వైఎస్సార్‌సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై విద్వేషం శ్రుతిమించింది. ఎంతగా అంటే.. ప్రతిపక్షాలే అసహ్యించుకునేంత. రామోజీరావు పత్రికైతే… అయ్య బాబోయ్ అని దాని పాఠకులు పత్రిక పట్టుకోడానికే భయపడేలా జగన్‌పై విషం చిమ్ముతున్నారు. కూటమి నేతలు ప్రధాన ప్రత్యర్థిగా వైఎస్ జగన్‌పై ఘాటు విమర్శలు చేశారంటే అర్థం చేసుకోవచ్చు. జగన్‌కు రాజకీయ పార్టీల కంటే, తామే ప్రధాన ప్రత్యర్థులమని ఎల్లో పత్రికలు, చానళ్ల యజమానులు భావిస్తున్నట్టున్నారు.
ఎల్లో మీడియా రాతలు, చానళ్లలో డిబేట్లు, ప్రత్యేక కథనాల ప్రసారాలు జర్నలిజం నైతిక విలువలకు సంబంధించి అన్ని హద్దులు దాటాయి. అలాగని జగన్ మీడియా శుద్ధపూస అని చెప్పడం లేదు. కనీసం ఆ మీడియా తన లోగోగా వైఎస్సార్ ఫొటోను పెట్టుకుంది. ఎల్లో మీడియా కూడా చంద్రబాబు ఫొటో పెట్టుకుంటే ఏ సమస్యా లేదు. చంద్రబాబుకు రాజకీయంగా ప్రయోజనం కలిగించాలంటే జగన్‌పై ఎల్లో మీడియా విషం చిమ్మడం మానాలి.
ఇక్కడ ఎల్లో మీడియా లాజిక్ మిస్ అవుతోంది. జగన్‌పై ఎల్లో మీడియా విషం చిమ్మడం వల్ల ప్రజానీకానికి ఆ సంస్థలపై అసహ్యం కలుగుతోంది. ఇదే ఎల్లో మీడియా జగన్‌పై జనంలో అసహ్యం కలిగేలా ఆయన ప్రజావ్యతిరేక విధానాల గురించి రాస్తే ప్రయోజనం వుంటుంది. ఏదైనా రాత చదివే పాఠకులు ఆవేశంతో ఊగిపోయేలా వుంటే, అప్పుడు ఆ రచయిత లేదా ప్రచురణ సంస్థ ప్రయోజనం నెరవేరినట్టు. అలా కాకుండా రచయితలు లేదా జర్నలిస్టులు ఆవేశపడి తామే విద్వేష రాతలు రాస్తే, పాఠకుల్లో ఏ ఫీలింగ్ కలగదు. ఇంకా చెప్పాలంటే, మీడియా పేరుతో ఒక నాయకుడిని టార్గెట్ చేస్తూ, నిత్యం ఇలా విషం చిమ్మడం ఏంటనే ఏహ్య భావం కలుగుతుంది.
జగన్ అనే రాజకీయ నాయకుడు ప్రతిపక్షంలో ఉన్నా, అధికార పక్షంలో ఉన్నా ఎల్లో మీడియాకు విషం చిమ్మడం పనైందనే భావన టీడీపీని అభిమానించే వారిలో సైతం వుంది. జగన్‌ను అందరూ చుట్టుముట్టి టార్గెట్ చేయడం వల్ల …వారు అనుకున్న లక్ష్యం నెరవేరకపోగా, సానుభూతి కలిగే ప్రమాదం వుందని వారు గ్రహిస్తే మంచిది. ఎల్లో పత్రికల్లో మొదటి పేజీ మొదలుకుని, చివరి పేజీ వరకూ ప్రతి అక్షరం జగన్‌పై విద్వేషం తప్ప, చదువుకోడానికి, తెలుసుకోడానికి మరేదైనా వుందేమో అని భూతద్దం పెట్టి వెతికినా కనిపించదు. ఇక ఎల్లో చానళ్ల వికృత రూపాన్ని చూడలేని దశకు చేరుకున్నాయి.
ఇంత కాలం జగన్‌పై నోరు పారేసుకోడానికి చంద్రబాబు, లోకేశ్, వారి ముఖ్య నాయకులు మాత్రమే ఉన్నారు. ఇప్పుడు వారిని మించిపోయేలా పవన్‌కల్యాణ్ నోరు పారేసుకుంటున్నారు. తాజాగా చంద్రబాబు, లోకేశ్, పవన్‌కల్యాణ్‌ల కంటే తానే ఎక్కువగా తన అన్నపై విషం చిమ్ముతానని షర్మిల తెరపైకి వచ్చారు. తన నోరే తనకు శత్రువని షర్మిల గ్రహించలేరు. తెలంగాణలో ఎక్కువ మాట్లాడే, జెండా పీకేసుకోవాల్సి వచ్చింది. ఏపీలో షర్మిల రాజకీయ జీవితం ముగింపునకు రోజులు దగ్గరపడ్డాయి. షర్మిల శ్రుతి మించి మాట్లాడుతూ ప్రజా వ్యతిరేకత మూటకట్టుకుంటున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
త్వరలో ఎన్నికలున్నాయి. ప్రజలకు ఫలానా మంచి చేస్తామని చెప్పి, రాజకీయ లబ్ధి పొందాలన్న కనీస ఇంగితం కూటమి నాయకుల్లో కొరవడింది. తెల్లారి లేచినప్పటి నుంచి జగన్‌ను ఏ తిట్టు తిడ్తామా? తమ మీడియాలో వాటిని చూసుకుని సంబరపడదామనే ధోరణిని చూస్తున్నాం.
ఇలాంటి చర్యలు వికటించకమానవు. కూటమిలోని లుకలుకల్ని బయటి ప్రపంచానికి తెలియకుండా తమ మీడియా మేనేజ్ చేస్తుందని కూటమి నేతలు భావిస్తున్నారు. అంతే తప్ప, వాటిని సరిదిద్దుకుని ఎన్నికల్లో విజయం సాధించాలన్న పట్టుదల కూడా కనిపించడం లేదు. కేవలం జగన్‌పై దూషణలే తమకు అధికారం తెచ్చి పెడ్తాయని బహుశా కూటమి నేతలు నమ్ముతున్నట్టున్నారు. ఇవేం లెక్కలో ఎవరికీ అంతుచిక్కడం లేదు.