తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి టీడీపీ అభ్యర్థి బొజ్జల సుధీర్‌రెడ్డికి కూటమి నుంచి మద్దతు కొరవడింది. శ్రీకాళహస్తి సీటు బీజేపీకి ఇవ్వలేదనే ఆగ్రహంతో ఆ నియోజకవర్గ ఇన్చార్జ్ కోలా ఆనంద్ జాతీయ నేతలతో పాటు రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. మరోవైపు బొజ్జల సుధీర్‌పై జనసేన ఇన్చార్జ్ కోటా వినుత తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. ఇవాళ బొజ్జల నామినేషన్ కార్యక్రమానికి వినూత హాజరు కాకపోవడం గమనార్హం.
బొజ్జల సుధీర్‌పై వినుత తాజా ట్వీట్ కూటమిలో విభేదాలను ప్రతిబింబిస్తోంది. సుధీర్‌పై వినుత పరోక్షంగా చేసిన ఆ ట్వీట్ ఏంటంటే…
“నువ్వు ఊ అంటే శ్రీకాళహస్తిలో జనసేన పార్టీ ఖాళీ అయిపోతుందా? ఊ అను!! ఊ అను!! ఎలా ఖాళీ అవుతుందో నేను చూస్తా!! నేను, మా జన సైనికులు ఊ అంటే నువ్వు అసెంబ్లీలో అడుగు కూడా పెట్టలేవు. జనసేన పార్టీని ఖాళీ చేయించే దమ్మున్నోడు ఇంకా పుట్టలేదు. ఇంక పుట్టడు కూడా!” అని ఆమె ఘాటు ట్వీట్ చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది.
ఒకవైపు కూటమిలోని పార్టీలన్నీ విభేదాలను పక్కన పెట్టి, అభ్యర్థుల విజయానికి పని చేయాలని చంద్రబాబు, పవన్ పదేపదే పిలుపునిస్తున్న సంగతి తెలిసిందే. అయితే శ్రీకాళహస్తిలో మాత్రం… బొజ్జలకు టికెట్ ప్రకటించిన రోజు నుంచి రచ్చ మొదలైంది. బొజ్జల సుధీర్‌రెడ్డి అనుచరులు వినుత ఇంటి వద్దకెళ్లి మరీ టపాసులు కాల్చడం ద్వారా తమను రెచ్చగొట్టారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే జనసేన కార్యాలయం వద్దకెళ్లి వీరమహిళలతో పాటు పార్టీ కార్యకర్తలను బొజ్జల అనుచరులు చితక్కొట్టారు.
ఇలా ఒకదానికొకటి తోడై బొజ్జలకు జనసేన నుంచి సహాయ నిరాకరణ ఎదురవుతోంది. బీజేపీ నుంచి కూడా అంతంత మాత్రంగానే మద్దతు లభిస్తోంది. కోలా ఆనంద్ ఇప్పటికీ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. తనకు దక్కనందుకు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇలాంటి పరిస్థితిలో బొజ్జలకు బీజేపీ, జనసేన నుంచి మద్దతు లభిస్తుందని అనుకోవడం అవివేకం అవుతుంది.