ఏపీ ఎన్నికల్లో గాజుగ్లాసు గుర్తుపై రచ్చ జరుగుతోంది. గత ఎన్నికల్లో గాజుగ్లాసు గుర్తును జనసేనకు కేటాయించారు. అయితే జనసేన కేవలం రిజిస్టర్ పార్టీ మాత్రమే కావడంతో గాజుగ్లాసు గుర్తును ఫ్రీసింబల్ కేటగిరీలో కేంద్ర ఎన్నికల సంఘం ఉంచింది. దీంతో ఆ గుర్తును ఎవరైనా ఎంచుకోవచ్చు. నిబంధనల ప్రకారం ఎవరో ఒకరికి ఎన్నికల అధికారులు కేటాయిస్తారు.
ఈ నేపథ్యంలో గాజుగ్లాసు గుర్తు కోసం మొదట తామే దరఖాస్తు చేసుకున్నామని, తమకు కేటాయించకుండా జనసేనకు ఎన్నికల సంఘం ఇచ్చిందంటూ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై ఇరు పార్టీల వాదనలు విన్న హైకోర్టు కీలక తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే.
జనసేన పోటీ చేసే నియోజకవర్గాల్లో ఆ పార్టీకి కేటాయించాలని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో జనసేన పోటీ చేయని నియోజకవర్గాల్లో గాజుగ్లాసు కోసం స్వతంత్ర అభ్యర్థులు, ఇతర రిజిస్టర్ పార్టీల నుంచి ఎన్నికల సంఘానికి పెద్ద ఎత్తున విజ్ఞప్తులు వెళ్లినట్టు తెలిసింది. మరోవైపు గాజుగ్లాసు గుర్తును జనసేనకు తప్ప మరెవరికి కేటాయించొద్దని టీడీపీ పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే.
అయితే గాజుగ్లాసు గుర్తుపై కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి నిర్ణయం వెలువడకపోవడం ఉత్కంఠ రేకెత్తిస్తోంది. మరోవైపు ఎన్నికలకు సమయం దగ్గర పడుతోందని, ప్రచారం చేసుకోవాలంటే గుర్తు త్వరగా కేటాయించాలనే డిమాండ్స్ వెల్లువెత్తుతున్నాయి. గాజుగ్లాసు గుర్తును ఫ్రీ సింబల్ కింద చేర్చిన తర్వాత, కేటాయించకుండా జాప్యం చేయడం ఏంటనే నిలదీతలు ఎదురవుతున్నాయి.