ఆన్ లైన్ మోసాలపై ఇప్పటికే చాలామందికి కొంత అవగాహన వచ్చింది. ప్రభుత్వాలు, వివిధ సంస్థలు ఎప్పటికప్పుడు ప్రచారం చేయడం కూడా మంచి ఫలితాన్నిచ్చింది. మరీ ముఖ్యంగా బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్పి వివరాలు అడిగే కాల్స్ పట్ల చాలామంది అప్రమత్తంగా ఉంటున్నారు. అయితే ఇప్పుడీ సైబర్ నేరాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి.
ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్) వచ్చిన సైబర్ మోసాల గతి మారిపోయింది. మనకు బాగా తెలిసిన వ్యక్తి మనకు కాల్ చేస్తాడు. అర్జెంట్ గా డబ్బు కావాలని అడుగుతాడు. నమ్మి మనం అతడికి డబ్బులేస్తే అంతే సంగతులు. ఎందుకంటే, అవతలి వ్యక్తి అబద్ధం, అతడి గొంతు ఓ మోసం.
అవును.. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సహాయంతో తెలిసిన వ్యక్తుల గొంతును పోలిన వాయిస్ తో ఈమధ్య చాలామందికి కాల్స్ వస్తున్నాయి. బెంగళూరులో ఈ తరహా మోసాలు జరుగుతున్నాయని, ఏఐ సహాయంతో బంధువుల గొంతును రీ-క్రియేట్ చేసి కాల్స్ చేసి మోసాలకు పాల్పడుతున్నారని, ఇలాంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇలాంటి ఆన్ లైన్ మోసాల విషయంలో కావాల్సింది రెండే విషయాలు. ఒకటి అప్రమత్తత, రెండు అవగాహన. సైబర్ నేరాలపై ఎప్పటికప్పుడు అవగాహనతో ఉండాలి. కాల్స్ స్వీకరించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ఏమాత్రం అనుమానం వచ్చినా, సదరు బంధువు ఫోన్ నంబర్ చెక్ చేయాలి, తిరిగి అతడికి కాల్ చేసి నిర్థారించుకోవడం అత్యవసరం. ఈ విషయంలో ఏమాత్రం ఎమోషనల్ అయినా, అజాగ్రత్తగా ఉన్నా కష్టపడి సంపాదించిన డబ్బును క్షణాల్లో పోగొట్టుకున్నవాళ్లు అవుతారు. తస్మాత్ జాగ్రత్త.