నిరుపేదలు, నిమ్నవర్గాల్లో జగన్మోహన్ రెడ్డికి అపారమైన ఆదరణ ఉన్నదనే భయం ప్రత్యర్థి కూటమిని వణికిస్తోంది. ప్రధానంగా దళితుల ఓటు బ్యాంక్, సాలిడ్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ కు అనుకూలంగా ఉంటుందనేది వారి భయం. దళితుల అభ్యున్నతికి జగన్ సర్కారు చేపట్టిన పథకాలు, వాటి ఫలితంగా దళితుల జీవితాల్లో వచ్చిన గుణాత్మకమైన మార్పు చూసి పచ్చ దళాలు ఓర్చలేకపోతున్నాయి.
ఒకవైపు జగన్ తన బస్సు యాత్రలో ఎక్కడ అడుగు పెట్టినా దళితులు నీరాజనాలు పడుతుండగా.. మరొకవైపు పచ్చ మీడియా మాత్రం జగన్ ను దళిత ద్రోహిగా చిత్రీకరించేందుకు అత్యుత్సాహం చూపిస్తోంది.
ప్రత్యేకించి దళితులకు శిరోముండనం కేసులో మండపేట వైసీపీ అభ్యర్థి తోట త్రిమూర్తులకు కోర్టు శిక్ష వేసిన తర్వాత పచ్చ దళాలు మరింత రెచ్చిపోతున్నాయి. అయితే ఇక్కడ ఒక సంగతి గమనించాల్సి ఉంది. 28 ఏళ్ల తరువాత శిక్ష పడిన సమయానికి త్రిమూర్తులు వైసీపీ లో ఉండవచ్చు గాక.
కానీ మిష మీద జగన్ ను నిందించే నైతిక హక్కు ఎవరికీ లేదు. ఏ పార్టీకి కూడా లేదు. ఎందుకంటే.. ఇప్పుడు రంగంలో ఉన్న ప్రతి పార్టీ కూడా.. గతంలో తోట త్రిమూర్తులను నెత్తిన పెట్టుకున్న వారే. ఆయన తెలుగుదేశం, కాంగ్రెస్, ప్రజారాజ్యం.. అన్ని పార్టీలు తిరిగేశారు. శిరోముండనం కేసులో ఆయన ఉన్న సంగతి అప్పట్లో వారందరికీ తెలుసు కదా.. అనేది ఇప్పుడు ప్రజల సందేహం. ఇప్పుడు తాము పతివ్రతల్లగా జగన్ ను నిందించడం ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
జగన్ ను దళిత ద్రోహిగా చిత్రీకరించేందుకు.. ఈనాడు పుట్టెడు కట్టు కథలతో ఒక స్టోరీ అందించింది. కులానికి సంబంధం లేకుండా జరిగిన అనేక సంఘటనల్లో ఒక వైపున్న వారు దళితులు అయితే చాలు.. వైసీపీ దే పాపం అంటూ ఎలుగెత్తి చాటుతున్నారు. అయినా ఇలాంటి కుటీల ప్రచారాన్ని ప్రజలు నమ్ముతారా? కళ్ళ ముందు జగన్ దళితులకు ఏమైనా చేశారా లేదా కనిపిస్తూ ఉండగా.. ఈ గోబెల్స్ ప్రచారాలకు విలువ ఉంటుందా అని ప్రజలు అక్షేపిస్తున్నారు.