కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్‌గాంధీపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎన్నికలంటే భయపడొద్దని, ఎక్కడికీ పారిపోవద్దని రాహుల్, సోనియాగాంధీలను మోదీ వెటకరించారు. పశ్చిమబెంగాల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మోదీ తన ప్రత్యర్థులపై చెలరేగారు.
కేరళలోని వయనాడ్‌లో రాహుల్ ఓడిపోతారని తాను ముందే చెప్పానన్నారు. అందుకే వయనాడ్‌లో ఎన్నికలు పూర్తి కాగానే రెండో స్థానం నుంచి రాహుల్ పోటీ చేయడానికి సిద్ధమయ్యారని తప్పు పట్టారు. సోనియాగాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారని ఆయన గుర్తు చేశారు. భయపడొద్దని, ఇతర ప్రాంతాలకు పారిపోవద్దని తల్లీతనయుడికి సూచిస్తున్నట్టు మోదీ తెలిపారు.
భయంతోనే రెండో స్థానమైన రాయ్‌బరేలి నుంచి రాహుల్‌గాంధీ పోటీ చేస్తున్నాడని ఆయన విమర్శించారు. మొదట అమెథీ నుంచి రాహుల్‌గాంధీ పోటీ చేస్తారని కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేశారన్నారు. ఆ తర్వాత భయంతో రాయ్‌బరేలికి పారిపోయారని ఆయన విమర్శించారు.
కేరళలోని వయనాడ్ నుంచి గత సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గెలుపొందారు. ఈ దఫా ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలి, అమేథీ పార్లమెంట్ స్థానాల నుంచి రాహుల్, ప్రియాంక గాంధీ పోటీ చేస్తారని కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేశారు. అయితే నామినేషన్ సమయానికి అమేథీ నుంచి కాంగ్రెస్ మరొకరిని బరిలో నిలిపింది. ప్రియాంక గాంధీ ఎన్నికలకు దూరంగా ఉన్నారు. రాహుల్ మాత్రం రాయ్‌బరేలిని ఎంచుకున్నారు. రాహుల్ రెండో చోట్ల పోటీ చేయడంపై మోదీ సెటైర్స్ విసరడం గమనార్హం.