ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తలపడడానికి కాంగ్రెస్ పార్టీ తమ తొలి జాబితాను ప్రకటించింది. ఇందులో అయిదు ఎంపీ సీట్లకు, 114 ఎమ్మెల్యే సీట్లకు అభ్యర్థులను ప్రకటించారు. అభ్యర్థిత్వాల కోసం మొత్తం 1500కుపైగా దరఖాస్తులు వచ్చాయని, పలువిడతల వడపోత అనంతరం జాబితా ఖరారు చేశామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.
అయితే ఆ జాబితాను పరిశీలిస్తే.. ఏపీలో పట్టుమని పది మందికైనా తెలిసిన పేర్లు గల నాయకులు అతికొద్దిమందే మిగతా వారంతా కూడా ఊరూపేరూ లేని నాయకులు. ఎమ్మెల్యేల జాబితాలో చాలామంది పాపులర్ లీడర్లు కానేకాదు. అంతో ఇంతో పాపులారిటీ ఉన్నవాళ్లు ఎంపీ బరిలో మాత్రమే దిగుతుండడం ఇంకో విశేషం.
కాంగ్రెస్ తరఫున కడప ఎంపీ స్థానానికి షర్మిల స్వయంగా పోటీకి దిగుతుండడం విశేషం. అలాగే కాకినాడలో పల్లం రాజు, బాపట్లలో జేడీ శీలం, రాజమహేంద్రవరంలో గిడుగు రుద్రరాజు, కర్నూలులో రామ్ పుల్లయ్య యాదవ్ పోటీచేస్తున్నారు. పల్లంరాజు, జేడీ శీలం గతంలో కేంద్రమంత్రులుగా కూడా పనిచేశారు. గిడుగు రుద్రరాజు మొన్నటిదాకా కాంగ్రెస్ కు సారథ్యం వహించిన నాయకుడు. ఇక ఎమ్మెల్యేల్లో పాపులర్ లీడర్లు లేరు. వైసీపీ నుంచి ఫిరాయించిన సిటింగ్ ఎమ్మెల్యే ఎలీజాకు, నందికొట్కూరు సిటింగ్ ఎమ్మెల్యే తొగురు ఆర్థర్ కు టికెట్ ఇచ్చారు.
నిజానికి కాంగ్రెస్ పార్టీ ఎలాంటి తడుములాట లేకుండా.. 114 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడమే ఘనమైన సంగతిగా పలువురు భావిస్తున్నారు. ఎందుకంటే.. రాష్ట్ర విభజన తర్వాత.. ఆ పార్టీ రాష్ట్రంలో పూర్తిగా అంతరించిపోయింది. పూర్వం ఆ పార్టీ వాసనలు ఉన్నవారందరూ కూడా వేర్వేరు పార్టీల్లోకి వెళ్లిపోయారు. గరిష్టంగా వైసీపీలో చేరారు.
ఇటీవలి కాలంలో మాత్రమే.. అది కూడా షర్మి ల పగ్గాలు చేపట్టిన తర్వాత.. కాంగ్రెస్ కు కాస్త ఊపు వచ్చింది. కనీసం బహిరంగ సభలు నిర్వహిస్తే.. నలుగురు నాయకులు కనిపించడం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో గెలిచినా గెలవకపోయినా.. పార్టీని కాపాడుకోవడం లక్ష్యం అన్నట్టుగా.. కాంగ్రెస్ బరిలోకి దిగుతోంది.
షర్మిల కడప ఎంపీ స్థానం నుంచి పోటీచేస్తున్న నేపథ్యంలో ఆ ఒక్క సీటునుంచి వైఎస్సార్ కాంగ్రెస్ కు గట్టిపోటీ ఇచ్చే అవకాశం ఉంది. వైసీపీ భయపడే పరిస్థితి ఏర్పడినా కూడా ఆశ్చర్యం లేదు. అయితే మిగిలిన అన్ని చోట్ల కూడా కాంగ్రెస్ అభ్యర్థులు నామమాత్రంగా పోటీలో ఉండాల్సిందే తప్ప.. ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపలేరు. అసలు షర్మిల మినహా రాష్ట్రంలో ఎందరు కాంగ్రెస్ అభ్యర్థులకు డిపాజిట్లు దక్కుతుందో కూడా ప్రశ్నార్థకమే.