గాజుగ్లాసు గుర్తుపై జనసేనాని పవన్‌కల్యాణ్ ఎట్టకేలకు ఊపిరి పీల్చుకున్నారు. గాజుగ్లాసు గుర్తుపై కొంత కాలంగా వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో జనసేనకు గాజుగ్లాసు గుర్తు కేటాయించారు. అయితే జనసేన కేవలం రిజిస్టర్డ్ పార్టీ మాత్రమే కావడంతో ఈ ఎన్నికల్లో అదే గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించలేదు.
ఈ దఫా గాజుగ్లాసును ఫ్రీసింబల్ కింద ఎన్నికల సంఘం ఉంచింది. దీంతో జనసేనలో భయం పుట్టింది. ఇలాగైతే రాజకీయంగా తమకు తీవ్ర దెబ్బ తగులుతుందని జనసేన ఆందోళనకు గురైంది. పొత్తులో భాగంగా 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాల్లో జనసేన పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఫ్రీసింబల్ కింద చేర్చిన గాజుగ్లాసును తమకు కేటాయించాలంటూ కొన్ని రిజిస్టర్డ్ పార్టీలు, అలాగే స్వతంత్ర అభ్యర్థులు ఎన్నికల సంఘానికి విజ్ఞప్తులు చేశారు.
దీంతో జనసేన న్యాయపోరాటానికి దిగింది. జనసేన పోటీ చేసే నియోజకవర్గాల్లో ఆ పార్టీకే గాజుగ్లాసు గుర్తు కేటాయించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో జనసేన పోటీ చేయని చోట గాజుగ్లాసు గుర్తును ఎవరికీ కేటాయించొద్దని జనసేనతో పాటు టీడీపీ నేతలు ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది.
జనసేన పోటీ చేయని నియోజకవర్గాల్లో గాజుగ్లాసు గుర్తును ఎవరికీ కేటాయించొద్దని ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చింది. గాజుగ్లాసును జనసేన కామన్ సింబల్‌గా గుర్తించింది. అలాగే మరికొన్ని రిజిస్టర్డ్ పార్టీలకు కామన్ సింబల్స్‌ను కేటాయిస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చింది.