రాజకీయాల్ని డబ్బు శాసిస్తోందన్నది జగమెరిగిన సత్యం. డబ్బు, కులం… ఇవే ఇప్పటి ఎన్నికల్లో కీలక అంశాలు. రాజకీయాలతో ఏ మాత్రం సంబంధం లేని పారిశ్రామికవేత్తలు, కాంట్రాక్టర్లకు అన్ని రాజకీయ పార్టీలు పిలిచి మరీ ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు ఇస్తున్నాయి. ఇందులో ఏ రాజకీయ పార్టీకి మినహాయింపు లేదు. డబ్బుతో ఓట్లను కొనుగోలు చేసి, చట్టసభల్లో సులువుగా అడుగు పెట్టొచ్చని రాజకీయ నేతలు భావిస్తున్నారు. ఇందుకు తగ్గట్టుగానే క్షేత్రస్థాయి పరిస్థితులున్నాయి.
అందుకే మన ప్రజాస్వామ్య వ్యవస్థ ఇలా తయారైందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికారంలో ఐదేళ్ల పాటు ఉన్న వైసీపీ నేతలు బాగా డబ్బు సంపాదించుకుని, ఇప్పుడు బయటికి తీయకపోవడంపై సొంత పార్టీ శ్రేణులు మండిపడుతున్నాయి. ఉదాహరణకు నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ అభ్యర్థి బ్రిజేంద్రనాథ్‌రెడ్డి అలియాస్ నాని, ఉమ్మడి కడప జిల్లా కమలాపురం, రాజంపేట, కోడూరు అభ్యర్థులు పి.రవీంద్రనాథ్‌రెడ్డి, ఆకేపాటి అమర్నాథ్రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, తిరుపతి జిల్లా గూడూరు అభ్యర్థి మేరిగ మురళీధర్ తదితరులు అవకాశం ఉన్నప్పటికీ కేవలం పిసినారితనంతో చేజేతులా పార్టీని బలోపేతం చేసుకోలేకపోతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వీరు మాత్రమే కాదు, మరికొన్ని నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థుల తీరు సొంత పార్టీ నేతల నుంచే విమర్శల ఎదుర్కొంటోంది. ప్రత్యర్థి పార్టీల్లో వంద ఓట్లు ఉన్న నాయకుల్ని తమ వైపు తిప్పుకునే అవకాశం ఉన్నప్పటికీ, అధికార పార్టీ వైపు నుంచి సరైన స్పందన లేదనే మాట వినిపిస్తోంది. ఉదాహరణకు ఆళ్లగడ్డలో టీడీపీ అసంతృప్తులను వైసీపీ వైపు తిప్పుకునే అవకాశం వుంది. అయితే వైసీపీ అభ్యర్థి నాని ఏ మాత్రం చొరవ చూపకపోవడంతో చేజేతులా పార్టీ విజయావకాశాల్ని తగ్గించుకుంటున్నారనే ఆరోపణ వుంది.
అలాగే కమలాపురం ఎమ్మెల్యే, జగన్ మేనమామ రవీంద్రనాథ్‌రెడ్డి తీరు మరీ అధ్వానంగా మారిందని అంటున్నారు. కమలాపురంలో మైనస్ నుంచి నెమ్మదిగా ప్లన్కు చేరుకున్నారు. దీంతో గెలిచిపోతామన్న ధీమాతో రవీంద్రనాథ్‌రెడ్డి దొంగెత్తుకు తిరుక్కున్నారని సొంత పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఓ పది రూపాయలు ఇవ్వడం పక్కన పెడితే, చూసి ఇస్తామన్నా ఆయన నమ్మరని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. అయితే జగన్‌ను చూసి తనను గెలిపిస్తారనే ధీమాతో ఉన్నారు.
రాజంపేటలో ఆకేపాటి అమర్నాథ్రెడ్డి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదనే మాట వినిపిస్తోంది. వైసీపీ శ్రేణులు తమకు తోచిన రీతిలో పదో, ఇరవై విరాళం ఇచ్చినా ఆకేపాటి తీసుకుని, మిగుల్చుకోడానికి సిద్ధంగా ఉన్నారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. సిటింగ్ ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్‌రెడ్డి కూడా తనకెందుకని సైలెంట్‌గా ఉన్నారు. రాజంపేట పక్కనే రైల్వేకోడూరు వుంటుంది.
ఇక్కడి నుంచి బహుశా ఐదోసారి కొరముట్ల శ్రీనివాసులు పోటీ చేస్తున్నారు. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన రూపానందరెడ్డి ఈ దఫా ఎలాగైనా కొరమట్లను ఓడించాలనే పట్టుదలతో ఉన్నారు. దీంతో జనసేన టికెట్‌ను కూడా తన అనుచరుడికే ఆయన ఇప్పించుకున్నారు. నియోజకవర్గంలో రూపానందరెడ్డి ఇష్టానురీతిలో డబ్బు ఖర్చు పెడుతూ, వైసీపీ నుంచి తన వైపు తిప్పుకుంటున్నారని సమాచారం. మరోవైపు కొరముట్ల మాత్రం ఉత్తుత్తి ప్రచారంతో సరిపెడుతున్నారు. కేడర్, గ్రామ స్థాయి నాయకులకు ఇప్పటికైనా ఏమైనా చేద్దామనే ధ్యాసే ఆయనలో లేకుండా పోయింది. జగన్‌పై అభిమానంతో కొరముట్లకు ఓట్లు వేయాలే తప్ప, కొరముట్ల చేసేదేమీ లేదని విమర్శిస్తున్నారు.
టికెట్లు ఇచ్చామని, గెలుచుకుని రావాలని జగన్ పంపితే, క్షేత్రస్థాయిలో అభ్యర్థుల తీరు ఇలా వుంది. ఇవి కేవలం మచ్చుకు కొన్ని ఉదాహరణలు మాత్రమే. వైసీపీ అధిష్టానం ప్రతి నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారిస్తే, ఇలాంటి లోటుపాట్లు అనేకం వెలుగు చూసే అవకాశం వుంది. ప్రతి నియోజకవర్గంలోనూ ఎన్నికలను సమన్వయపరిచే టీమ్‌ను అధిష్టానం ఏర్పాటు చేయాల్సిన అవసరం వుంది. అభ్యర్థులు నిర్లక్ష్యంగా వ్యవహరించే నియోజకవర్గాలను గుర్తించి, దిద్దుబాటు చర్యలు తీసుకోకపోతే మాత్రం మూల్యం చెల్లించుకోవాల్సి వుంటుందని అధికార పార్టీ నాయకులే హెచ్చరిస్తున్నారు.