ఆయన చిరకాల కోరిక తీరేనా?

ఉత్తరాంధ్రలో బలమైన గవర సామాజిక వర్గం నుంచి మంత్రి పదవిని పొంది పదిహేనేళ్ల పై మాట అవుతోంది.

విశాఖ జిల్లాలో పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా టీడీపీ సీనియర్ నేత గణబాబు ఉన్నారు. ఆయన అంతకు ముందు 1999లో పెందుర్తి నుంచి ఒకసారి గెలిచారు. 2024 గెలుపుతో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చరిత్రను సొంతం చేసుకున్నారు. పాతికేళ్ళకు పైగా రాజకీయ అనుభవం, బలమైన సామాజిక వర్గం దన్ను పైపెచ్చు రాజకీయ కుటుంబం ఇవన్నీ ఆయనకు ప్లస్ గానే ఉన్నాయి.

అయినా సరే మంత్రి పదవి అందని పండుగా మారి ఊరిస్తూనే ఉంది. గణబాబుకు 2014 నుంచి 2019 మధ్య సాగిన టీడీపీ ప్రభుత్వంలోనే మంత్రి పదవి ఖాయం అనుకున్నారు. పైగా ఆయన స్వతహాగా క్రీడాకారుడు కాబట్టి ఆయనకు ఎంతో ఇష్టమైన క్రీడల మంత్రిత్వ శాఖ ఇస్తారని కూడా అప్పట్లో ప్రచారం సాగింది. విస్తరణ జరిగినా అయిదేళ్ళ మంత్రిగా గంటా శ్రీనివాసరావునే విశాఖ అర్బన్ లో ఉంచేశారు కానీ గణబాబుకు చాన్స్ దక్కలేదు.

జగన్ ప్రభంజనంలో 2019లో గణబాబు గెలిచినా ఉపయోగం లేకుండా పోయింది. టీడీపీ ప్రతిపక్షంలోకి వెళ్ళింది. ఇక 2024లో కచ్చితంగా ఆయన మంత్రి అవుతారు అని అంతా అనుకున్నారు. పైగా గంటాకు ఈసారి మంత్రివర్గంలో చోటు కల్పించలేదు. అసలు విశాఖ జిల్లా నుంచే ఎవరికీ మంత్రిగా అవకాశం ఇవ్వలేదు.

దాంతో మంత్రి పదవికి సంబంధించి గణబాబు ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నాయని అంటున్నారు. తాజాగా ఆయన పుట్టిన రోజు వచ్చింది. దాంతో అభిమానులు అనుచరులు ఆయనను అభినందిస్తూ రానున్న రోజులలో ఉన్నత శిఖరాలను మరిన్ని అధిరోహించాలని కోరుకున్నారు.

ఆ ఉన్నత శిఖరాలు అంటే మంత్రి పదవే అని అంటున్నారు. ఇంకా ఏపీలో కూటమి ప్రభుత్వం నాలుగేళ్ళ పాటు ఉంటుంది. ఈసారి విస్తరణలో అయినా గణబాబుకు మంత్రి పదవి కచ్చితంగా దక్కుతుందని అంతా ఆశతో ఉన్నారు. ఉత్తరాంధ్రలో బలమైన గవర సామాజిక వర్గం నుంచి మంత్రి పదవిని పొంది పదిహేనేళ్ల పై మాట అవుతోంది. ఆ లోటుని కూటమి ఈసారి అయినా తీరుస్తుంది అని ఆ సామాజిక వర్గం కూడా నమ్ముకుని ఉంది.