పవన్‌కల్యాణ్‌ను ప్యాకేజీ స్టార్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎందుకు విమర్శిస్తారో జనసేన నాయకులు, కార్యకర్తలకు ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. జనసేనాని పవన్‌కల్యాణ్ సీట్లను టీడీపీ నేతలకు అమ్ముకుంటున్నారని స్వయంగా ఆ పార్టీ నాయకులే ఇప్పుడు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. పొత్తులో భాగంగా జనసేనకు దక్కిందే 21 అసెంబ్లీ, 2 లోక్‌సభ స్థానాలు. వాటిని కూడా ఎక్కువ భాగం వలస నేతలతో నింపడం జనసేన నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు.
ఇదే జగన్ అయితే తనను నమ్ముకున్నోళ్లకు ఇలా అన్యాయం చేయరని జనసేన శ్రేణులు అంటున్నాయి. వైసీపీలో సామాన్యులకు టికెట్లు ఇవ్వడాన్ని గుర్తు చేసుకుంటూ, జనసేనానిపై జనసేన నాయకులు మండిపడుతున్నారు. నిజంగా తనను నమ్ముకున్న వాళ్లకు న్యాయం చేయాలనే సంకల్పం పవన్‌లో బలంగా వుంటే, ఏదో రకంగా సర్దుబాటు చేసేవారని అంటున్నారు.
ఉదాహరణకు విజయవాడ వెస్ట్ సీటే తీసుకుందాం. విజయవాడ వెస్ట్ జనసేన ఇన్‌చార్జ్ పోతిన మహేశ్ పదేళ్లుగా అక్కడ పని చేసుకుంటున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసి గౌరవప్రదమైన ఓట్లనే సాధించారు. ఈ దఫా పొత్తులో భాగంగా ఆ సీటును ఆయన ఆశించారు. చివరికి బీజేపీకి కేటాయించారు. అయితే తనకే ఇవ్వాలంటూ పోతిన రోజుల తరబడి ఆందోళనలు నిర్వహించారు. కానీ ఫలితం లేకుండా పోయింది.
పోతినపై పవన్‌కు ప్రేమే వుంటే, సమీపంలోని అవనిగడ్డ సీటును కేటాయించే వారనే చర్చకు తెరలేచింది. టీడీపీ ఇన్‌చార్జ్ మండలి బుద్ధప్రసాద్‌ను తీసుకుని, ఆయనకు టికెట్ ఇవ్వాల్సిన అవసరం ఏంటనే ప్రశ్న ఎదురవుతోంది. పోతిన మహేశ్‌కు అవనిగడ్డ సీటు ఇచ్చి వుంటే, స్థానిక జనసేన నాయకులు, కార్యకర్తలు కూడా సహకరించే వారు. కానీ ఇప్పుడు మండలికి టికెట్ ఇస్తారనే ప్రచారంతో జనసేన కేడర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మండలిని ఓడించి తీరుతామని హెచ్చరిస్తోంది. ఇదే జగన్ అయితే తనను నమ్ముకునే వారిని కాదని, మరో పార్టీకి అమ్ముకునే పరిస్థితి ఉండదని జనసేన కేడర్ అంటోంది.