డీఎస్సీ.. తక్షణం ప్రకటించకుంటే పరువు తక్కువ!

కోడ్ గండం ముగిసిపోయింది గనుక.. తక్షణం డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రజలు కోరుతున్నారు.

రకరకాల కారణాలు చెప్పి కాలయాపన చేసే కాలపరిమితి ముగిసిపోయింది. ఎన్నో ప్రచార సమయంలో లక్షలాది కుటుంబాలను ఊరించేలా ఘనంగా హామీలు ఇచ్చి, గెలిచిన వెంటనే మొదటి సంతకాలలో ఒకటిగా మెగా డీఎస్సీని కూడా ప్రకటించారు. ఆ ఫైల్‌పై కూడా సంతకం పెట్టారు. ఇప్పటికి ఎనిమిది నెలలు గడచిపోయింది. డీఎస్సీ నోటిఫికేషన్ మాత్రం రాలేదు.

అన్ని రకాల చిక్కులు అధిగమించేసి, మెగా డీఎస్సీకి సంబంధించిన కసరత్తు మొత్తం పూర్తయిపోయిందని.. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న కారణంగా ప్రకటన జాప్యం అవుతోందని నారా లోకేష్ కొన్ని నెలలుగా కాలయాపన చేస్తూ వచ్చారు. ఎమ్మెల్సీ ఫలితాలు కూడా వచ్చిన తర్వాత.. ఇక అలాంటి కాలయాపన మాటలతో సరిపెట్టుకోవడం కుదరదు. నిరుద్యోగ టీచర్లలో నమ్మకాన్ని నిలబెట్టుకోవాలంటే తక్షణమే డీఎస్సీ ప్రకటించాల్సి ఉంది.

చంద్రబాబునాయుడును నాలుగోసారి ముఖ్యమంత్రిగా గెలిపించిన ప్రధాన కారణాల్లో మెగా డీఎస్సీ ప్రకటన కూడా ఒకటి. వేలాది మంది నిరుద్యోగ టీచర్ల కుటుంబాలను ఆకర్షించిన హామీ ఇది. జగన్మోహన్ రెడ్డి పాలనకాలంలో టీచర్ల నియామకాలు జరగకపోవడం కూడా ఇందుకు ఒక కారణం. అందరూ చంద్రబాబు మాటలను నమ్మి ఓటేశారు. దానికి తగినట్టుగానే ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే చేసిన మొదటి సంతకాల్లో ఇది ఒకటి అయింది. కానీ ఇప్పటిదాకా నోటిఫికేషన్ ప్రకటన కూడా రాలేదు.

ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత పాలక కూటమికి అది కలిసి వచ్చింది. కోడ్ లేకపోతే, ఈ పాటికి నోటిఫికేషన్ వచ్చేసేది. దానికి సంబంధించిన కసరత్తు మొత్తం పూర్తయిపోయింది. “ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి. ఆ పర్వం పూర్తి కాగానే, మార్చిలో వెంటనే నోటిఫికేషన్ ఇచ్చేస్తాం” అని నారా లోకేష్ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. నిజానికి ఆ రకం మాటలు కూటమికి లాభమే చేకూర్చాయి. పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిరుద్యోగ టీచర్లంతా వారికి అండగా నిలిచారు.

అలాగే, ఇప్పటికే టీచర్లుగా ఉన్నవారు లోకేష్ మాటలను పట్టించుకోలేదు. అందుకే ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం-జనసేన కలిసి మద్దతిచ్చిన అభ్యర్థి ఓడిపోయారు.

ఏది ఏమైనప్పటికీ, కోడ్ గండం ముగిసిపోయింది గనుక.. తక్షణం డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఈ విషయంలో జాప్యం చేసే కొద్దీ, ప్రభుత్వం చిత్తశుద్ధిని అనుమానించాల్సి వస్తుందని అంటున్నారు. చంద్రబాబు చెబుతున్నట్టుగా కొత్త విద్యాసంవత్సరం ప్రారంభమయ్యే సమయానికి నియామకాలు కూడా పూర్తి కావాలంటే.. డీఎస్సీ ప్రకటన తక్షణమే రావాలని కోరుకుంటున్నారు.

10 Replies to “డీఎస్సీ.. తక్షణం ప్రకటించకుంటే పరువు తక్కువ!”

  1. ఉన్న టీచర్లే పని చెయ్యకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకుంటున్నారు … మా ఊర్లో ఒక్కొక్కళ్ళు లక్షన్నర జీతం తీసుకునే టీచర్లు ఇద్దరు కలిసి ఊర్లో నిరుద్యోగి ఒకరికి 10 వేలు ఇచ్చి వాళ్ల ఇద్దరి బదులు స్కూల్ కి పంపిస్తున్నారు .. వీళ్లు కుదిరినప్పుడు వెళ్లి సంతకాలు పెట్టి వస్తారు … ఇప్పుడు ఈ డీఎస్సీ వేసి ఇటువంటి పనికిమాలిన వాళ్లని మరింతమందిని మేపడం ఎందుకు.

Comments are closed.