విశాఖ మెగా సిటీ అని అందరికీ తెలుసు. ఆసియాలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం అని కూడా చాలా మందికి తెలుసు. సిటీ ఆఫ్ డెస్టినీగా పేరు గడించిన విశాఖ ఉన్నది సముద్ర తీర ప్రాంతంలో. విశాఖ ప్రపంచ పటంలో కీలకమైన నగరం.
అందుకే భద్రతాపరంగా ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తారు. ప్రస్తుతం భారత్ పాకిస్తాన్ ల మధ్య భీకరంగా సాగుతున్న పోరు పెను యుద్ధానికి దారి తీస్తున్న నేపధ్యంలో దేశంలోని ముఖ్య ప్రాంతాలను నగరాలను పోలీసులు భద్రతాదళాలు కలసి జల్లెడ పడుతున్నాయి.
విశాఖను కూడా పోలీసులు అదే విధంగా జల్లెడ పడుతున్నారు. రైల్వే స్టేషన్లు, ఆర్టీసీ కాంప్లెస్ వద్ద సోదాలు నిర్వహిస్తున్నారు. విశాఖలో అణువణూ గాలిస్తున్నారు. నగర పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు విశాఖలో ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.
అనుమానితులను గుర్తించి వారి కదలికల పైన నిఘా పెడుతున్నారు. విశాఖలో ప్రతీ కూడలి వద్ద పోలీసుల పహరా పెరిగింది. ముఖ్యంగా ప్రయాణీకులలో ఎవరి మీద అయినా అనుమానం వస్తే వారి బ్యాగులను చెక్ చేస్తున్నారు. ఎక్కడికి ప్రయాణం అవుతున్నారో తెలుసుకుంటూ ఒక కంట కనిపెడుతున్నారు.
విశాఖలో ఒక రకంగా హై అలర్ట్ ప్రకటించినట్లే అంటున్నారు. 1971లో విశాఖ టార్గెట్ గా పాకిస్థాన్ జలంతర్గామి తో దాడి చేసింది. దాంతో గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని సున్నితమైన ప్రదేశాలలో నిఘా పెంచడమే కాదు కంటికి రెప్పగా నగరాన్ని కాపు కాస్తున్నారు. దేశ సరిహద్దు ప్రాంతాల వద్ద టెన్షన్ వాతావరణం ఉండడంతో విశాఖలోని దేవాలయాల వద్ద కూడా నిఘా పెంచారు
దీంతో నగర వాసులు కూడా కొంత టెన్షన్ పడుతున్నారు. యుద్ధం ప్రభావంతో విశాఖలో ఏమి జరగబోతోంది అన్న ఆందోళనతో ఉన్నారు. అయితే పోలీసులు అప్రమత్తత కోసమే ఈ తనిఖీలు అని చెబుతున్నారు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు.