ఉమ్మడి కడప జిల్లా రాజంపేట అసెంబ్లీ వైసీపీ అభ్యర్థి ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి జీరో పాలిటిక్స్ చేయాలని అనుకుంటున్నారు. అలాగని ఆయనేమి ఆదర్శంతో రాజకీయాలు చేయాలని అనుకోవడం లేదు. పిసినారితనం అని రాజంపేట అసెంబ్లీ పరిధిలోని వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి రాజంపేటలో ప్రస్తుతం వైసీపీ వ్యతిరేకత నుంచి అనుకూలం వైపు పయనిస్తోంది.
ఇందుకు టీడీపీలో అంతర్గత విభేదాలే కారణం. వాటి గురించి తర్వాత మాట్లాడుకుందాం. వైసీపీ విషయానికి వస్తే కడప జిల్లా పరిషత్ చైర్మన్ ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డిని అభ్యర్థిగా సీఎం జగన్ ప్రకటించారు. సిటింగ్ ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జునరెడ్డిని పక్కన పెట్టి మరీ ఆకేపాటిపై జగన్ అభిమానం చాటుకున్నారు. ఇంత వరకూ బాగుంది.
మేడా మల్లిఖార్జున్‌రెడ్డి సోదరుడు రఘును రాజ్యసభకు పంపారు. అయితే ఎమ్మెల్యే మాత్రం ఆకేపాటికి ఆశించిన స్థాయిలో ప్రచారం చేయడం లేదు. ఇటీవల రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి ఎమ్మెల్యే మేడా దగ్గరికి వెళ్లినట్టు తెలిసింది. ఆకేపాటితో పాటు తనకు మద్దతుగా తిరగాలని కోరినట్టు సమాచారం. “నాదేముంది” అని మిథున్‌రెడ్డితో ఎమ్మెల్యే మేడా అన్నట్టు తెలిసింది. మేడా మద్దతు పెద్దగా లేకపోవడం, మరోవైపు ఆకేపాటి జేబులో నుంచి డబ్బు తీయకపోవడంతో వైసీపీ శ్రేణులు మనకెందుకులే అని నిరాశలో ఉన్నాయి.
ఆకేపాటి ఇదే రకంగా పిసినారిగా వుంటే, సొంత పార్టీ శ్రేణులు కూడా వైసీపీకి చేసే పరిస్థితి లేదని స్థానిక నాయకులు అంటున్నారు. చివరికి పార్టీ నుంచి వచ్చిన డబ్బు కూడా దాచి పెట్టుకోవాలని అకేపాటి కుయుక్తులు పడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజంపేట టీడీపీలో గొడవల్ని తనకు అనుకూలంగా మలుచుకోవడంలో ఆకేపాటి విఫలమవుతున్నారనే చర్చకు తెరలేచింది.
ఇదే రకంగా ఆకేపాటి రాజకీయాలు చేస్తే మాత్రం… గెలుపునకు అనుకూలమైన రాజంపేటను చేజేతులా పోగొట్టుకోవాల్సి వస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వైసీపీ అధిష్టానం ఏ మేరకు కలుగజేసుకుని, ఆకేపాటిని దారిలో పెడుతుందో చూడాలి.