ఇవాళ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా వైసీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు వాణిజ్య ప్రకటనల ద్వారా తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఇందులో భాగంగా అన్నమయ్య జిల్లా రాజంపేట మాజీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి కూడా అభినందనలు తెలియజేస్తూ ప్రకటన ఇవ్వడం విశేషం.
ఈ దఫా ఎన్నికల్లో మేడా మల్లికార్జునరెడ్డికి రాజంపేట ఎమ్మెల్యే టికెట్ దక్కలేదు. మేడా స్థానంలో ఆకేపాటి అమరనాథ్‌రెడ్డికి టికెట్ ఇచ్చారు. మేడా మల్లికార్జునరెడ్డి సోదరుడు రఘురాథరెడ్డికి రాజ్యసభ పదవి ఇచ్చారు. అందుకే మల్లికార్జునరెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదని వైసీపీ వర్గాలు అప్పట్లో చెప్పాయి.
అయితే తనకు టికెట్ దక్కకపోవడంతో మేడా మల్లికార్జునరెడ్డి మనస్తాపం చెందారు. ఎన్నికల్లో వైసీపీకి అనుకూలంగా పని చేయలేదు. తన మద్దతుదారుల్ని టీడీపీలో చేర్పించారనే ప్రచారం జరిగింది. కూటమి అధికారంలోకి రావడంతో ఆయన టీడీపీలో చేరుతారనే ప్రచారం కూడా విస్తృతంగా సాగింది. అయితే రాజకీయంగా మల్లికార్జునరెడ్డి కొంతకాలంగా మౌనంగా వుంటున్నారు.
ఈ నేపథ్యంలో జగన్ పుట్టిన రోజు సందర్భంగా రాజ్యసభ సభ్యుడు రఘునాథరెడ్డి ఇచ్చిన వాణిజ్య ప్రకటనలో మల్లికార్జునరెడ్డి కూడా ప్రత్యేకంగా కనిపించడం విశేషం. దీంతో మల్లికార్జునరెడ్డి ఇంకా వైసీపీలోనే ఉన్నారా? అని అన్నమయ్య జిల్లాలో జనం గుసగుసలాడుకుంటున్నారు.
ఎంత కష్టం వచ్చింది మా అన్నయ్య పార్టీ కి పార్టీ లో ఉన్నారో లేరో కూడా తెలియడం లేదు