బాలినేని బేరం: కానుక ఇస్తా.. నాకేంటి?

ఏదేమైనప్పటికీ.. బాలినేని ఎమ్మెల్సీ పదవిని ముందే మాట్లాడుకుని పార్టీలోకి వెళ్లినట్టుగా ప్రచారం జరిగింది

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గానీ, జగన్మోహన్ రెడ్డి గానీ.. తనను ఎంత ఆదరంతో చూసుకున్నప్పటికీ కూడా.. లేని బలాన్ని అతిగా ఊహించుకుని.. పార్టీని వీడి ఫిరాయించిన నాయకుల్లో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఒకరు. ఎలాంటి పదవులు ఆశించి నేను జనసేనలోకి రాలేదు అని ఆయన గతంలో పలుమార్లు చెప్పారు.

అయితే ‘ప్రయోజనం ఆశించకుండా ఎవ్వరూ ఏ పనీ చేయరు’ అనేది ఆర్యోక్తి. బాలినేని కూడా ఒక నిర్దిష్టమైన ప్రయోజనాన్ని ఆశించి దానికి సంబంధించి బేరం మాట్లాడుకుని మాత్రమే వైఎస్సార్ కాంగ్రెసును వీడి జనసేనలోకి వెళ్లారు.

అయితే నెలలు గడుస్తున్నాయి గానీ.. ఆయన ఆశించినది మాత్రం నెరవేరడం లేదు. పార్టీకి తాను ఇప్పటిదాకా ఏ రకంగానూ ప్రత్యేకంగా ఉపయోగపడకుండా.. తన కోరికలను వ్యక్తం చేయడానికి కూడా ఆయనకు ఇబ్బందిగానే ఉంది. అందుకే తాజాగా ఒక బేరంతో సిద్ధమైనట్టుగా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కూటమి ప్రభుత్వానికి ఒక కానుక ఇస్తా.. అందుకు బదులుగా నాకేం ఇస్తారు..అని ఆయన బేరం పెడుతున్నారు!

వివరాల్లోకి వెళితే.. బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీని వీడి జనసేనలో చేరడం అనేది అంత గొప్ప మర్యాదకరంగా ఏమీ జరగలేదు. నిజానికి బాలినేని.. తాను మహా గొప్ప నాయకుడిని అని నిరూపించుకోడానికి ఒంగోలు నుంచి వందల వాహనాల కాన్వాయ్ తో మంగళగిరికి వెళ్లి.. అక్కడ జనసేనాని పవన్ కల్యాణ్ సమక్షంలో పార్టీలో చేరాలని అనుకున్నారు. అందుకు అంతా రంగం సిద్ధం చేసుకున్నారు.

ఒకవైపు ఒంగోలులో గెలిచిన తెలుగుదేశం ఎమ్మెల్యే దామచర్ల, ఆయన జనసేనలో చేరడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ.. తన బలనిరూపణ చేయాలని అనుకున్నారు. అయితే అటు పవన్ కల్యాణ్ వైపు నుంచే ఆయన ఉత్సాహానికి బ్రేకులు పడ్డాయి. ఆయనను ఒంటరిగా వచ్చి పార్టీలో చేరమని హుకుం వచ్చింది. పైగా, ఇతరులతో కలిపి ఆయనను కూడా పార్టీలో చేర్చుకున్నారు. ఒక మాజీ మంత్రి సాదాసీదా నేతలా చేరాల్సి వచ్చింది.

ఏదేమైనప్పటికీ.. బాలినేని ఎమ్మెల్సీ పదవిని ముందే మాట్లాడుకుని పార్టీలోకి వెళ్లినట్టుగా ప్రచారం జరిగింది. కానీ పవన్ కల్యాణ్ ఇప్పటిదాకా ఆ కోరిక తీర్చడం గురించి ఏమాత్రం పట్టించుకోలేదు.

తాజాగా బాలినేని ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఒంగోలు మునిసిపాలిటీని కూటమి పార్టీల పరం చేయడానికి చక్రం తిప్పుతున్నారు. గతంలో ఎన్నికలు జరిగినప్పుడు ఒంగోలు మునిసిపాలిటీలో నూటికి నూరుశాతం వైసీపీ పరం అయింది. అయితే.. అప్పట్లో బాలినేని ఎమ్మెల్యే గా ఉన్నారు. ఆయన ప్రాపకం ఉన్నవారే మునిసిపల్ ఎన్నికల్లో గెలిచారు. వారిని ఇప్పుడు కూటమి పార్టీల్లోకి ఫిరాయింపజేయడానికి ఆయన ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.

మెజారిటీ కూటమి పార్టీల్లోకి ఫిరాయిస్తే.. మునిసిపాలిటీ కూటమి పరం అవుతుంది. ఆ స్థానాన్ని కూటమికి కానుకగా ఇస్తే.. అప్పుడైనా సరే.. తనను ఎమ్మెల్సీగా కన్సిడర్ చేస్తారేమో అని బాలినేని ఆశపడుతున్నారు. తర్వాతి సంగతి ఏమో గానీ.. ప్రస్తుతం వైసీపీలో ఉన్న ఒంగోలు నాయకులు బాలినేని మాటలకు లొంగుతారా? అనేదే పెద్ద ప్రశ్నార్థకంగా ఉంది.

7 Replies to “బాలినేని బేరం: కానుక ఇస్తా.. నాకేంటి?”

  1. vaarthani వార్త లాగా రాయాలి, నువ్వు నీ leading statements (ఎంత బాగా చూసుకున్నా పార్టీ నుండి వెళ్ళిపోయాడు)తో పాటు, కొంచం మసాలా, కొంచం కచ్చి, మరి కొంచం అబద్ధాలు , కొంత కుట్రతో వార్తని రాసే నువ్వు అసలు ఏ టైప్ జర్నలిస్ట్ ??

Comments are closed.