జనసేన పార్టీకి షాక్‌లపై షాక్. ముఖ్యంగా టికెట్ ఆశావహులు ఎక్కువగా ఉండడం, మరోవైపు సొంత పార్టీ వాళ్లకు కాకుండా, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికే సీట్లు కట్టబెట్టారు. దీంతో సహజంగానే జనసేనలో తీవ్ర అసంతృప్తి నెలకుంది. ఈ నేపథ్యంలో తాజాగా జనసేనకు మరో షాక్ తగిలింది. గత ఎన్నికల్లో జనసేన గెలిచిన రాజోలులో జనసేనలో ఒక వికెట్ పడింది.
టికెట్ ఆశించి భంగపడిన బొంతు రాజేశ్వరరావు జనసేనకు గుడ్ బై చెప్పారు. రాజోలు సీటును రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దేవ వరప్రసాద్‌కు ఇవ్వడంతో బొంతు మనస్తాపం చెందారు. దీంతో ఆయన భవిష్యత్ కార్యాచరణపై తన అనుచరులతో చర్చలు జరిపారు. పార్టీలో కష్టపడినా ఫలితం లేదని, కావున వీడడం మంచిదని బొంతుకు అనుచరులు సూచించారు. దీంతో ఆయన జనసేనను వీడారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో గురువారం ఆయన వైసీపీలో ఆయన చేరారు. గత ఎన్నికల్లో రాజోలు నుంచి గెలుపొందిన ఏకైక జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ తనకు సరైన గౌరవం దక్కలేదని ఆ పార్టీ నుంచి బయటికొచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఎలాగైనా రాజోలులో గెలుపొందాలని పవన్‌కల్యాణ్ పట్టుదలతో ఉన్నారు.
రిటైర్డ్ ఐఏఎస్ అధికారిని ఆయన బరిలో నిలిపారు. అయితే ముందు నుంచి పార్టీలో ఉన్న తమకు టికెట్ దక్కలేదని కొందరు అలకబూనారు. ఈ నేపథ్యంలో రాజోలు జనసేనలో అసంతృప్తులు నెలకున్నాయి. ఇప్పుడిప్పుడే ఒక్కొక్కరుగా బయటికెళుతుండడం గమనార్హం.