గెలిచే అవకాశం ఉన్న ఎంపీ నియోజకవర్గాన్ని ‘సీటు మార్పిడి విధానం’లో తాము పుచ్చుకుని, అసమ్మతుల బెడత పుష్కలంగా ఉన్న ఎమ్మెల్యే నియోజకవర్గాన్ని మిత్రపక్షానికి కట్టబెట్టేందుకు చంద్రబాబునాయుడు వేసిన మాస్టర్ ప్లాన్ ఫలించలేదు.
మిత్రపక్షంగా పొత్తులతో కలిసి పోటీ చేస్తున్నప్పటికీ.. చంద్రబాబు కుట్ర రాజకీయాల గురించి పూర్తి అవగాహన ఉన్న భారతీయ జనతా పార్టీ ఆ ప్రతిపాదనకు ఒప్పుకోలేదు. తన మాస్టర్ ప్లాన్ బెడిసి కొట్టడంతో చంద్రబాబు సైలెంట్ అయిపోగా, చంద్రబాబుతో డీల్ కుదుర్చుకుని ఆ పార్టీలో చేరిన ఎంపీ రఘురామక్రిష్ణంరాజు ఉండి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేయడానికి ముహూర్తం కూడా పెట్టేసుకున్నారు.
కూటమిలో ఏ పార్టీకి దక్కినా సరే.. నరసాపురం ఎంపీ సీటు నుంచి అభ్యర్థిగా పోటీ చేయబోయేది తానే అని రఘురామక్రిష్ణం రాజు తొలి నుంచి చాలా డాంబికంగా చెప్పుకున్నారు. ఆయన కోరుకున్నట్టుగానే.. కూటమిలో ఆ సీటు భారతీయ జనతా పార్టీకి దక్కింది. కానీ సీటు మాత్రం ఆయనకు రాలేదు. అప్పటి నుంచి తలకిందులు అయిపోతున్న రఘురామ.. సీటుకోసం చంద్రబాబుతో డీల్ కుదుర్చుకున్నారు. ఆ పార్టీలో చేరారు.
చంద్రబాబు నాయుడు తన వంతుగా వ్యూహరచన చేసి.. నరసరావుపేట ఎంపీ స్థానాన్ని తమ పార్టీకి ఇస్తే, అక్కడ ఉన్న బిజెపి అభ్యర్థి శ్రీనివాస వర్మ కోసం ఉండి ఎమ్మెల్యే సీటు ఇస్తామని పురందేశ్వరి వద్ద ఆఫర్ పెట్టారు. మరిది ఎజెండాకు తల ఊపే ఆమె, అధిష్ఠానాన్ని సంప్రదించి చెబుతానని అన్నారు.
నరసాపురంపై వారికి గెలుపు ఆశలున్నాయి. అదే సమయంలో ఉండి ఎమ్మెల్యే తీసుకుంటే అక్కడ సిటింగ్ ఎమ్మెల్యే రామరాజు, మాజీ ఎమ్మెల్యే శివరామరాజుల నుంచి అసంతృప్తి బెడద పుష్కలంగా ఉంది. ఇదంతా అంచనా వేసుకుని.. భాజపా చంద్రబాబు కుట్రపూరిత ప్రతిపాదనను చాలా సున్నితంగా తిరస్కరించింది.
ఇప్పుడు రఘురామ తాను ఉండిలో తెదేపా తరఫున 22న నామినేషన్ వేస్తా అంటున్నారు. రామరాజు, శివరామరాజులతో కలిసి పనిచేస్తా అంటున్నారు. వారితో కలిసి పనిచేయడం తప్ప ఆయనకు వేరే గతిలేదు. ఇంతకూ వారు ఈయనతో కలిసి పనిచేస్తారా? అనేదే సందేహం!