రాయలసీమ ప్రాంతంలో తన వెంట పవన్‌కల్యాణ్‌ను చంద్రబాబునాయుడు తిప్పుకోవడం లేదు. పవన్ వల్ల పెద్దగా ప్రయోజనం లేదని చంద్రబాబు భావిస్తున్నారని టీడీపీ నేతలు చెబుతున్నారు. తాజాగా చంద్రబాబు, పవన్‌కల్యాణ్ షెడ్యూల్ చూస్తే ఇదే అభిప్రాయం కలుగుతోంది. ఇవాళ్టి నుంచి రెండు రోజుల పాటు చంద్రబాబునాయుడు, పవన్‌కల్యాణ్ ఉమ్మడిగా ప్రచారం చేయనున్నారు. అది కూడా ఉభయగోదావరి జిల్లాల్లో ప్రచారం చేయడాన్ని గమనించొచ్చు.
పశ్చిమగోదావరి జిల్లా తణుకులో బుధవారం సాయంత్రం 4 గంటలకు, రాత్రి ఏడు గంటలకు నిడదవోలు బహిరంగ సభలో ఇద్దరు నేతలు పాల్గొననున్నారు. వీరితో పాటు ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కూడా పాల్గొంటుండడం గమనార్హం. అలాగే కోనసీమ జిల్లా అంబాజీపేటలో గురువారం పవన్‌కల్యాణ్‌తో కలిసి బాబు రోడ్ షోలో పాల్గొంటారు. రాత్రి 7 గంటలకు అమలాపురం బహిరంగ సభలో పాల్గొంటారు.
చంద్రబాబునాయుడు రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. రాయలసీమలో చంద్రబాబు ప్రచారం చేస్తుంటే, పవన్‌కల్యాణ్ మాత్రం పిఠాపురంలో కొన్ని రోజులున్నారు. అనారోగ్యమంటూ విశ్రాంతి తీసుకున్నారు. అనకాపల్లి మినహాయించి, ఆయన షెడ్యూల్ ఏదీ సక్రమంగా నడవలేదు.
ఇప్పుడు ఉభయగోదావరి జిల్లాల్లో పవన్, చంద్రబాబు ప్రచారం చేయడం ఆసక్తికరంగా మారింది. ఆ రెండు జిల్లాల్లో పవన్ సామాజిక వర్గం బలంగా వుందని, అందుకే ఆయనతో బాబు పొత్తు కుదుర్చుకున్నారు. పవన్‌కు మిగిలిన చోట్ల ప్రజాదరణ లేదని, ఆయన్ను ప్రచారానికి తీసుకెళ్లినా ప్రయోజనం లేదని బాబు నమ్ముతున్నారు. పవన్‌తో ప్రచారం… అది కూడా సాయంత్రం వేళలో షెడ్యూల్ ఇవ్వడం గమనార్హం.
ప్రస్తుతానికి రెండు రోజులతోనే పవన్ ప్రచారాన్ని బాబు సరిపెట్టారు. రానున్న రోజుల్లో కలిసి ప్రచారం చేసే అవకాశాలు ఏ మేరకు ఉంటాయో చూడాలి. అది కూడా ఉభయగోదావరి జిల్లాల్లోనే ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయి.సీమలో పవన్‌ను వెంట తిప్పుకోని బాబు!