వాలంటీర్లు, వృద్ధుల పెన్షన్లతో ముడిపెట్టి చంద్రబాబు తన కుటిల రాజకీయాన్ని వీరలెవెల్లో చూపిస్తున్నారని రాష్ట్రవ్యాప్తంగా ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకచేత్తో పింఛన్లు సకాలంలో అందకుండా అడ్డంకులు సృష్టిస్తూ, మరో చేత్తో ప్రతి ఒక్కరికీ వారి ఇళ్ల వద్దకే పింఛను తీసుకు వెళ్లి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. ఈసీకి సీఎస్ కు లేఖలు, బహిరంగ లేఖలు రాస్తూ ఆయన నయవంచనకు పాల్పడుతున్నారు. రెండు నాల్కల ధోరణిని అనుసరిస్తున్నారు. అయితే చంద్రబాబు రాజకీయాల్లోని దుర్మార్గన్ని గమనించి చీకొడుతున్నారని మాత్రం ఆయన అర్థం చేసుకోవడం లేదు.
చంద్రబాబునాయుడు తన కుటిలత్వాన్ని ఎలా బయటపెట్టుకుంటున్నారో చూద్దాం.. సిటిజన్ ఫోరం ఫర్ డెమాక్రసీ అనే సంస్థ వృద్ధులకు పింఛన్లు పంపిణీ చేయకుండా కోడ్ అమల్లో ఉండే రెండు నెలల పాటూ వాలంటీర్లను దూరం పెట్టాలనీ ఈసీకి ఫిర్యాదు చేసింది.
పింఛన్లకు దూరం పెట్టడం అనే పాయింటు కాకుండా.. వాలంటీర్లు పెన్షనర్లను ప్రలోభపెడుతున్నారని, వారికి ఎన్నికలవిధులు అప్పగించకూడదని ఇలా రకరకాల దొంగ పితూరీలు పార్టీ తరఫున కూడా ఈసీ వద్దకు తీసుకువెళ్లారు. ఈ రెండు రకాల పితూరీలను పరిగణించిన ఈసీ మొత్తానికి వాలంటీర్లు పింఛన్లు ఇళ్లకు వెళ్లి ఇవ్వకుండా ఆదేశాలు ఇచ్చింది.
అలాంటి నిర్ణయంతో తనకు సంబంధం లేదన్నట్టుగా అది సిటిజన్ ఫోరం ఫర్ డెమాక్రసీ వారి పనిగా.. నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీదికి చంద్రబాబు నెట్టేశారు.
తాను మాత్రం ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుకుని.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటింటికీ వెళ్లి ఇవ్వాల్సిందేనంటూ సీఎస్ కు, ఈసీకి లేఖ రాశారు. అక్కడికేదో ప్రజలకోసం తాను పరితపించిపోతున్నట్లు బిల్డప్ ఇచ్చారు.
తీరా ఇబ్బంది పడే వారికి ఇళ్లవద్ద ఇచ్చేలా, కొందరికి గ్రామసచివాలయాల వద్ద ఇచ్చేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే కాదు కూడదు అని చంద్రబాబు రంకెలు వేస్తున్నారు. అందరికీ ఇళ్ల వద్దేఇవ్వాలని అంటున్నారు.
చంద్రబాబు ఎంత దారుణమైన లెక్కలు మాట్లాడుతున్నారంటే.. రాష్ట్రంలో లక్షకు పైగా గ్రామసచివాలయ ఉద్యోగులు ఉన్నారని వారిద్వారా ఇంటింటికీ పెన్షన్లు పంపితే.. ఒకటి రెండు రోజుల్లో రాష్ట్రమంతా పంపిణీ పూర్తవుతుందని, అలా చేయకుండా ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని అంటున్నారు. రాష్ట్రంలో లక్షకు పైగా సచివాలయ ఉద్యోగులు ఉన్న మాట నిజమే. కానీ.. వాలంటీర్లు రెండున్నర లక్షల మంది ఉన్నారు. అంతమందిదో పంపిణీ చేయిస్తేనే.. రాష్ట్రమంతా పెన్షన్లుఇవ్వడానికి అయిదు- ఆరు రోజులు పడుతోంది. అలాంటిది లక్షమందితో 1,2 రోజుల్లో ఇచ్చేయవచ్చునని ఎలాంటి కాకిలెక్కతో చంద్రబాబు చెబుతున్నారో తెలియదు.
చంద్రబాబు ఎన్ని డ్రామాలు ఆడినా, పెన్షన్ల పంపిణీ గురించి నయవంచక మాటలు చెప్పినా సరే.. పింఛన్ల విషయంలో ఆయన ప్రదర్శించిన కుటిలత్వం గురించి ప్రజలందరూ తెలుసుకున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.