అనకాపల్లి పార్లమెంట్ స్థానాన్ని సీఎం రమేశ్‌కు జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ చేసిన త్యాగం విలువ ఎంత అనేదిప్పుడు ప్రశ్న. పెద్ద మొత్తంలో చేతులు మారినట్టు జనసేనలో అంతర్గతంగా చర్చ జరుగుతోంది. సినిమా రంగంలో కాల్షీట్స్ అమ్ముకున్న చందంగా, తమ నాయకుడు ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు అమ్ముకున్నారని జనసేన శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
అనకాపల్లి లోక్‌సభ స్థానాన్ని సీఎం రమేశ్‌కు ఇవ్వడంపై జనసేనలో అంతర్గతంగా జరుగుతున్న చర్చ ఏంటో తెలుసుకుందాం. టికెట్లు అమ్ముకోవడంలో తమ నాయకుడు ఎంతగా ఆరితేరారో అనకాపల్లి సీటే ఒక ఉదాహరణగా చెబుతున్నారు. అనకాపల్లి లోక్‌సభ స్థానం నుంచి నాగబాబును వ్యూహాత్మకంగా పవన్‌కల్యాణ్ బరిలో దింపారు. ఆ పార్లమెంట్ పరిధిలో నాగబాబు ఇల్లు కూడా తీసుకున్నారు.
ఒక నెల రోజుల పాటు నాగబాబు ప్రచారం కూడా చేసుకున్నారు. అబ్బో నాగబాబు ఎంత సీరియస్‌గా తిరుగుతున్నారో అనే భ్రమను కల్పించారు. ఆ తర్వాత బీజేపీతో పొత్తు కుదరడంతో జనసేన ఎంపీ సీట్లు 3 స్థానాల నుంచి రెండుస్థానాలకు తగ్గాయి. పొత్తు కుదిర్చినందుకు తన అన్న స్థానాన్ని త్యాగం చేయాల్సి వచ్చిందని పవన్‌కల్యాణ్ వాపోయారు. అయితే జనసేన నాయకులు చెబుతున్న కథ వేరే వుంది.
బీజేపీతో పొత్తు కుదురుతుందని తెలిసే అనకాపల్లి నుంచి తన అన్నను బరిలో దింపేందుకు పవన్ నిర్ణయించారన్నారు. తద్వారా అనకాపల్లి సీటుకు డిమాండ్ పెంచుకునే ఎత్తుగడ అని జనసేన నాయకులు తేల్చి చెబుతున్నారు. సహజంగా నాగబాబు అంటే పవన్కల్యాణ్గానే భావించి, ఆ సీటు ఇవ్వాలంటే కాస్త ఎక్కువ రేటు పెంచుకునే అవకాశం వుంటుందని సినిమా కాల్సీట్స్ అమ్మకం తెలివి తేటల్ని ప్రదర్శించారని జనసేన నేతలు ఆరోపిస్తున్నారు.
తన అన్న కాకుండా, మరెవరినైనా త్యాగం చేయమంటే, రచ్చరచ్చ అవుతుందనే ఉద్దేశంతోనే పవన్ జాగ్రత్త పడ్డారని జనసేన నాయకులు చెబుతున్నారు. తిరుపతి, అవనిగడ్డ, భీమవరం, తణుకు తదితర నియోజక వర్గాల్లో జనసేన అభ్యర్థుల సీట్ల విషయంలో వెల్లువెత్తుతున్న విమర్శల గురించి తెలిసిందే. చార్టెడ్ ప్లైట్స్‌లో తిరిగే, కాంగ్రెస్, టీడీపీ నాయకులకు ఉదారంగా సీఎం రమేశ్ అయితే తమ లక్ష్యాన్ని అందుకుంటారని పవన్ పసిగట్టారని జనసేన నాయకులు విమర్శిస్తున్నారు.
ఏది ఏమైనా సీఎం రమేశ్‌కు జనసేన సీటు త్యాగానికి భారీ విలువ కట్టారనే అభిప్రాయానికి ఆ పార్టీ నాయకులు వచ్చారు. అందుకే మెగాస్టార్ చిరంజీవి కూడా సీఎం రమేశ్‌కు ఆశీస్సులు అందించారని జనసేన శ్రేణులు గుర్తు చేస్తున్నారు. ప్రజారాజ్యంలో సీట్లు అమ్ముకున్నారనే విమర్శల్లో నిజం సంగతేమో గానీ, జనసేన సీట్లు మాత్రం యథేచ్ఛగా సేల్ అయ్యాయని సొంత పార్టీ నుంచి వస్తున్న విమర్శలకు అడ్డుకట్ట వేసే దారేది?