1996 నాటి శిరోముండనం కేసులో వైసీపీ నేత తోట త్రిమూర్తులుకు 18 నెలల జైలు శిక్ష విధిస్తూ విశాఖ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. అలాగే రూ.2 లక్షల జరిమానాను విధించింది. ఈ కేసులో 28 ఏళ్ల తర్వాత కోర్టు తీర్పును వెల్లడించింది. తోట త్రిమూర్తులుతో పాటు ఈ కేసులో 9మందిని నిందితులుగా న్యాయ స్థానం ప్రకటించింది.
1996 డిసెంబర్ 29న ప్రస్తుత కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం వెంకటాయపాలెంలో ఐదుగురు దళితులను హింసించి ఇద్దరికి శిరోముండనం చేసిన ఘటన అప్పట్లో సంచలనం రేపింది. కాగా 1994 ఏపీ ఎన్నికల్లో రామచంద్రపురం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన 1995లో టీడీపీ చేరారు. 1999లో టీడీపీ నుండి పోటీ చేసి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు.
2019 ఎన్నికల్లో టీడీపీ తరుఫున పోటీ చేసిన ఆయన వైసీపీ అభ్యర్థి వేణుగోపాల కృష్ణ చేతిలో ఓటమి పాలయ్యారు. అనంతరం టీడీపీకి రాజీనామా చేసి వైసీపీ పార్టీలోకి చేరి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియమితులయ్యారు. ఇప్పుడు తోట త్రిమూర్తులు ప్రస్తుతం మండపేట వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.