జనసేనాని పవన్‌కల్యాణ్ రోజురోజుకూ జనానికి భారం అవుతున్నారు. ఎప్పుడెలా మాట్లాడ్తారో ఆయనకే తెలియడం లేదు. పవన్ ప్రసంగాల్లో స్వయం స్తుతి, పరనింద తప్ప, మరేమీ వుండదు. పిఠాపురంలో పవన్‌కల్యాణ్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన అక్కడ పర్యటిస్తున్నారు. పిఠాపురంలో పవన్ గెలుపుపై ఉత్కంఠ రేకెత్తిస్తోంది. దీంతో సానుభూతి పొందే ఎత్తుగడకు తెరలేపారు.
ఈ నేపథ్యంలో మరోసారి ప్రాణహాని అంటూ పాత పన్నాగమే అయినా, కొత్తగా చెప్పుకొచ్చారు. పిఠాపురంలో టీడీపీ, జనసేన శ్రేణులనుద్దేశించి ఆయన మాట్లాడుతూ సంచలన కామెంట్స్ చేశారు. పిఠాపురంలోని రెండున్నర లక్షల మంది ఓటర్లను కలవాలనే కోరిక వుందన్నారు. ప్రతి ఒక్కరితో ఫొటో తీయించుకోవాలని అనుకుంటున్నట్టు చెప్పారు. భద్రతా కారణాల వల్ల ఇబ్బంది వస్తోందన్నారు.
జనం ఎక్కువ మంది గుమికూడినప్పుడు కిరాయి మూకలు చొరబడి సన్నని బ్లేడ్లు తీసుకొచ్చి తనను, తన సిబ్బందిని కోసి గాయపరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యర్థి పార్టీ పన్నాగాలు తెలుసు కదా అంటూ కొసమెరుపు కామెంట్స్. గతేడాది జూన్‌లో కాకినాడ జిల్లాలో జరిగిన వారాహి యాత్రలో కూడా తనకు ప్రాణహాని ఎదురైందని పవన్ సంచలన కామెంట్స్ చేయడం గమనార్హం.
తనకు ప్రాణహాని వుందని పవన్ కామెంట్స్ చేయడం ఇదే మొదటిసారి కాదు. 2019 ఎన్నికల ముందు కూడా ఇదే రీతిలో లోకేశ్ తనకు ప్రాణహాని తలపెట్టారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఇవన్నీ సానుభూతి పొందే సినిమా డైలాగ్స్ మినహాయించి, వాస్తవాలు లేవని సామాన్య జనం సైతం అనుకుంటున్నారు. పిఠాపురంలో తమ అభ్యర్థి వంగా గీతను ఎదుర్కోలేక, ఇలా ప్రాణహాని తలపెట్టారంటూ నాటకాలు ఆడుతున్నారని అధికార పక్షం నేతలు మండిపడుతున్నారు.
వంగా గీత అంటే ఎంతగా భయపడుతున్నారో, బ్లేడ్‌తో కోస్తున్నారనే మాటలే నిదర్శనం అంటున్నారు. ఎన్నికల్లో దమ్ముంటే గీతను నేరుగా ఎదుర్కోవాలే తప్ప, ఛీ ఇదేంటని పవన్ కామెంట్స్‌ను జనం అసహ్యించుకుంటున్నారు. బ్లేడ్‌తో తనను కోయడం సంగతేమో గానీ, పవన్ మాత్రం కోతలు కోస్తున్నారనే సెటైర్స్ వెల్లువెత్తుతున్నాయి.