నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియపై వైసీపీ నియోజకవర్గ నాయకుడు భూమా కిశోర్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అహోబిలం మెట్లపై అడుక్కుంటున్న వాళ్లను కూడా వాటా అడుగుతోందని అఖిలప్రియపై భూమా కిశోర్ తీవ్ర ఆరోపణలు చేశారు. కేసీ కెనాల్‌కు సాగునీళ్లు విడుదల చేయకపోతే, వైసీపీ నేతలు రైతుల కోసం మాట్లాడకుండా గాడిదలు కాస్తున్నారా? అని అఖిలప్రియ ప్రశ్నించిన నేపథ్యంలో కిశోర్‌రెడ్డి ఘాటైన కౌంటర్ ఇచ్చారు.
భూమా కిశోర్ మీడియాతో మాట్లాడుతూ లక్షలాది రూపాయలు జీతాలు తీసుకుంటూ, ఏమీ చేయకుండా గాడిదలు కాస్తున్నావా? అని నిలదీశారు. కేసీకెనాల్‌కు నీళ్లు వచ్చాయని అఖిలప్రియ అనడంలో వాస్తవం లేదన్నారు. సిరివెళ్లలో ఆత్మహత్యలే శరణ్యమని రైతులు హెచ్చరించడాన్ని ఆయన వీడియో ప్రదర్శించారు. ఆళ్లగడ్డలో ఉన్నావు కదా, గాడిదలు కాస్తున్నావా? అని ప్రశ్నించారు. పనికి మాలిన ప్రభుత్వం, పని చేయడం లేదని మీ తమ్ముడు జగత్‌విఖ్యాత్‌రెడ్డి చెబుతున్నారని అఖిలప్రియకు గుర్తు చేశారు.
కూటమి ప్రభుత్వం పనికిమాలినదని మీరే ఒప్పుకుంటున్నప్పుడు, ఇక అధికారంలో వుండడం ఎందుకని ఆయన నిలదీశారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ గాడిదలు కాస్తున్నారని మీరు చెబుతున్నట్టే కదా అని ఆయన అన్నారు. రైతుల గురించి గింజుకుంటున్నారే, మరి రైతు భరోసా, ఇన్‌ఫుట్ సబ్సిడీ ఎక్కడికి పోయాయని ఆయన నిలదీశారు. రైతులకు పంటల బీమా ఏమైందని ఆయన ప్రశ్నించారు. గాడిదలు కాస్తున్నారా? అని న్రశ్నించారు.
కూటమి ప్రభుత్వ దరిద్ర పరిపాలన ఏ విధంగా ఉందో ఒక్కసారి ఆళ్లగడ్డ ప్రజల్ని అడగాలని ఆయన కోరారు. రాష్ట్రంలో ఎక్కడికైనా పోయి భూమా అంటే…కిలో చికెన్‌పై రూ.10 వసూలు చేస్తున్నారని ఛీ కొడుతున్నారని ఆయన అన్నారు. రంజాన్ సమయంలో కూడా తమను మనశ్శాంతిగా బతకనివ్వకుండా, చికెన్ దుకాణాల్ని సీజ్ చేస్తున్నారని ముస్లింలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని విమర్శించారు. ప్రజలు ఏ వ్యాపారాల్ని చేసుకోకూడదా? అని ఆయన నిలదీశారు.
ఈ మధ్య అహోబిలం వెళ్లామని, తమకు భక్తులు వేసే భిక్షంలో కూడా వాటా అడుగుతున్నట్టు భిక్షగాళ్లు చెప్పారని ఎమ్మెల్యే అఖిలప్రియపై సంచలన ఆరోపణ చేశారు. వెయ్యి రూపాయిలు భిక్షగాళ్లు సంపాదిస్తే, అందులో రూ.800 తీసుకుని, కూలి కింద రూ.200 ఇస్తున్నారని తమతో చెప్పారని భూమా కిశోర్ ఆరోపించడం రాజకీయ దుమారం రేపుతోంది. అహోబిలం మెట్లపై అడుక్కునే వాళ్లను కూడా వాటా అడిగే పరిస్థితికి దిగజారిపోయారని తీవ్ర ఆరోపణలు చేయడం గమనార్హం. ఇంత వరకూ తన జీవితంలో ఇలాంటి దిక్కుమాలిన రాజకీయాలు చేసిన వాళ్లను చూడలేదని ఆయన వాపోయారు.
ఇలాటి దరిద్రం మీరు ఖండించాలి కదా? అసెంబ్లీ కి ఎందుకు వెళ్ళరు?
అక్కడ అడుక్కునే వాళ్లల్లో వీడు ఒకడు, లేక పోతే వీడికేలా తెలుస్తుంది!!
వైసీపీ వాళ్లు గాడిదలు కాస్తున్నారా..
అని కాలి తో తన్నినట్టు అఖిలమ్మా మాట్లాడితే కానీ మీకూ మెలుకువ రాలేదు