అతివాగుడు

తాగుబోతులకు ఒక ఎడ్వాంటేజీ ఉంటుంది. తగాదా వచ్చినప్పుడు వాళ్లు ఎంత అనుచితంగా అయినా ప్రవర్తించవచ్చు.. అసభ్యంగా అయినా తిట్టవచ్చు. అంతా చేసేసిన తర్వాత.. ‘తాగి ఉన్నాడులే బాస్.. వాడి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు’…

తాగుబోతులకు ఒక ఎడ్వాంటేజీ ఉంటుంది. తగాదా వచ్చినప్పుడు వాళ్లు ఎంత అనుచితంగా అయినా ప్రవర్తించవచ్చు.. అసభ్యంగా అయినా తిట్టవచ్చు. అంతా చేసేసిన తర్వాత.. ‘తాగి ఉన్నాడులే బాస్.. వాడి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు’ అని ఎవరో ఒకరు సర్దిచెప్పేస్తారు.

రాజకీయాల్లో కూడా అలాంటి పరిస్థితి ఏర్పడుతున్నట్టుగా ఉంది. అజ్ఞానం పుష్కలంగా ఉన్నప్పుడు.. ఎలాంటి వదరుబోతు మాటలైనా మాట్లాడవచ్చు. ఆ మాటలకు తలాతోకా వుండాల్సిన అవసరం లేదు. ఒక లాజిక్ కు అవి లోబడాల్సిన అవసరం కూడా లేదు. అవన్నీ పిచ్చి మాటలుగా లెక్కతేలితే.. ‘ఏదో రాజకీయ అజ్ఞానిలే. వదిలేయండి బాస్.. పట్టించుకోవాల్సిన అవసరం లేదు’ అని ఎవరో ఒకరు తుస్సుమని తేల్చిపారేస్తారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినంత వరకు వర్తమాన రాజకీయ ప్రపంచంలో రాజకీయ అజ్ఞానిగా తనదైన గుర్తింపును సంపాదించుకున్న ఏకైక నాయకుడు సినిమా హీరో పవన్ కల్యాణ్. ఆయన మాట్లాడే మాటలు కూడా.. కొన్ని జనాలకు చిరాకు తెప్పిస్తూ, కొన్ని జనాలకు హాస్యాస్పదంగా కనిపిస్తూ ‘అతివాగుడు’గా మిగిలిపోతున్నాయి. పవన్ కల్యాణ్ వాచాలత్వం మీదనే ఈ వారం గ్రేట్ ఆంధ్ర కవర్ స్టోరీ ‘అతివాగుడు’!

ఇప్పుడున్న రాజకీయ నాయకుల్లో ఆవేశపూరితమైన ప్రసంగాలకు పెట్టింది పేరు.. పవన్ కల్యాణ్ అని ఎవరైనా అనుకుంటే తప్పులో కాలేసినట్టే. రాజకీయ ప్రసంగం అంటే కేవలం ఆవేశంగా ఊగిపోతూ మాట్లాడడం మాత్రమే కాదు అనే సంగతి తెలిసిన ఎవ్వరూ కూడా ఆయనకు అలాంటి సర్టిఫికెట్ ఇవ్వలేరు. పవన్ కల్యాణ్ కేవలం ఆలోచనా రహితమైన ప్రసంగాలకు మాత్రమే పెట్టింది పేరు! కేవలం ఆలోచనా రహితమే అయినా కూడా సర్దుకుపోవచ్చు. కానీ ఆయన మాటలు విషపూరితంగా ఉంటున్నాయి.

ఓట్లుగా మార్చుకోవడం చేతకాని అనన్యమైన ప్రజాదరణ పవన్ కల్యాణ్ సొంతం. ఆయన సభలకు జనం వస్తారు. ఆయనతో సెల్ఫీలకు ఎగబడతారు. ఆయనను చూస్తే చాలని అనుకునే వాళ్లు కూడా ఉంటారు. వాళ్లందరూ ఆయనకు ఓట్లు వేసేవాళ్లే అయితే.. 2019 ఎన్నికల్లోనే రెండు నియోజకవర్గాల్లోనూ గెలిచి పవన్ కల్యాణ్ ఈ సరికి తన రాజకీయ ట్రాక్ రికార్డులో నిష్కళంకత్వం ఏపాటిదో బయటపెట్టుకుని ఉండేవారు. ఆయనకున్న జనాదరణ మొత్తం సభల్లో విజిల్స్ కు, చప్పట్లకు మాత్రమే పరిమితమైనటువంటిది. కాకపోతే, ఆ వేల, లక్షల మంది బుర్రలను కలుషితం చేయడానికి ఆయన మాటలు పనిచేస్తూ ఉంటాయి.

రాజకీయంగా పవన్ కల్యాణ్ కు ఒక ప్రత్యేకమైన ఎడ్వాంటేజీ ఉంది. ‘అవినీతిపరుడిగా’ ఆయన మీద ముద్ర లేదు. అయితే ఇదేమీ మహాద్భుతం కాదు. ఎందుకంటే.. ఆయన ఇప్పటిదాకా అధికారం రుచి మరగలేదు. అధికారంలోకి రావడం సంగతి తర్వాత.. కనీసం ఆయన ఒక్కచోటనైనా ఎమ్మెల్యేగానైనా గెలిచి ఉంటే పరిస్థితి ఇంకో రకంగా ఉండేది. అవినీతి చేయడానికి ఆస్కారమే ఇప్పటిదాకా ఆయనకు లభించనప్పుడు, నీతిపరుడంటూ కొనియాడడం కూడా అర్థరహితం అవుతుంది. అదే సమయంలో.. పవన్ కార్యసమర్థత, దక్షత కూడా ప్రశ్నార్థకాలే. ఎందుకంటే.. ఇప్పటిదాకా ఆయనలోని ఆ లక్షణాలు మొత్తం కేవలం మాటల్లోనే కనిపిస్తూ వస్తున్నాయి.

ఒకసారి గెలిచి ఉంటే నిజంగానే ప్రజలకు ఎంత అందుబాటులో ఉంటారో.. ప్రజల అవసరాల పట్ల, సమస్యల పట్ల ఏరీతిగా స్పందిస్తూ ఉంటారో.. కనీసం నియోజకవర్గంలోని వారితో ఎంత శ్రద్ధగా సెల్ఫీలు దిగుతూ ఉండేవారో అర్థమయ్యేది. ఇప్పటిదాకా ఆయన కార్యదక్షత గురించి కూడా ఎవ్వరికీ క్లారిటీ లేదు. కాబట్టి ఆయనను అసమర్థుడని గానీ, అవినీతిపరుడని గానీ అనలేం.

అవి ఆయన బలాలు అయినప్పటికీ.. ఆయనను భ్రష్టుపట్టిస్తున్నదెల్లా ఆయన అతివాగుడు. ఆయన సభల్లో ఊగిపోతూ.. నెత్తిమీద జుత్తు పైకి ఎగదోసుకుంటూ మాట్లాడేవి ప్రజల మనసులను గెలుచుకునే మాటలు కానే కాదు. వారి బుర్రల్లో విషం నింపే మాటలు. ఆయనను కూడా భ్రష్టు పట్టించే మాటలు. అందుకే వాటిని అతివాగుడుగా పరిగణించాల్సి వస్తోంది.

ఎందుకు పవన్ గురించే…

అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తప్ప.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలదీ ఒక్కటే ఎజెండా. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నిందించడం. తప్పుడు వ్యక్తిగా, ప్రమాదకరమైన నాయకుడిగా ప్రొజెక్టు చేయడం! అందరూ చేస్తున్నది ఇదే పని అయినప్పుడు ఒక్క పవన్ కల్యాణ్ అతివాగుడు గురించి మాత్రమే ఎందుకు మాట్లాడుకోవాలి? అనే మీమాంస మనకు ఎదురుకావొచ్చు. ఎందుకంటే మిగిలిన నాయకుల మాటలకంటె అది ప్రమాదకరం. విషపూరితం కాబట్టి. ఇదంతా కేవలం ఆయన రాజకీయ అజ్ఞాన ఫలితమే తప్ప వేరొకటి కాదు.

ముందే చెప్పుకున్నట్టుగా.. పవన్ కల్యాణ్  మాటలు ఎక్కువమంది మీద ప్రభావం చూపిస్తాయి. ఆయనకు కనీస రాజకీయ స్పృహలేకపోవడం వలన ఏం మాట్లాడుతున్నారో ఆయనకు తెలియదు. మాట్లాడే మాటల ప్రభావం ఎలా ఉంటుందో కూడా ఆయనకు తెలియదు. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడు దగ్గరి నుంచి.. పొలిటికల్ కమెడియన్ గా జనం అనుకునే కెఎ పాల్ వరకు అందరూ జగన్ ను విమర్శించే వాళ్లే. ఇలాంటి వాళ్లు ఇంకో వందమంది విమర్శించినా పెద్ద నష్టం లేదు. విమర్శించడానికి వారికి హక్కు ఉంటుంది కూడా.

రాజకీయం అన్నాక విమర్శలే ఉంటాయి. జగన్ ను సూటిగా విమర్శిస్తే ఏ దిగులూ లేదు. ఆయా నాయకుల మీద నమ్మకం ఉన్న ప్రజలు వారు చేసే విమర్శలు నిజమే అనుకుంటారు. వారితోపాటు జగన్ మీద ద్వేషం పెంచుకుంటారు.  వారి నమ్మకం లేని ప్రజల దృష్టిలో వారు ఎంత మొత్తుకున్నా ఉపయోగం ఉండదు. కానీ పవన్ కల్యాణ్ మాటలు ఏకంగా వ్యవస్థల్ని టార్గెట్ చేసేవి. ప్రత్యర్థిగా జగన్ మీద కాదు సమాజం మీద సమాజంలోనే అపోహలు, అనుమానాలు, భయాలు పుట్టించేవి. అందువల్ల పవన్ అతివాగుడు గురించి మనం మాట్లాడుకోవాలి. పవన్ మాట్లాడేవి.. అతిశయంతో కూడిన అర్థరహిత ఆవేశపు నిందలు, అబద్ధాలు, వక్రీకరణలు!

ప్రత్యర్థుల మాటలను వక్రీకరిస్తూ రాజకీయాల్లో మనుగడ సాగించాలనుకోవడం ప్రతి ఒక్కరూ చేస్తున్న పనే. కానీ పవన్ కల్యాణ్.. రాజకీయ అనుభవం, జ్ఞానం లేని నాయకుడు గనుక.. తమ కూటమి నాయకుల మాటలనే తాను వక్రీకరిస్తూ వాటిని అబద్ధాలుగా మలుచుతూ.. ప్రజలను తప్పుదారి పట్టిస్తూ ఉంటారు. అందుకే ఆయన అతివాగుడు గురించి పట్టించుకోవాలి.

ఎందుకు పవన్ గురించే మాట్లాడుకోవాలంటే.. ఇప్పుడు రాష్ట్రంలో ఎన్నికల సమరాంగణం మొత్తానికి తానే కీలకమైన ఇరుసు వంటి వ్యక్తిని అని పవన్ భావిస్తున్నారు. జగన్ ను పతనం చేయడానికి ఎన్డీయే కూటమి జట్టుకట్టడానికి తాను చేసిన త్యాగాలే కారణం అని ఆయన అనుకుంటున్నారు.

తాను నిందలు భరించి తిట్లు తిని, అనేక మార్లు సంప్రదింపులు జరపడం వల్ల మాత్రమే.. ఎన్డీయేలోకి తెలుగుదేశం రాగలిగిందని ఆయన స్వయంగా సభల్లోనే చెప్పుకున్నారు. 60-70 అనుకున్నది కాస్తా 21 సీట్లకు తన పార్టీని కురచ చేసేసి.. తాను చేసిన త్యాగాల వల్ల మాత్రమే కూటమి బలంగా రూపొంది పోరాడుతున్నదని ఆయన భావిస్తున్నారు. అందువల్ల.. ఆయన మాటల్లోని అతివాగుడు గురించి మనం చెప్పుకోవాలి.

ఊగుడు తగ్గించుకోవడం చేతకాదేమో..

ఆవేశంగా, రంకెలు వేస్తున్నట్టుగా ఊగిపోతూ మాట్లాడితే.. చేతిని గాల్లోకి విసురుగా విదిలిస్తూ చెలరేగిపోతే.. తాను మాట్లాడే ప్రతిమాటా నిజాయితీగా మాట్లాడుతున్నట్టుగా ప్రజలు భ్రమిస్తారనే నమ్మకం పవన్ లో చాలానే ఉంది. తనను తాను సత్యసంధుడిగా ప్రొజెక్టు చేసుకోవడానికి ఆయన అలా చేస్తూ ఉంటారు. కానీ.. అలాంటి అభినయ కౌశలం సినిమాల్లో అయితే.. ఆయన తలపోస్తున్న ఇమేజినే కట్టబెట్టేది. కానీ ఇది రాజకీయం.

ఇక్కడ ఆ తరహాలో- వారాహి ఎక్కిన ఏకపాత్రాభినయాన్ని ప్రజలు కామెడీగా తీసుకుంటారనే సంగతి ఆయనకు తెలియడం లేదు. పవన్ కల్యాణ్ ప్రసంగం ప్రజల దృష్టిలో విలువ లేకుండా.. పలుచన అయిపోవడానికి మరొకరు ఎవ్వరూ ప్రయత్నించాల్సిన అవసరం లేదు. ఆ పని కూడా ఆయనే చేసుకుంటారు.

జగన్ ను తిట్టవలసి వస్తూ ఆవేశంతో ఊగిపోతూ రెచ్చిపోయి మాట్లాడే పవన్ కల్యాణ్, క్షణం కూడా గ్యాప్ లేకుండా ఆ వెంటనే.. ఒక వెకిలి జోకు వేసి.. వెకిలినవ్వులతో సభను రంజింపజేయాలని అనుకుంటారు. సినిమాలో సీరియస్ సీను, ఫైటు సీన్ తర్వాత కామెడీ సీను వండుకుంటూ స్క్రిప్టు రాసుకునే అలవాటు ఇది. రాజకీయం కూడా సినిమా స్క్రిప్టు వండినంత ఈజీ అనుకుంటారు. పంచ్ డైలాగుల కోసం, కవిత్వం కొటేషన్ల కోసం సినీ రచయితల్ని ఆశ్రయించి రాయించుకుంటే ఓకే గానీ.. ప్రసంగం సాగవలసిన స్క్రీన్ ప్లేలో కూడా సీరియస్ నెస్ ను, కామెడీని ఒకదానితర్వాత ఒకటి కలిపి వండాలనుకుంటే చాలా చీదరగా ఉంటుంది. అంతసేపు ఎంతో సీరియస్ గా సాగిపోయే పవన్ ప్రసంగం హఠాత్తుగా లేకిగా మారిపోతుంది.

ప్రత్యర్థి మీద చేసే విమర్శలో చిత్తశుద్ధి ఉన్నప్పుడు, అది నిజమైన విమర్శ అని కనీసం తాను పూర్తిస్థాయిలో నమ్ముతున్నప్పుడు.. అలా ఆవేశంతో ఊగిపోవాల్సిన అవసరం లేదు. బడిలో టీచరు పాఠం చెప్పినట్టుగా నింపాదిగా అదే విమర్శను చెప్పినా సరే.. ప్రజలు బాగానే అర్థం చేసుకుంటారు. కానీ సినిమాల్లో డూప్ ఆవేశం, డూప్ ఫైట్లతో ప్రేక్షకులను రంజింపజేయడం అలవాటు చేసుకున్న ఈ యాక్షన్ హీరో, పద్ధతైన రాజకీయం యొక్క లోతు తెలిసిన నాయకుడిలాగా మాట్లాడుతాడని అనుకోవడం భ్రమ.

అతివాగుడుల్లో పరాకాష్ట

పవన్ కల్యాణ్ అతివాగుడు గురించి ఉదాహరణలు ప్రస్తావించుకుంటూ పోతే ప్రత్యేకసంచికలు, పుస్తకాలు వేయాల్సి వస్తుంది. కొన్ని కీలకమైన మాటలను మాత్రం చెప్పుకుందాం. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత.. రాష్ట్రంలో 30 వేల మంది మహిళలు అదృశ్యం అయ్యారనేది పవన్ కల్యాణ్ చేసే ఒక ప్రధానమైన ఆరోపణ. ఎంత సంకుచితమైన మాట అది. 30వేల మంది మహిళలు వ్యభిచార గృహాలకు తరలింపబడ్డారు అని ఆయన దాదాపు డైరక్టుగానే పదేపదే చెబుతూ వస్తున్నారు. చాలా నీచమైన మాట ఇది.

ఏపీలో మొత్తం 28వేల పల్లెలు కూడా లేవు. పవన్ లెక్కల ప్రకారం.. ప్రతి పల్లెనుంచి ఒక మహిళ ఈ అయిదేళ్లలో అదృశ్యమై.. ఎక్కడో వ్యభిచార గృహాల్లో బ తుకుతూ ఉండాలి. ఇదేమైనా నమ్మదగిన విషయంలాగా ఉందా? ఆస్థాయిలో విమెన్ ట్రాఫికింగ్, ఆ స్థాయిలో మహిళలు అదృశ్యం కావడం అనేది నిజమైతే.. హైదరాబాదులో అయితే ఇంట్లో, లేకపోతే షూటింగ్ సెట్లో గడిపే పవన్ కల్యాణ్ కంటె ఆయా గ్రామాల్లో వారికి బాగా తెలుస్తుంది. అలా జరిగి ఉంటే.. జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి ఎవ్వరూ ప్రత్యేకంగా పనిచేయాల్సిన అవసరం లేదు. ప్రజలే ఆయనను ఓడించి ఇంటికి పంపుతారు.

ఇప్పుడు చేపడుతున్న సంక్షేమం కాదు కదా.. ఇంతకు వందరెట్ల సంక్షేమం అందించినా.. గ్రామాల్లో ఇలాంటి అరాచకత్వాతనికి ప్రభుత్వం కారణం అవుతున్నదని నమ్మితే ప్రజలు తిరగ్గొడతారు. సమాజంలో ప్రతి మహిళను అనుమానంగా చూసేలాగా పవన్ కల్యాణ్ తన మాటలతో ప్రజల బుర్రల మీద విషం చల్లుతూ వచ్చారు.

అంతకంటె నీచమైన పని ఏంటంటే.. మహిళలు ఇలా అదృశ్యం అయిపోతున్నారనే ఆరోపణలకు వాలంటీర్ల వ్యవస్థను ముడిపెట్టడం. ఎలాంటి దళారీలు లేకుండా, ప్రభుత్వం చేపడుతున్న ప్రతి సంక్షేమ పథకం కూడా ప్రతి లబ్ధిదారునికి ఖచ్చితంగా నిర్దిష్టంగా ఒకటోతేదీనాటికే ఇళ్లవద్దకే అందేలా జగన్మోహన్ రెడ్డి సంకల్పంతో జరిగిన ఒక మంచి ఏర్పాటు- వాలంటీరు వ్యవస్థ! ప్రత్యర్థులు అయినా సరే.. ఈ వ్యవస్థను ఒప్పుకుని తీరాల్సిందే.

చంద్రబాబునాయుడే వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాం అని పదేపదే చెబుతూ ఉన్నారు. ఆ వ్యవస్థ ద్వారా… సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువ కావడం అనేది చాలా సరళం అయింది. ఆ తీపి ఫలాలను ప్రజలు అనుభవిస్తున్నారు గనుక.. దానిని మార్చగల సాహసం చంద్రబాబుకు కూడా లేదు. కానీ.. పవన్ కల్యాణ్ లాంటి కుత్సిత, సంకుచిత మనస్సున్న నాయకుడు- ఆ వాలంటీరు వ్యవస్థను విమెన్ ట్రాఫికింగ్ వ్యవస్థగా అభివర్ణించారు. అతితక్కువ వేతనాలకు సేవచేస్తున్న వారి విశ్వసనీయతను, గౌరవాన్ని ఆయన తన అతివాగుడుతో పరిహసించాడు. వాలంటీర్ల క్రెడిబిలిటీని దెబ్బతీశాడు. వాలంటీర్లు క్షేత్రస్థాయిలో తమ విధులను తాము సరిగా నిర్వర్తించకుండా తమ పార్టీ మనుషులను వారిమీదకు ఎగదోలి పైశాచిక ఆనందాన్ని ఆయన సొంతం చేసుకున్నాడు. ఇవన్నీ అతివాగుడు కాక మరేమిటి?

అలాగే అబద్ధాలు వక్రీకరణలు కూడా. వాటి గురించి కూడా చెప్పుకోవాలి. పవన్ కల్యాణ్ అతి ఎలా ఉంటుందో అర్థం కావాలంటే.. మోడీ, అమిత్ షాల గురించి ఆయన మాటలను గుర్తుచేసుకోవాలి. వారిద్దరూ తనకు స్నేహితులు అనే మాటను ఆయన ఎన్నిసార్లు వాడి ఉంటారో లెక్కలేదు. మోడీకి సమవయస్కుడైన చంద్రబాబు కూడా తనకు స్నేహితుడు అనడానికి ఎన్నడూ సాహసించలేదు. పవన్ మాత్రం వాళ్లిద్దరూ నా స్నేహితులు వారి ద్వారా ఏ అద్భుతాన్నయినా చేసేస్తానంటారు. మాటలు కోటలు దాటినా చేసేది మాత్రం సున్నా.

విశాఖ ఉక్కు విషయంలో పెద్ద ఉద్ధారకుడిలాగా వెళ్లి అక్కడి ఉద్యమకారులకు హామీలు ఇచ్చేసి వచ్చారు. కానీ.. కేంద్రాన్ని ఏమాత్రం కదిలించలేకపోయారు. అలాంటి అతిమాత్రమే కాదు.. మోదీ, షా వంటి నాయకుల మాటల్ని వక్రీకరించి, అబద్ధాలుగా మార్చి ప్రచారం చేయడం కూడా ఆయనకే చెల్లు.

జగన్మోహన్ రెడ్డి త్వరలోనే జైలుకుపోతాడని ప్రధాని నరేంద్రమోడీ చెప్పారు.. అని పవన్ సభల్లో ప్రకటిస్తారు. అక్కడికేదో  మోడీ తనకు చెవిలో చెప్పినట్టుగా బిల్డప్ ఇస్తారు. తప్పులు చేసిన నాయకులు జైళ్లకు వెళ్లాల్సిందే.. అని మోడీ ఏదో ఒక రాష్ట్రంలో ప్రచార సభలో జనాంతికంగా అన్నారు. అంతకు మించి ఆయన జగన్ పేరు కూడా తేలేదు.

ఏపీలో మాట్లాడినప్పుడు కూడా మోడీ జగన్ పేరు ప్రస్తావించలేదు. తప్పు చేసిన వాళ్లు జైలుకు పోతారని చెప్పడానికి పెద్ద ప్రవక్తలాగా మోడీ మాటల అవసరం కూడా లేదు. ఆ సత్యాన్ని ఎవరైనా నమ్ముతారు. కానీ పవన్ వక్రీకకరణలు ఎలా ఉంటాయంటే.. జగన్ ను జైలుకు పంపడానికి మోడీతో ఆల్రెడీ తాను మాట్లాడేసి, డీల్ కుదుర్చుకున్నట్టు, ముహూర్తం కూడా పెట్టినట్టే కనిపిస్తాయి.

ఇలాంటి అతివాగుడు మాటల వల్ల ప్రత్యర్థులను మరింతగా ఇబ్బంది పెడుతున్నానని పవన్ భ్రమపడవచ్చు గాక. కానీ వాస్తవంలో ఆయన పరువే పలుచన అవుతుంటుంది. అతివాగుడు వాగే కొద్దీ.. ఆయన విశ్వసనీయత తగ్గిపోతూ వస్తుంది. ఓట్లు వేసేవాళ్లు ఎటూ లేరు. క్రమంగా విజిల్స్ వేసేవారు కూడా తగ్గిపోతారు.

..ఎల్. విజయలక్ష్మి