ప్రతి హీరోకు కొంతమంది సన్నిహితులుంటారు. సినిమా రిలీజైన వెంటనే వాళ్లు అసలైన రివ్యూ ఇస్తారు. సదరు హీరో దగ్గర భయభక్తులతో ఉండాల్సిన అవసరం వీళ్లకు లేదు. అందుకే నిర్మోహమాటంగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు. మరి విజయ్ దేవరకొండకు అలాంటి క్రిటిక్ ఎవరైనా ఉన్నారా..?
విజయ్ దేవరకొండకు తొలి సమీక్షకుడు అతడి తండ్రి. కెరీర్ స్టార్టింగ్ నుంచి తన సినిమాల్ని ముందుగా తండ్రికి చూపిస్తుంటాడు విజయ్. సినిమా బాగుందా లేదా అనేది తండ్రి చెబితే తనకు తెలిసిపోతుందని అన్నాడు.
పెళ్లిచూపులు సినిమాను ఎడిట్ సూట్ లో చూసిన విజయ్ తండ్రి బాగుందని మెచ్చుకున్నాడట. ఆ తర్వాత గీతగోవిందం సినిమా కూడా చూసి చాలా బాగుందన్నాడట. సినిమా బాగా లేకపోతే నాన్న ఏమీ మాట్లాడడని, గుంభనంగా కూర్చుంటాడని తెలిపాడు దేవరకొండ.
ఒకవేళ సినిమా బాగుంటే మాత్రం దాని గురించి అదే పనిగా మాట్లాడుతూనే ఉంటారట. ఫ్యామిలీ స్టార్ విషయంలో అది మరోసారి జరిగిందంటున్నాడు విజయ్. అతడి తండ్రి 2 రోజుల కిందట ఫ్యామిలీ స్టార్ సినిమా చూశాడట. సినిమా చాలా బాగా నచ్చిందట.
ఇంటికొచ్చిన తర్వాత సినిమాలో కామెడీ సన్నివేశాల గురించి ఒక్కొక్కటిగా చెబుతూ నవ్వుతూనే ఉన్నాడట. అలా తండ్రి ఇచ్చిన ఫీడ్ బ్యాక్ తో సినిమా హిట్టతుందని తనకు అప్పుడే తెలిసిపోయిందంటున్నాడు విజయ్ దేవరకొండ.