సర్వే ఏదైనా (ఒకట్రెండు మినహాయించి) జాతీయ స్థాయిలో బీజేపీది, ఏపీలో వైసీపీది అధికారం అని తేల్చి చెబుతున్నాయి. మరీ ముఖ్యంగా రెండు మూడు నెలల క్రితం ఇవే సంస్థలు ఏపీలో రాజకీయ పరిస్థితులపై సర్వేలు నిర్వహించి, టీడీపీ గ్రాఫ్ పెరిగినట్టు చెప్పాయి. అలాగే వైసీపీ గ్రాఫ్ బాగా పడిపోతున్నట్టు స్పష్టం చేశాయి. అయితే కాలం ఏపీ రాజకీయాల్లో మార్పు తీసుకొచ్చినట్టు కనిపిస్తోంది.
ఇప్పటికైతే సర్వేల ఫలితాలు రోజురోజుకూ వైసీపీలో జోష్ పెంచుతున్నాయి. అలాగే కూటమిలో అలజడి రేపుతున్నాయి. ఈ దఫా అధికారంలోకి రాకపోతే, మరీ ముఖ్యంగా టీడీపీ భవిష్యత్ ప్రశ్నార్థకమే. ఇక జనసేన పవన్‌కల్యాణ్‌కు ప్రత్యేకంగా పోయేది, వచ్చేదేమీ లేదు. ఎందుకంటే పదేళ్లుగా ఆయన ఎన్నికల్లో పోటీ చేయకుండా, అలాగే పోటీ చేసి పవన్‌కల్యాణ్ గెలవకుండానే హాయిగా ఆయన వ్యాపారం చేసుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో సర్వేల ఫలితాల విషయంలో వైసీపీ జాగ్రత్త పడాల్సిన అవసరం వుంది. ఏదో సర్వేల్లో అధికారం తమదే అని, ఇక రిలాక్ష్ అవుదామనే ఆలోచన వస్తే మాత్రం… అసలుకే పుట్టి మునగడం ఖాయం. ఇప్పటికీ కొందరు వైసీపీ అభ్యర్థులు క్షేత్రస్థాయిలో తమ శ్రేణుల్ని పట్టించుకోలేదని సొంత పార్టీ నేతలే చెబుతున్నారు. అలాంటి చోట ఇట్లే కాలయాపన చేస్తే మాత్రం వైసీపీ నష్టపోవడం ఖాయం.
మరీ ముఖ్యంగా కొన్ని సర్వేల్లో 125, 130 సీట్లు వస్తాయని చెబుతున్నారు. కొన్ని జిల్లాల్లో వచ్చే సీట్లపై అతిశయోక్తి కనిపిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఓవరాల్‌గా ఏపీ రాజకీయాలను పరిశీలిస్తే… వైసీపీ అధికారంలోకి వస్తుందని మెజార్టీ అభిప్రాయం. అలాగని వైసీపీ ప్రభుత్వం ఏదో అద్భుతాలు చేసిందని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అద్భుత వ్యూహాలు రచించారని అనుకుంటే, అంత కంటే అజ్ఞానం, అమాయకత్వం మరొకటి లేదు.
కూటమిలోని లుకలుకలే వైసీపీ నెత్తిన పాలు పోస్తున్నాయి. టీడీపీ, జనసేన పొత్తు కుదుర్చుకున్నప్పుడు లెక్క ఒక రకంగా వుండింది. ఈ రెండు పార్టీలకు బీజేపీ జత కావడం వైసీపీకి రాజకీయంగా ఎంతో లాభిస్తోందన్న మాట సర్వత్రా వినిపిస్తోంది. టీడీపీకి జనసేన, బీజేపీ జత కట్టడంతో కనీసం అంటే 20 నుంచి 25 అసెంబ్లీ నియోజకవర్గాలను అప్పనంగా వైసీపీ చేతిలో పెట్టినట్టైంది. ఎన్నికలు జరగకనే జగన్‌కు చంద్రబాబు ఇన్ని సీట్లు ఇస్తే, అధికారంపై వైసీపీకి ధీమా కలగకుండా ఎలా వుంటుంది?
టీడీపీ పోటీ చేసి వుంటే తప్పక గెలిచేదని, ప్చ్, ఇప్పుడా స్థానాల్లో జనసేన, బీజేపీ పోటీ చేస్తుండడం వల్ల వైసీపీ గెలుపు నల్లేరుపై నడకే అని స్వయంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకులే బహిరంగంగా అంటున్నారు. అనవసరంగా పొత్తుకెళ్లి, చంద్రబాబు చిత్తు అవుతున్నాడనే భావన ప్రజానీకంలో క్రమంగా పెరుగుతోంది. ఈ వాతావరణం వైసీపీకి రాజకీయంగా తప్పకుండా ప్రయోజనమే.
ఎందుకులేబ్బా, మళ్లీ జగనే అధికారంలోకి వచ్చేలా ఉన్నారని, మనమెందుకు రాసుకుని పూసుకుని చేయాలనే నిరాశతో చాలా మంది మౌనాన్ని ఆశ్రయిస్తున్నారు. ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే వైసీపీ అధికారానికి ఢోకా లేదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ఇదే సందర్భంలో ఇక అంతా అయిపోయిందని, అధికారంలోకి వచ్చినట్టే అని భావించి వైసీపీ అభ్యర్థులు లైట్‌గా తీసుకుంటే నష్టపోవడం ఖాయం.
సర్వేలను ఏ మాత్రం పరిగణలోకి తీసుకోకుండా ముందుకెళితేనే, వైసీపీ మరింత లాభపడుతుంది. ఆ మాయలో పడితే దారుణంగా నష్టపోతారని హెచ్చరించక తప్పదు. ముందు తమ పని తాము చేయాలి. ఆ తర్వాత నిర్ణయాన్ని ప్రజలకు వదిలేయాలి. అంతేకానీ, సర్వేల్లో తాము గెలుస్తామని చెబుతున్నారని, ఇక ఏమీ చేయకపోయినా ఫర్వాలేదని సొంత పార్టీ నాయకులు, కార్యకర్తల్ని విస్మరిస్తే మాత్రం మూల్యం చెల్లించక తప్పదు.