మాండ్ర శివానందరెడ్డి.. గత ఎన్నికల్లో నంద్యాల ఎంపీగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి. వృత్తిరీత్యా పోలీసాఫీసర్ గా పని చేసిన అనుభవం ఉన్న శివానందరెడ్డిని చంద్రబాబు నాయుడు ఏరికోరి నంద్యాల ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దించారు. ఈయనకు గౌరు కుటుంబంతో దగ్గరి బంధుత్వం ఉంది. మాండ్రను నమ్ముకుని గౌరు దంపతులు కూడా అప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున టికెట్ దక్కదనే లెక్కలేవో వేసి.. శివానందరెడ్డికి చంద్రబాబు నాయుడు ఎంపీ టికెట్ ను ఖరారు చేయడంతో.. గౌరు కుటుంబం మరో ఆలోచన లేకుండా తెలుగుదేశం పార్టీలో చేరిపోయింది!
అయితే నంద్యాల్లో మాండ్ర చిత్తు చిత్తుగా ఓడిపోయారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోచా బ్రహ్మానందరెడ్డికి ఏకంగా రెండున్నర లక్షల ఓట్ల మెజారిటీ దక్కింది గత ఎన్నికల్లో. ప్రస్తుత ఎన్నికల విషయంలో పోచా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. వివాదరహితుడు, సామాన్యులకు కూడా అందుబాటులో ఉండే పోచా విజయం సునాయాసం నంద్యాల నేపథ్యాన్ని బట్టి. ఆ సంగతలా ఉంటే.. తెలుగుదేశం పార్టీ నేత మాండ్ర తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు.
హైదరాబాద్ లో ప్రభుత్వ స్థలాలను అక్రమంగా రిజిస్ట్రేషన్లను చేశారనే కేసులో తెలంగాణ పోలీసులు ఈయన కోసం వెళ్లగా.. ఆయన పోలీసులకు చిక్కకుండా పరారీ అయ్యారనే వార్తలు వస్తున్నాయి. సీసీఎస్ పోలీసుల రాకను తెలసుకుని మాండ్ర పరారీలో ఉన్నారట! అయితే తను పరారీలో లేనట్టుగా.. తనకు నోటీసులు ఇవ్వకుండా పోలీసులు తన ఇంటిపైకి వచ్చినట్టుగా ఆయన ఒక వీడియో వదిలారు. విశేషం ఏమిటంటే.. మాండ్ర పరారీ నేపథ్యంలో.. ఆయన భార్య, కొడుకును తెలంగాణ పోలీసులు అరెస్టు చేయడం!
మరి భార్య, కొడుకును పోలీసులకు వదిలి మాండ్ర పరారీలో ఉండటం ఏమిటో! గత ఎన్నికలప్పుడే మాండ్ర విషయంలో ఇలాంటి వివాదాలు రేగాయి. అయితే తమకు కావాల్సింది ఇలాంటి వారే అన్నట్టుగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాండ్రకు ఎంపీ టికెట్ ను ఖరారు చేసి చేతులు కాల్చుకున్నారు. ఈ సారి మాండ్రకు టికెట్ ఇవ్వనప్పటికీ.. మాండ్ర తెలుగుదేశం నేతగానే చలామణిలో ఉన్నారు.