వాలంటీర్లకు బదిలీలా? వాటే ఐడియా సర్జీ!!

వాలంటీర్లు అంటేనే జగన్మోహన్ రెడ్డికి మేలు చేస్తారని, ఆయనకు అనుకూలంగా ఓట్లు వేయిస్తారని వారి గురించి దుష్ప్రచారం చేయడం విపక్షాలకు ఒక అలవాటుగా మారిపోయింది. ఇప్పటికే వాలంటీర్ల గురించి నానా రకాల పితూరీలు తమ…

వాలంటీర్లు అంటేనే జగన్మోహన్ రెడ్డికి మేలు చేస్తారని, ఆయనకు అనుకూలంగా ఓట్లు వేయిస్తారని వారి గురించి దుష్ప్రచారం చేయడం విపక్షాలకు ఒక అలవాటుగా మారిపోయింది. ఇప్పటికే వాలంటీర్ల గురించి నానా రకాల పితూరీలు తమ బినామీ మనుషులతో చేయించడం ద్వారా, ఈ రెండు నెలల పాటు వృద్ధులకు, వికలాంగులకు, వితంతు మహిళలకు పింఛను ఇంటికి వెళ్లి అందజేసే బాధ్యతల నుంచి వాలంటీలను పూర్తిగా తప్పించారు చంద్రబాబునాయుడు.

పర్యవసానంగా రాష్ట్రవ్యాప్తంగా ఒక గందరగోళం చెలరేగుతోంది. ఇలాంటి నేపథ్యంలో పచ్చ పార్టీలకు అనుకూలుడైనటువంటి మరొకపెద్ద మనిషి- వాలంటీర్ల విషయంలో ఒక సరికొత్త ప్రతిపాదనను తెరపైకి తెస్తున్నారు. ఇది హాస్యాస్పదంగానూ ప్రతిపాదన చేసిన పెద్ద మనిషిని నవ్వుల పాలు చేసే విధంగానూ ఉంటోంది.

సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ- గ్రామాలలో ఇంటింటికి తిరుగుతూ సంక్షేమ పథకాలు అందిస్తున్న వాలంటీర్లను ఇతర ప్రాంతాలకు బదిలీ చేస్తే తప్ప ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా జరగడం అసాధ్యం అని వ్యాఖ్యానిస్తున్నారు. జై భారత్ నేషనల్ పార్టీ పేరుతో ఒక సొంత రాజకీయ పార్టీని కూడా తెరిచిన జేడీ లక్ష్మీనారాయణ కు వాలంటీర్ ల వ్యవస్థ గురించి, వారి వేతనాలు గురించి పూర్తి అవగాహన ఉన్నదో లేదో తెలియదు.

వాలంటీర్లు అంటే వారు కూడా తన మాదిరిగా లక్షల్లో జీతాలు పుచ్చుకుని అలరారుతూ ఉంటారని ఆయన అనుకుంటున్నారో ఏమో తెలియదు. ఆ వచ్చే ఐదు ఆరువేల రూపాయల నెలసరి వేతనంతోనే నెల మొత్తం వారి అవసరాలు గడుపుకుంటారు అనే సంగతి జెడి గారికి తెలుసో లేదో!

ఇలాంటి అత్తెసరు జీతాలుకు గౌరవ వేతనం అనే ఒక అందమైన పేరు పెట్టుకుని ప్రభుత్వ సేవలో ఉండే వాలంటీర్లను బదిలీ చేస్తే ఆ వ్యయాలను వారు తట్టుకోగలరా? కుటుంబాలను వదిలి ఇతర వ్యాపారాలు గట్రా ఉంటే వాటిని వదులుకొని ఇతర ప్రాంతాలకు వలసపోయి రెండు నెలలు పూర్తి సమయం కేటాయించడం వారికి సాధ్యమవుతుందా? అనేది ప్రజల మదిలో మెదులుతున్న ప్రశ్న.

ఇంత చిన్న ఉద్యోగులను రెండునెలలు వేరే ప్రాంతానికి పంపితే వారి బస, తిండీ తిప్పల సంగతి ఏమిటి? పైగా జెడి లక్ష్మీనారాయణ ఉత్తరాంధ్రకు చెందిన వాలంటీలను రాయలసీమలోనూ, రాయలసీమలోని వాలంటీర్లను ఉత్తరాంధ్రలోనూ ఈ రెండు నెలలు నియమించాలని అంటున్నారు. తద్వారా వాళ్లు తప్పులు చేసే అవకాశం ఉండదని ఆయన అభిప్రాయం. కొన్ని వందల వేల కిలోమీటర్ల దూరం కి ఈ చిరు జీతానికి సేవ చేసే ఉద్యోగులను మారిస్తే వారు ఎలా బతుకుతారని జేడీ లక్ష్మీనారాయణ అనుకుంటున్నారో మనకు తెలియదు.

అయినా ఒకవేళ వాలంటీర్లు తమ మనసులో గనుక జగన్మోహన్ రెడ్డికి మేలు చేయాలి అని ఫిక్స్ అయితే ఏ ప్రాంతంలో పనిచేస్తున్నా సరే ఇంటింటికి వెళ్లి అదే మాట చెప్పకుండా ఉంటారా? అనేది కూడా ప్రజల మదిలో మెదలుతున్న సందేహం! వాలంటీర్ల కడుపుకొట్టే ఇలాంటి కుత్సితపు ఆలోచనలు కాకుండా రాష్ట్ర అభివృద్ధికి పనికివచ్చే అయిడియాలను జేడీ లక్ష్మీనారాయణ వంటి వారు పంచుకోవాలి.