బాబు గారూ.. ఇది ప్ర‌మాద సంకేతం!

కూట‌మి రాజ‌కీయంగా సొమ్ము చేసుకుంది. డీఏల విష‌య‌మై కూడా ఉద్యోగులు గుర్రుమ‌ని ఉన్నారు.

నారా చంద్ర‌బాబునాయుడిని ముఖ్య‌మంత్రి చేయాల‌నుకోవ‌డం కంటే, వైఎస్ జ‌గ‌న్‌ను ఎట్టి ప‌రిస్థితుల్లోనూ గ‌ద్దె దింపాల‌ని ప‌ట్టుప‌ట్టిన వ‌ర్గంలో ఉద్యోగులు మొద‌టి వ‌రుస‌లో వున్నారు. ఉద్యోగులు అనుకున్న‌ట్టే వైఎస్ జ‌గ‌న్ ఘోరంగా ఓడిపోయారు. క‌ర్ణుడి చావుకు కార‌ణాలు అనేకం అన్న‌ట్టుగా, అన్ని వ‌ర్గాల అసంతృప్తి వైసీపీ ఘోర ప‌రాజ‌యానికి కార‌ణ‌మైంది.

కూట‌మికి అప‌రిమిత‌మైన అధికారం ద‌క్కింది. స‌హ‌జంగానే ఉద్యోగుల్లో చంద్ర‌బాబు స‌ర్కార్‌పై ఆశలు చాలా ఉన్నాయి. అయితే ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత ఇంత వ‌ర‌కూ ఉద్యోగుల స‌మ‌స్య‌ల్ని ప్ర‌భుత్వం అడ్ర‌స్ చేసిన దాఖ‌లాలు క‌నిపించ‌లేదు. అయితే ప్ర‌భుత్వం ఏర్ప‌డి, కుదురుకోడానికి కొంత స‌మ‌యం ఇవ్వాల‌నే సానుకూల ఆలోచ‌న‌లోనే ఇంత వ‌ర‌కూ ఉద్యోగులున్నారు. అయితే ఉద్యోగుల్లో ప్ర‌భుత్వంపై అసంతృప్తి వుంద‌ని ఇప్పుడిప్పుడే తెలుస్తోంది.

ఏరికోరి తెచ్చుకున్న ప్ర‌భుత్వంపై ఉద్యోగుల్లో వ్య‌తిరేక‌త క‌నిపించ‌డం ప్ర‌మాద సంకేతంగా చూడాల్సి వుంటుంది. ముఖ్యంగా ఆర్థిక విష‌యాల్లో ప్ర‌భుత్వం వైపు నుంచి ఉద్యోగులు ఆశించిన స్థాయిలో క‌నీస స్పంద‌న లేద‌నే చేదు నిజం బ‌య‌ట ప‌డ‌డం గ‌మ‌నార్హం.

ముఖ్యంగా ఉద్యోగుల‌కు ప్ర‌భుత్వం చెల్లించాల్సిన బ‌కాయిలు రూ.20 వేల కోట్ల‌కు పైనే. దీనిపై ప్ర‌భుత్వం స్పందించ‌లేద‌ని ఏపీ రెవెన్యూ స‌ర్వీసెస్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడు బొప్ప‌రాజు ఆరోపించ‌డం గ‌మ‌నార్హం. ఇదే విష‌యాన్ని మ‌రో ఉద్యోగ సంఘ నాయ‌కులు వెంక‌ట్రామిరెడ్డి కూడా చెప్పారు. ముఖ్యంగా అన్ని ర‌కాల ధ‌ర‌లు పెర‌గ‌డంతో వేత‌నాల పెంపును ఉద్యోగులు ఆశిస్తున్నారు. ఇందుకోసం పీఆర్‌సీ వేస్తార‌ని ఉద్యోగులు ఆశించారు. ఒక‌వేళ పీఆర్‌సీ క‌మిష‌న్ చైర్మ‌న్‌ను నియ‌మించ‌క‌పోతే, ఐఆర్ అయినా ఇస్తార‌ని న‌మ్మ‌కంగా వుంటూ వ‌చ్చారు. ఆ రెండూ జ‌ర‌గ‌లేదు.

ఇక రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్‌, పెండింగ్ బిల్లుల సంగ‌తి స‌రేస‌రి. త‌మ ప‌రిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో ప‌డ్డ చంద‌మైంద‌ని ఉద్యోగులు అసంతృప్తి చెంద‌డం కూట‌మికి తీవ్ర‌మైన వ్య‌తిరేక సంకేతంగా భావించాల్సి వుంటుంది. ప్ర‌ధానంగా ఉద్యోగుల్లో అసంతృప్తికి కార‌ణం ఏంటంటే… స‌ర్కార్‌పై ఆశ‌లు, అంచ‌నాలు ఎక్కువ వుండ‌డ‌మే. గ‌త ప్ర‌భుత్వం ఉద్యోగుల్ని అస‌లు ప‌ట్టించుకోక‌పోగా, వాళ్ల‌ను ఇబ్బంది పెట్టింద‌న్న చెడ్డ పేరు వుంది.

దాన్ని కూట‌మి రాజ‌కీయంగా సొమ్ము చేసుకుంది. డీఏల విష‌య‌మై కూడా ఉద్యోగులు గుర్రుమ‌ని ఉన్నారు. అస‌లే ప్ర‌భుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంద‌ని చంద్ర‌బాబు ప‌దేప‌దే చెబుతున్నారు. ఉద్యోగులేమో త‌మ ఆర్థిక విష‌యాల్ని చూడాల‌ని డిమాండ్ మొద‌లు పెట్టారు. ప్ర‌స్తుతానికైతే, ఇది హెచ్చ‌రికే. మొగ్గ ద‌శ‌లోనే తుంచేయ‌డానికి ప్ర‌భుత్వానికి అవ‌కాశం వుంది. కాదు, కూడ‌దు అనుకుంటే… ఎన్నిక‌ల నాటికి ఉద్యోగుల వ్య‌తిరేక‌త ఎదుర్కోవాల్సి వుంటుంద‌ని గ్ర‌హిస్తే మంచిది.

13 Replies to “బాబు గారూ.. ఇది ప్ర‌మాద సంకేతం!”

  1. ఇప్పుడు ఆ సమస్యలు అన్నీ తీర్చేస్తే కొత్త సమస్యలు పట్టుకొని వస్తారు… ఎలక్షన్ వరుకూ సాగదీసి, ఎలక్షన్ ముందు కొంచెం చేసి, మళ్ళీ గెలిపిస్తే అప్పుడు మిగతా చేస్తాం అంటే నమ్ముతారు… జగన్ చూడు, మొదటే చెయ్యగలిగినన్ని చేసాడు.. ఎలక్షన్ టైం లో మిగతా చెయ్యడానికి డబ్బులు లేవు… చావగొట్టి చెవులు పెట్టి మెలేసి మూల పెట్టారు..

  2. నేను : బాబోరు 100 రోజుల్లో 100 IT కంపెనీస్ తెస్తా అన్నారు.. .. తెచ్చారా.. ?

    వాడు : ఏయ్ ఎం మాట్లాడుతున్నావ్.. మందు మీద ఇరవై రూపాయిలు తగ్గించాం.. చాలదా..

  3. ఇంకా 50 నెలల పైనే ప్రభుత్వానికి సమయం ఉంది, అప్పుడే ప్రమాదకరమైన సంకేతాలు, జనాలు ఓట్లు వేయరు అనే మాటలు ఎందుకో అర్థం కావడం లేదు, ఎన్నికల వచ్చే చివరి సంవత్సరం ఇలాంటివి అన్ని మాట్లాడుకోవచ్చు..ఇప్పుడు ఎందుకు, ప్రభుత్వం ఏం చేసింది, ఏం చేస్తుంది, ఏం చేయలేదు మాత్రమే చెప్పు.. అంతే కానీ ఎప్పుడో జరిగే ఎన్నికలకి ఇప్పుడే ఎందుకు ప్రభుత్వం భయపడుతుంది.

  4. ధరలు పెరిగేదే ఇలాంటి వాళ్ళని పోషిస్తుండడం వలన…సాధ్యమైనంత వీళ్ళ సంఖ్య తగ్గినచేయాలి

  5. ఇలాంటి సంకేతాలు ౧౯-౨౪ మధ్య ఇచ్చి ఉంటె కనీసం పెతిపక్ష హోదా అయినా వోచేదిగా ..

Comments are closed.