ఒకవైపు తాము వారసత్వ రాజకీయాలకు విరుద్ధం అంటూ.. కమలం పార్టీ చెబుతూ ఉంటుంది! కేవలం చెప్పడమే కాదు.. స్వయానా ప్రధానమంత్రి నరేంద్రమోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలు వారసత్వ రాజకీయాలు అంటూ ప్రత్యర్థులపై విరుచుకుపడుతూ ఉంటారు! కుటుంబ పార్టీలు అంటూ కాంగ్రెస్ తో సహా అనేక ప్రాంతీయ పార్టీలను వారు విమర్శిస్తూ ఉంటారు! మరి వారి నుంచినే అలాంటి విమర్శలు వస్తూ ఉండటంతో.. భక్తులు చెలరేగిపోతూ ఉంటారు! బీజేపీ శుద్ధ పూస అనుకుని వారు నమ్మేస్తూ.. కుటుంబ పార్టీలు, వారసత్వ రాజకీయాలు అంటూ వీరు తెగ ఇదైపోతూ ఉంటారు వాట్సాప్ వర్సీటీలో!
అయితే.. ఒక్క కర్ణాటక రాజకీయాన్ని గమనిస్తే చాలు బీజేపీ వారసత్వ రాజకీయాలు ఏ రేంజ్ లో ఉన్నాయో అర్థం అవుతాయి! కర్ణాటక లోని లోక్ సభ నియోజకవర్గాల విషయంలో పలు చోట్ల వారసులకు టికెట్లు ఖరారు కాగా, మరి కొన్ని చోట్ల వారసుల విషయంలో రచ్చలు జరుగుతున్నాయి! యడియూరప్ప తనయుడు బీవై రాఘవేంద్రకు ఎంపీ టికెట్ ను కేటాయించారు. షిమొగ్గ నుంచి ఆయన బరిలో ఉన్నారు! విశేషం ఏమిటంటే.. యడియూరప్ప మరో తనయుడు విజయేంద్ర కర్ణాటక బీజేపీ చీఫ్ గా ఉన్నారు! ఆయన ఎమ్మెల్యే కూడా!
యడియూరప్ప ను బీజేపీ అధిష్టానం ఎంత వదిలించుకునే ప్రయత్నం చేసినా.. అంత సీన్ ఏమీ కనిపించడం లేదు. ఒక తనయుడికి ఎమ్మెల్యే టికెట్ తో పాటు, కర్ణాటక బీజేపీ చీఫ్ పదవి! ఆపై మరో తనయుడికి ఎంపీ టికెట్ ను సంపాదించుకోగలిగారంటే బీజేపీపై యడియూరప్ప కుటుంబం పట్టు ఎంత ఉందో అర్థం అవుతోంది! మరోవైపు యడియూరప్ప సన్నిహితురాలు శోభకు కూడా బెంగళూరులోని ఒక లోక్ సభ నియోజకవర్గం టికెట్ దక్కింది!
అయితే ఈ జాబితా ఇంతటితో అయిపోదు! మరోవైపు మొన్నటి వరకూ కుటుంబ పార్టీ అంటూ తిట్టిపోసిన జేడీఎస్ తో కమలం పార్టీ పొత్తు పెట్టుకుంది! జేడీఎస్ ను బీజేపీ వాళ్లు అనని మాట లేదు! కుటుంబ పార్టీ అని, అవినీతి పార్టీ అని, నమ్మకద్రోహి అని, ఎంఐఎం దోస్తీ అని.. ఏదేదో అన్నారు! అయితే ఇప్పుడు బీజేపీ మద్దతుతో జేడీఎస్ తరఫున రెండు సీట్లలో దేవేగౌడ కుటుంబీకులే బరిలో ఉన్నారు! వారే గాక.. బీజేపీ టికెట్ మీద కుమారస్వామి అల్లుడు బరిలోకి దిగుతున్నాడు. బెంగళూరులోని ఒక నియోజకవర్గం నుంచి కుమారస్వామి అల్లుడు బీజేపీ గుర్తు మీద పోటీలో ఉన్నాడు. పొత్తులో భాగంగా జేడీఎస్ ఈ సీటును కోరినా.. బీజేపీ గుర్తుమీద పోటీ చేయాలనే షరతుతో ఇలా దేవేగౌడ కుటుంబీకుడు ఎంపీగా పోటీ చేస్తున్నారు!
అటు యడియూరప్ప కుటుంబం, ఇటు దేవేగౌడ కుటుంబం ఇలా బీజేపీ -జేడీఎస్ పొత్తుతో చాలా సీట్లు ఆక్రమించేశారు. అభ్యర్థుల్లో ఇంకా పలువురు రాజకీయ వారసులు, బీజేపీ నేతల కుటుంబాల వాళ్లున్నారు! ఇంకా మరికొందరు వారసుల విషయంలో రచ్చలు జరుగుతున్నాయి. బీజేపీ సీనియర్ నేత ఈశ్వరప్ప తన వారసుడికి టికెట్ ఇవ్వడం లేదని వాపోతున్నారు. తన తనయుడికి ఎంపీ టికెట్ ఇవ్వలేదని, ఇదంతా యడియూరప్ప కుట్ర అని .. ఆయన అంటున్నారు! దీనికి ప్రతిగా తను యడియూరప్ప కొడుకు పోటీ చేస్తున్న నియోజకవర్గంలో పోటీ చేసి ఆయనను ఓడిస్తానంటూ ఈశ్వరప్ప ప్రతినబూనారు. ఈ నేపథ్యంలో అమిత్ షా నుంచి ఫోన్ వచ్చిందట! నీ తనయుడి భవిష్యత్తుకు నాదీ పూచీ అంటూ షా తనకు హామీ ఇచ్చినట్టుగా ఈశ్వరప్ప చెప్పుకుంటున్నారు!
చిక్ బళాపురలో తన తనయుడికి ఎంపీ టికెట్ ఇవ్వలేదంటూ యలహంక ఎమ్మెల్యే విశ్వనాథ అలిగారట! ఇంకా కుర్రాడే అయిన తన తనయుడిని ఎంపీగా చూసుకోవాలని ఆ బీజేపీ సీనియర్ నేత భావిస్తున్నట్టుగా ఉన్నారు. తన తనయుడు అలోక్ కు కాకుండా మాజీ మంత్రి సుధాకర్ కు చిక్ బళాపూర్ ఎంపీ టికెట్ ఇవ్వడాన్ని ఆయన నిరసిస్తున్నాడు! ఇలా కర్ణాటకలో వారసత్వ రాజకీయాల హోరు గట్టిగా సాగుతోంది! అయితే ఇంత జరుగుతున్నా.. బీజేపీ నేతలు, భక్తులు మాత్రం.. కుటుంబ రాజకీయాలు, వారసత్వ రాజకీయాలను అనర్గళంగా విమర్శిస్తూ ఉంటారు!