గతంలో ఓ సినిమా ఫంక్షన్ లో 200 కోట్ల రూపాయల వసూళ్లు సాధిస్తానంటూ ఓపెన్ గా స్టేట్ మెంట్ ఇచ్చాడు విజయ్ దేవరకొండ. ఆ ప్రకటనతో అతడి ఫ్యాన్స్ ఆనందపడ్డారు కానీ చాలామంది కుళ్లుకున్నారు. దురదృష్టవశాత్తూ ఆ సినిమా ఫెయిలైంది. విజయ్ దేవరకొండ లెక్క తప్పింది.
అప్పట్నుంచి ఆ స్టేట్ మెంట్ కు సంబంధించి అతడిపై విమర్శలు పడుతూనే ఉన్నాయి. విజయ్ కు పొగరు ఎక్కువైందన్నారు కొందరు. తెలిసినవాళ్లు అతడి స్టేట్ మెంట్ ను తప్పుపట్టారు. ఇన్నాళ్లకు ఆ అంశంపై స్పందించాడు దేవరకొండ.
“200 కోట్లు కొడతానని స్టేట్ మెంట్ ఇచ్చాను, కానీ కొట్టలేదు. ఈరోజు వరకు నన్ను చాలామంది ఆ స్టేట్ మెంట్ ఇవ్వడంపై తప్పుబట్టారు. 200 కోట్ల వసూళ్లు కొడతానని చెప్పడం తప్పు కాదు, చెప్పిన తర్వాత కొట్టి చూపించకపోవడం తప్పు. దాని వల్ల ఎన్నో తిట్లు, అవమానాలు తిన్నాను. 200 కోట్ల సినిమా ఇచ్చేంతవరకు ఎంతైనా తిట్టండి నేను పడతా. ఇప్పటికీ నాకు పొగరు, బలుపు అనుకుంటారు. కానీ ఇది నా మీద నాకున్న నమ్మకం.”
ఫ్యామిలీ స్టార్ రిలీజ్ అవుతున్న తరుణంలో విజయ్ దేవరకొండ మరోసారి తన స్టేట్ మెంట్ ను గుర్తుచేశాడు. 200 కోట్ల వసూళ్లు సాధిస్తానని చెబుతున్నాడు. ఎవడో స్టార్ అయినప్పుడు నేను అవ్వలేనా అనే నమ్మకంతో సినిమాల్లోకి వచ్చానని.. అలాగే ఇంకెవరో 200 కోట్ల వసూళ్లు సాధించినప్పుడు నేను ఎందుకు కొట్టలేను అనే నమ్మకంతోనే సినిమా చేశానని చెప్పుకొచ్చాడు.