అసలే జనసేన కార్యకర్తలు. టీడీపీ కార్యకర్తలు, నాయకుల్ని ఓ రేంజ్లో ర్యాగింగ్ చేస్తున్నారు. దీంతో టీడీపీ శ్రేణులు అవమానంగా భావిస్తున్నాయని సమాచారం. ఈ నేపథ్యంలో పవన్‌కల్యాణ్‌కు మద్దతుగా వెళ్లిన మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నాయకుడు ఎస్వీఎస్ఎన్ వర్మను సొంత పార్టీ కార్యకర్తలు, నాయకులు రాయలేని విధంగా బండ బూతులు తిట్టారు.
ఏ మొహం పెట్టుకుని జనసేన తరపున ప్రచారం చేస్తున్నావని నిలదీశారు. దీంతో క్షేత్రస్థాయిలో తనకు వ్యతిరేక పరిస్థితులు ఉన్నాయని గ్రహించి ఆయన షాక్‌కు గురయ్యారు. పిఠాపురంలో అసలేం జరుగుతున్నదో తెలుసుకుందాం. పిఠాపురంలో టీడీపీ తరపున వర్మ బరిలో నిలవాలని గత ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి జనంలో తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో పొత్తులో భాగంగా జనసేన నుంచి పవన్‌కల్యాణ్ పోటీ చేస్తారనే ప్రచారం తెరపైకి వచ్చింది.
వర్మ బయపడ్డట్టే జరిగింది. పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్టు పవన్‌కల్యాణ్ మంగళగిరిలో తన పార్టీ కార్యాలయంలో ప్రకటించారు. దీంతో వర్మ, ఆయన అనుచరులు ఖంగుతిన్నారు. మాట మాత్రమైనా చెప్పకుండా జనసేనకు కేటాయించడంతో పిఠాపురం టీడీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. కార్యాలయంలో విధ్వంసానికి తెగబడ్డారు. వర్మ కూడా తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు.
కార్యకర్తలతో సమావేశమయ్యారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో వుంటానని వర్మ ప్రకటించి తన అభిమానుల్లో జోష్ నింపారు. పిఠాపురంలో వర్మకు బీసీలు ప్రధాన మద్దతు. మత్స్యకారులు, యాదవులు ఆయనకు మద్దతుగా ఉంటున్నారు.
ఈ నేపథ్యంలో చంద్రబాబు పిలిపించుకుని మాట్లాడి పవన్‌కు చేసేలా వర్మను ఒప్పించారు. పవన్ వెంట వర్మ నీడలా ఉంటున్నారు. ఇంత వరకూ బాగానే వుంది. ఇప్పుడు అసలు కథ మొదలైంది.
పవన్ తరపున వర్మ ప్రచారానికి బయల్దేరారు. గ్రామీణ ప్రాంతాల్లో జనసేన, టీడీపీ మధ్య స్పష్టమైన చీలికను వర్మ గుర్తించారు. పవన్‌కు రాజకీయంగా మద్దతు ఇచ్చేవాళ్లలో ఎక్కువ మంది పిల్ల బ్యాచ్. వారికి రాజకీయాలపై అవగాహన లేదు. ఎన్నికల సమయంలో అందర్నీ కలుపుకుని వెళ్లాలని స్పృహ కొరవడింది. దీంతో వర్మను కాదని తమ నాయకుడు టికెట్ దక్కించుకోవడం టీడీపీపై జనసేన విజయంగా పిల్ల బ్యాచ్ వ్యవహరిస్తోంది.
వర్మకు అంత సీన్ లేదని, ఇక పవన్‌కల్యాణే శాశ్వతంగా పిఠాపురంలో ఎమ్మెల్యేగా వుంటారంటూ టీడీపీ శ్రేణుల్ని జనసేన పిల్ల బ్యాచ్ ర్యాగింగ్ చేస్తోంది. స్వతంత్ర అభ్యర్థిగా అయినా నిలబడుతానని గొప్పలు చెప్పి, ఇప్పుడు జనసేన శ్రేణుల వద్ద తలదించుకునేలా చేశావని వర్మపై తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. దీంతో ఎట్టి పరిస్థితుల్లోనూ జనసేనకు ఓట్లు వేసేది లేదని, మీరు కూడా ఆ పార్టీ తరపున ప్రచారం చేయవద్దని వర్మకు టీడీపీ శ్రేణులు గ్రామీణ ప్రాంతాల్లో స్పష్టం చేయడం చర్చనీయాంశమైంది.
ఇప్పటికైనా మించిపోయింది లేదని , పవన్‌ను గెలిపిస్తే తనకు తానుగా రాజకీయ సమాధి కట్టుకున్నట్టు అవుతుందని వర్మపై అనుచరులు ఆగ్రహిస్తున్నారు. ప్రజల్లో సానుకూలత లేకుంటే, తాను ప్రచారం చేసినా ఎంత వరకు రాజకీయ ప్రయోజనం వుంటుందనే అంతర్మథనం వర్మలో మొదలైంది. ఈ నేపథ్యంలో పిఠాపురంలో వర్మ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదనే చర్చకు తెరలేచింది.