వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు ఆదినారాయణరెడ్డిని సీఎం చంద్రబాబు మందలించారనే వార్తల్లో నిజం లేదని తేలిపోయింది. అసెంబ్లీ ప్రాంగణంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తన నియోజకవర్గంలో చేస్తున్న పనుల్ని సాగనివ్వనని పరోక్షంగా తేల్చి చెప్పారు. ఆదినారాయణరెడ్డి ఏమన్నారో ఆయన మాటల్లోనే…
“బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ కంపెనీ కాదు కదా, ఏ కంపెనీ అయినా వైసీపీ వారి భాగస్వామ్యంతో వస్తే అనుమతించేది లేదు. నిజంగా అదానీ వస్తే స్వాగతిస్తాం. స్థానిక ఎమ్మెల్యేగా స్వయంగా వారితో మాట్లాడి పనులు చేయించే బాధ్యత నాది”
ఆదినారాయణరెడ్డిది ఎవరినీ లెక్క చేయని స్వభావం. బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ అయితే ఏం? అని ఆయన నేరుగానే ప్రశ్నిస్తున్నారు. అయితే మధ్యలో వైసీపీని ఆయన తెలివిగా తీసుకురావడాన్ని గమనించొచ్చు. అధికారం కోల్పోయిన వైసీపీ, మరీ ముఖ్యంగా జమ్మలమడుగు లాంటి చోట కాంట్రాక్ట్ పనులు చేసే పరిస్థితి లేదని చిన్నపిల్లలకు కూడా తెలుసు.
అదానీ దక్కించుకున్న పనుల్ని, సీఎం రమేశ్‌కు చెందిన రిత్విక్ కంపెనీ సబ్ లీజుకు తీసుకుంది. సీఎం రమేశ్ కంపెనీనే అక్కడ పనులు చేస్తోంది. ఫలానా వైసీపీ నాయకుడి కంపెనీ తన నియోజకవర్గంలో పనులు చేస్తోందని ఆదినారాయణరెడ్డి చెప్పకపోవడాన్ని గమనించొచ్చు. తనకు అడ్డే లేదని సీఎం రమేశ్ వ్యవహరిస్తుంటారని, అందుకే పనుల్ని అడ్డుకుంటున్నట్టు ఆదినారాయణరెడ్డి వర్గీయులు చెబుతున్నారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ సీఎం రమేశ్ కంపెనీ జమ్మలమడుగు నియోజకవర్గంలో పనులు చేయడానికి ఆదినారాయణరెడ్డి అంగీకరించరు. ఒకవేళ పనులు చేయాలంటే ఆదినారాయణరెడ్డి చెప్పినట్టు జరగాల్సిందే. లేదంటే దేవుడు చెప్పినా ఆది వినే పరిస్థితి ఉండనే వుండదు. ఇందుకు తాజాగా ఆయన మీడియాతో అన్న మాటలే నిదర్శనం.