ఏపీలో ఎన్నికలకు గట్టిగా 17 రోజుల సమయం వుంది. మరీ ముఖ్యంగా పోలీసు, ఇతర ఉన్నతాధికారులు వైసీపీకి అనుకూలంగా ఉన్నారని ఎల్లో మీడియా నిత్యం కథనాల్ని వండివార్చుతోంది. అలాగే ఎన్నికల సంఘానికి కూటమి నేతలు ఫిర్యాదు చేస్తున్నారు. ఈ రాతలు, ఫిర్యాదులు నాణేనికి ఒకవైపు. ఈ పరిణామాలు ఎలాంటి సంకేతాలు ఇస్తున్నాయనే చర్చకు తెరలేచింది.
ఎక్కడైనా రాజకీయ వాతావరణాన్ని పసిగట్టేది ఉద్యోగులే. మరీ ముఖ్యంగా పోలీస్, ఇతర శాఖల ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటూ వుంటారు. అధికార పార్టీకి వ్యతిరేకత వుందని పసిగడితే… ఎన్నికల్లో తటస్థంగా వ్యవహరిస్తుంటారు. ఆంధ్రనే కాదే, తెలంగాణలో అయినా, జమ్మూకశ్మీర్‌లోనైనా అధికారుల తీరు ఒకేలా వుంటుంది. ఒకవేళ అధికార పార్టీకి విజయావకాశాలు ఉన్నాయని గ్రహిస్తే, అనుకూలంగా వ్యవహరిస్తుంటారు. ఇది సర్వ సాధారణం.
ఇప్పుడు ఏపీలో పోలీసు , ఇతరత్రా విభాగాల ఉన్నతాధికారులు వైసీపీకి వెన్నుదన్నుగా నిలుస్తున్నారనే ఎల్లో మీడియా వార్తా కథనాలు, అలాగే కూటమి నేతల ఫిర్యాదులు …ఒక స్పష్టమైన సంకేతాన్ని జనాల్లోకి పంపుతున్నాయి. అదేంటంటే… మళ్లీ వైసీపీనే అధికారంలోకి రాబోతోంది, రెండోసారి జగనే సీఎం అనే సంకేతాల్ని ఎల్లో మీడియా కథనాలు పంపుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ముఖ్యంగా పోలీస్ ఉన్నతాధికారులు ఆఫ్ ది రికార్డుగా …. మళ్లీ జగనే సీఎం అవుతారని, ఇంటెలిజెన్స్ నివేదికలు నిర్ధారిస్తున్నాయని స్పష్టం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ జగన్‌పై ఆదరణ తగ్గలేదని చెబుతున్నారు. అలాగే పట్టణ ప్రాంతాల్లో మైనార్టీలు ఎక్కువ ఉన్న చోట వైసీపీకి సానుకూల వాతావరణం వుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. గతంతో పోలిస్తే వైసీపీకి సీట్లు తగ్గొచ్చు తప్ప, అధికారం పక్కా అనే అభిప్రాయానికి రావడం వల్లే ఉద్యోగులు అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారనే చర్చ జరుగుతోంది.