కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ఇటీవల కాలంలో తన సహజ స్వభావానికి విరుద్ధంగా స్వరం పెంచుతున్నారు. అవినాష్ సౌమ్యుడిగా, నెమ్మదస్తుడిగా పేరు పొందారు. వివేకా హత్య కేసులో ఆయన తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల కడప ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు.
అవినాష్‌పై షర్మిల, డాక్టర్ సునీత ఇష్టమొచ్చినట్టు నోరు పారేసుకుంటున్నారు. చాలా కాలంగా సునీత ఘాటు ఆరోపణలు చేస్తున్నప్పటికీ, అవినాష్ ఎప్పుడూ సమాధానం ఇవ్వలేదు. అయితే ఎన్నికల సమయంలో నోరు మెదపకపోతే, షర్మిల, సునీత ప్రచారమే నిజమవుతుందని అవినాష్‌రెడ్డి భావించినట్టున్నారు.
అందుకే ఇటీవల కాలంలో షర్మిల, సునీతలపై అవినాష్‌రెడ్డి ఘాటుగా స్పందించారు. అసలు వీళ్లిద్దరూ మనుషులేనా? అని ఆయన విరుచుకుపడ్డారు. వివేకా హత్యలో ఆయన కుటుంబ సభ్యులే అనుమానితులంటూ మీడియా సమావేశంలో అందుకు తగ్గ ఆధారాలను బయట పెట్టారు. దీంతో షర్మిల, సునీలకు మరింత కోపం తెప్పించింది.
తాజాగా సామాజిక పింఛన్‌దారులకు కూటమి చర్యల వల్ల ఇబ్బందులు ఎదురుకావడంపై అవినాష్ విమర్శలు చేశారు. అవినాష్‌రెడ్డి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ పెన్షన్ల పంపిణీలో ఘోరాలకు చంద్రబాబునాయుడే బాధ్యత వహించాలన్నారు. ఎండకు తాళలేక కొందరు పింఛన్‌దారులు అనారోగ్యం పాలవుతున్నారని, అలాగే మరికొందరు మృత్యువాత పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో బాబుకు అవ్వాతాతలు గట్టిగా గుణపాఠం చెబుతారని ఆయన హెచ్చరించారు. రానున్న రోజుల్లో అవినాష్‌రెడ్డి మరింతగా ప్రతిపక్షాలపై ఎదురు దాడికి దిగాల్సిన బాధ్యత అవినాష్‌పై ఉంది.