగ్గు చూపింది. షాజ‌హాన్ బాషాను టీడీపీ బ‌రిలో నిలిపింది. ఈయ‌న 2009లో కాంగ్రెస్ త‌ర‌పున గెలుపొందారు. మ‌రీ ముఖ్యంగా షాజ్‌హాన్ బాషా నిత్యం ప్ర‌జ‌ల్లో వుంటున్నారు. మంచి వ్య‌క్తి అయిన  సిటింగ్ ఎమ్మెల్యే మ‌హ‌మ్మ‌ద్ న‌వాజ్‌బాషాను మార్చార‌నే కోపం ముస్లింల‌లో వుంది. వైసీపీ తాజా అభ్య‌ర్థి నిస్సార్ అహ్మ‌ద్‌కు జ‌నంలో అంత ప‌లుకుబ‌డి లేదు. మ‌రోవైపు షాజ‌హాన్‌కు మంచి పేరు వుండ‌డంతో టీడీపీకి అనుకూల ప‌రిస్థితులున్నాయి. ఒక‌వేళ బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకుంద‌నే కార‌ణంతో షాజ‌హాన్‌బాషాకు వ్య‌తిరేకంగా ఓట్లు వేస్తే త‌ప్ప‌, ఇక్కడ వైసీపీకి గెలుపు అవ‌కాశాలు చాలా త‌క్కువ‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

మొత్తంగా చూస్తే... ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాలో కుప్పం, ప‌ల‌మ‌నేరు, మ‌ద‌న‌ప‌ల్లె, పీలేరు, జీడీనెల్లూరుల‌లో టీడీపీకి గెలుపు అవ‌కాశాలున్నాయి. తిరుప‌తి, పుంగ‌నూరు, చంద్ర‌గిరి, పూత‌ల‌ప‌ట్టు, స‌త్య‌వేడుల‌లో వైసీపీ గెలిచే అవ‌కాశాలున్నాయి. చిత్తూరు, న‌గ‌రి, శ్రీ‌కాళ‌హ‌స్తి, తంబ‌ళ్ల‌ప‌ల్లెలో ర‌స‌వ‌త్త‌ర పోటీ త‌ప్ప‌ద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. కేవ‌లం వైసీపీ ప్ర‌భుత్వ లోపాలే, ఆ పార్టీ కొంప ముంచ‌నున్నాయి. రాయ‌ల‌సీమ‌లో మిగిలిన నియోజ‌క‌వ‌ర్గాల కంటే ఉమ్మ‌డి చిత్తూరులో అధ్వానంగా వుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీలు ఇప్ప‌టికైనా అప్ర‌మ‌త్తం అయ్యే దాన్ని బ‌ట్టి హోరాహోరీగా త‌ల‌ప‌డే నియోజ‌క‌వ‌ర్గాల్లో గెలిచే అవ‌కాశాలు ఉన్నాయి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?