కూటమి ప్రభుత్వం గతం అనే మత్తులో జోగుతోంది. తాము అధికారంలో ఉన్నామనే విషయాన్ని మరిచిపోయినట్టుంది. తప్పు జరిగితే, గత ప్రభుత్వానిది, ఒప్పైతే తమ గొప్ప అన్నట్టుగా సర్కార్ పెద్దల మాట తీరు వుంది. తమ మాటలు విని జనం నవ్వుకుంటారనే కనీస స్పృహ కూడా లేదనే విమర్శ వెల్లువెత్తుతోంది.
విశాఖ సెంట్రల్ జైలు కొంతకాలంగా వివాదానికి కేంద్ర బిందువైంది. ఆ జైలు సిబ్బంది తమతో వెట్టి చాకిరీ చేయిస్తున్నారని రోడ్డెక్కిన పరిస్థితి. అలాగే విశాఖ జైలు ఉద్యోగుల కుటుంబ సభ్యులు కూడా ఆందోళన బాట పట్టడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇక ఆ జైల్లోని నిందితులు, దోషులు యథేచ్ఛగా సెల్‌ఫోన్లు, గంజాయి వాడకం గురించి ఎన్నో కథలు తెరపైకి వచ్చాయి.
ఈ నేపథ్యంలో అదే ప్రాంతం నుంచి హోంశాఖ మంత్రిగా ప్రాతినిథ్యం వహిస్తున్న వంగలపూడి అనిత ఎట్టకేలకు ఆదివారం విశాఖ జైలును సందర్శించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వ తప్పిదాల వల్లే విశాఖ సెంట్రల్ జైల్లో గంజాయి సరఫరా లాంటి మత్తు పదార్థాలను వాడే పరిస్థితి ఏర్పడిందన్నారు. జైల్లో సెల్‌ఫోన్లు బయటపడ్డాయన్నారు. విచారించి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
జైల్లో గంజాయి మొక్క కనిపించిందన్నారు. గత ఐదేళ్లలో సెంట్రల్ జైలను విజిట్ చేసిన దాఖలాలు లేవని అనిత విమర్శించారు. విశాఖ సెంట్రల్ జైల్లో గంజాయి, సెల్‌ఫోన్లను వాడకుండా చేయడానికి తమ ప్రభుత్వానికి ఏడు నెలల సమయం సరిపోదా? అని అనిత తనను తాను ప్రశ్నించుకోవాల్సిన అవసరం వుంది. గత ప్రభుత్వంపై నిందలేస్తూ, ప్రస్తుతం జరుగుతున్న తప్పుల నుంచి తప్పించుకోవాలనే ప్రయత్నం తప్ప, హోంమంత్రి మాటల్లో నిజాయితీ కనిపించడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Sare 1 year nunchi manestaaru le. Manajaganana 5 years edchaadu