గాదే మావాడే అన్న టీడీపీ… షాక్ ఇచ్చిన కొత్త ఎమ్మెల్సీ!

“టీడీపీ మాకు మద్దతు ఇచ్చిందా? అబ్బే, తెలియదే!” అంటూ షాక్ ఇచ్చారు.

రాజకీయాల్లో మ్యాజిక్ అంటే ఇదే. గెలిచిన వారిని “మావారే” అంటారు, ఓడిన వారిని పట్టించుకోరు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ఈసారి సార్వత్రిక ఎన్నికలను తలపించాయి. హోరాహోరీగా సాగాయి. సాధారణంగా ఈ ఎన్నికల్లో ఓటింగ్‌కి టీచర్లు అంతగా ఆసక్తి చూపించరు.

కానీ ఈసారి 22 వేల పైచిలుకు ఓట్లలో 19 వేల పైగా పోలయ్యాయంటే, ఉపాధ్యాయులు ఈ ఎన్నికలపై ఎంతగా దృష్టి పెట్టారన్నది అర్థమవుతోంది. పైగా పోటాపోటీగా ఎన్నికల సమరం సాగినా, ఉపాధ్యాయులు తాము కోరుకున్న అభ్యర్థినే గెలిపించుకున్నారు.

అకా గాదె శ్రీనివాసులు నాయుడు గెలిచారు. ఆయన ప్రత్యర్థిగా ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మకు టీడీపీ-జనసేన మద్దతు ప్రకటించాయి. తెలుగు తమ్ముళ్లు, ఆ పార్టీ సీనియర్లు, కీలక నేతలు, ఎమ్మెల్యేలుఅంతా కలిసి రఘువర్మ గెలుపుకోసం బహిరంగంగా కృషి చేశారు. ఒక విధంగా రఘువర్మ టీడీపీ అభ్యర్థి అన్నట్లుగానే హడావుడి చేశారు.

కానీ ఫలితం చివరికి తేడా కొట్టింది. అయితే దీనిపై మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, “మా పార్టీ రఘువర్మకు మద్దతు ఇచ్చింది, అలాగే గాదె శ్రీనివాసులు నాయుడుకూ మద్దతు ప్రకటించింది” అంటూ కొత్త విషయం చెప్పి విస్మయపరిచారు. “మొదటి ప్రాధాన్యత ఓటు రఘువర్మకు, ద్వితీయ ప్రాధాన్యత ఓటు గాదెకి వేయమని పార్టీ పెద్దలు చెప్పారు” అని అచ్చెన్న వ్యాఖ్యానించారు.

అయితే ఇది ఎవరికీ తెలియలేదు. తమ్ముళ్లు రఘువర్మనే భుజాలపై మోసారు, కానీ చివరికి రఘువర్మ ఓడి, గాదె గెలిచేసరికి—”ఏ గెలుపైనా మాదే” అంటూ టీడీపీ తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తోందా? అన్న చర్చ మొదలైంది.

అయితే అచ్చెన్న మాటలకు కొత్త ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు నాయుడు స్పందిస్తూ, “టీడీపీ మాకు మద్దతు ఇచ్చిందా? అబ్బే, తెలియదే!” అంటూ షాక్ ఇచ్చారు. “టీడీపీ మద్దతు ఇచ్చిందన్నదానిపై నాకు కనీస అవగాహన కూడా లేదు” అని కుండబద్దలు కొట్టారు. “తాను కేవలం ఉపాధ్యాయ సంఘాల మద్దతుతోనే గెలిచాను” అని ఆయన స్పష్టం చేశారు. దీంతో టీడీపీ ఈ అంశంపై ఎలా రియాక్ట్ అవుతుందో చూడాల్సి ఉంది.

3 Replies to “గాదే మావాడే అన్న టీడీపీ… షాక్ ఇచ్చిన కొత్త ఎమ్మెల్సీ!”

Comments are closed.