Advertisement

Advertisement


Home > Politics - Opinion

చంద్రబాబుకి జైకొట్టే చదువుకున్న మూర్ఖులు

చంద్రబాబుకి జైకొట్టే చదువుకున్న మూర్ఖులు

చంద్రబాబు ఎన్నికల ప్రచారమేమో గానీ కాస్తంత బుర్రవాడి చూస్తున్నవాళ్లకి నవ్వొస్తోంది. అసలు ఒక ప్రణాళిక పాడూ లేకుండా ఏది తోస్తే అది చెప్పడం, ప్రత్యర్థికి మరింత బలం చేకూరేలా మాట్లాడడం, జగన్ ని కుర్చీలోంచి దింపి తాను ఎక్కాలనే ఆలోచన తప్ప ఎక్కాక కొత్తగా ఏం చేస్తాడో ఒక్క ముక్క చెప్పకపోవడం చిరాకు పెట్టిస్తోంది. 

తాజాగా తాను నొక్కివక్కాణిచ్చింది ఏంటంటే తాను పదవిలోకొస్తే వాలంటీర్లకి నెల జీతం ప్రస్తుతమున్న 5000 నుంచి 10000 కి పెంచుతాడట.

మరి ఈ వాలంటీర్లనే కదా ఆడిపోసుకున్నాడు. ఈ వ్యవస్థ వల్ల సమాజం భ్రష్టుపట్టిపోతోందని ఏడ్చాడు కదా. 30000 మంది అమ్మాయిల్ని ఈ వాలంటీర్లు కిడ్నాప్ చేయించారని, భర్త లేని వేళల్లో ఇళ్లకి వెళ్లి తలుపులు కొడుతున్నారని చెప్పాడు కదా! మరి ఇప్పుడు సడెన్ గా ఈ ధృతరాష్ట్ర ప్రేమ ఎందుకు వాలంటీర్ల మీద? ఎన్నికల వేళ వాళ్లని కూడా మభ్యపెట్టే ప్రయత్నమన్నమాట. 

అలాగే "అమ్మ ఒడి"ని యథాతథంగా కనసాగిస్తాడట. మరి అమ్మ ఒడి పేరుతో ఇస్తున్న డబ్బుని ఇంట్లో మగవాళ్లు తాగుడికి వాడేస్తున్నారని అన్నాడుగా చంద్రబాబు. ఇప్పుడా మాట అనడేం? 

జగన్ చేసేవి కాక కొత్తగా నువ్వేంచేస్తావో చెప్పవయ్యా అంటే మేలురకం మద్యాన్ని తక్కువ ధరలకి అందిస్తానని చెప్తున్నాడు. ఇదెక్కడి చోద్యమో చెప్పండి. ఏ ముఖ్యమంత్రైనా తానొస్తే మద్యాన్ని సులభంగా దొరక్కుండా చేస్తాననో, అందుబాటులో లేకుండా ధరలు పెంచుతాననో, లేక నిషేధిస్తాననో చెప్పడం చూసాం కానీ అందరికీ తక్కువ ధరకే మద్యాన్ని పోసే ఏర్పాట్లు చేస్తా అని గర్వంగా చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి అభ్యర్థి చంద్రబాబు. 

ఈ ప్రబుద్ధుడిని మీడియాలో ఒక వర్గం చాణక్యుడంటుంది. వాళ్లు చెప్పినవి విని, రాసినవి చదివి బుర్రని ఏమాత్రం వాడకుండా చంద్రబాబు ఒక జాతీయ అవసరంగా భావించే చదువుకున్న మూర్ఖులు ఉంటున్నారు సమాజంలో. 

ఈ చదువుకున్న మూర్ఖులు ముఖ్యంగా ధనికుల్లోనూ, ఎగువ మధ్యతరగతిలోనూ, కొంత మధ్యతరగతిలోనూ ఉంటున్నారు. వీళ్లకి సంక్షేమపథకాలంటే  మంట. ఎందుకో చెప్పమంటే.. అవి ప్రజల్ని సోమరుల్ని చేస్తాయని, అభివృద్ధికి వాడాల్సిన ట్యాక్స్ పేయర్స్ మనీకి ప్రభుత్వం గండి కొట్టేలా చేస్తాయని చెప్తుంటారు అత్తెసరు బుర్రతోటి. 

నిజానికి ట్యాక్స్ పేయర్స్ అంటే ధనికులు, పెద్ద ఉద్యోగస్తులే కాదు..పేదలు కూడా. మన దేశంలో డైరెక్ట్ ట్యాక్సెస్ కంటే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మీద వచ్చే ఆదాయం చాలా పెద్దది. టూత్ పేస్ట్, సబ్బు, బట్టలు.. ఇలా కొనే ప్రతి వస్తువు మీద ట్యాక్సులుంటాయని తెలుసు కదా! పేదలు కూడా అవి కొంటారు కదా! అంటే వాళ్లూ ఇండైరెక్టుగా ట్యాక్సులు కడుతున్నట్టే కదా. ఈ మాత్రం కూడా ఆలోచించకుండా ఆ కనీస గౌరవం కూడా పేదలకివ్వరు ఈ చదువుకున్న మూర్ఖులు.. అక్కడికి తామే ఈ దేశాన్ని పోషించేస్తున్నట్టు బిల్డప్పొకటి!

సంక్షేమ పథకాల వల్ల పెద్ద నష్టం ఉందని ఒక చదువుకున్న మూర్ఖుడు ఈ మధ్యన చెప్పాడు. ఏవిటా నష్టం అంటే ధరలు పెరిగిపోవడానికి ఆ పథకాలే కారణమన్నాడు. ఎందుకని అడిగితే ప్రస్తుతం వస్తున్న పథకాల తాలూకు డబ్బుతో పేదవాళ్లకి స్పెండింగ్ పవర్ పెరిగిందట. దాంతో డిమాండ్ పెరిగి నిత్యావసరాల ధరల నుంచి అన్నీ పెరుగుతున్నాయట. 

"అంటే పేదవాళ్లు ఎప్పుడూ దేనికీ నోచుకోకుండా ఉండాలా ధరలు అదుపులో ఉండాలంటే?" అని ఈ మేథావిని అడిగితే, "అలాగని ఎవరన్నారు? వాళ్లు కూడా మాలాగ కష్టపడి సంపాదించుకుని కొనుక్కోవాలి. ప్రభుత్వం ఇచ్చే డబ్బు మీద ఆధారపడడమేంటి?" అన్నాడు. 

"అయినా ఆ డబ్బులో పేదలు పే చేసిన ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కూడా ఉంటాయి కదా. వాళ్లకి అందులో వాటా ఉంటే తప్పేంటి? అయినా ఈ పథకాల డబ్బులు వాళ్లని దయనీయ స్థితిలోకి నెట్టకుండా, ఆర్ధిక ఇబ్బందులతో ఆత్మహత్యలు చెసుకోనీయకుండా ఆపుతాయే తప్ప వాళ్లని ఏ పనీ చేయకుండా కూర్చోబెట్టడంలేదు కదా?" అనడిగితే సమాధానాన్ని మరోలా తిప్పాడు...

"పథకాలు ఇవ్వచ్చు, తప్పులేదు. కానీ చంద్రబాబులా సంపద సృష్టించి పంచగలగాలి. అప్పులు చేసి కాదు" అన్నాడు. 

పది ఇంచుల మందాన పేరుకుపోయిన మూర్ఖత్వానికి ఇది పరాకాష్ట. సంపద సృష్టించడమంటే ఏంటి అంటే.. హైటెక్ సిటీ, ఫార్మా కంపెనీలు, కియా మోటర్స్ అంటూ ఏవేవో చెప్పుకొచ్చాడు. 

అమెరికాకి కూడా వినిపించేంత గట్టిగా మైకు పట్టుకుని కేసీఆర్, రేవంత్ రెడ్డి ఇద్దరూ అసలు హైటెక్ సిటీ ఘనత బాబుది కాదు నేదురుమల్లి జనార్దనరెడ్డిది అని చెప్పినా కూడా ఈ మూర్ఖులకి వినపడదు. వాళ్ల దృష్టిలో సత్యం రామలింగరాజుని పక్కన కూర్చోబెట్టుకుని బిల్ గేట్స్ ని, క్లింటన్ ని వేరు వేరు సందర్భాల్లో కలిసి చంద్రబాబు తీయించుకున్న వీడియోలే గుర్తొస్తాయి. దాని చుట్టూ అల్లిన పచ్చమీడియా కథలకి పడిపోయి అసలు ఐటీ దిగ్గజం అంటే మా బాబుగారే అనుకుంటూ మాయలో పడి ఎప్పటికీ లేవకుండా ఉండిపోయారు. అలాగే ఫార్మా కంపెనీలు కూడా బాబు గొప్పతనం కాదు- వై.ఎస్.ఆర్ ది. 

ఇక కియా మోటర్స్ విషయానికొద్దాం. ఇది చంద్రబాబు తన హయాములో తీసుకొచ్చిన సో-కాల్డ్ పెట్టుబడి. "సో-కాల్డ్" అని ఎందుకు అనాల్సొస్తోందంటే ఈ ఫ్యాక్టరీ వల్ల కొరియావాడు బాగుపడ్డాడేమో తప్ప ఆంధ్రులకి ఒరిగిందేమీ లేదు. దీనివల్ల చెప్పుకున్నంత ఉపాధి కల్పన జరగలేదు, ఈ కంపెనీ ద్వారా రాష్ట్రానికి ట్యాక్సుల రూపంలో చెప్పుకోదగ్గ ఆదాయం కూడా లేదు. ఎందుకంటే భయంకరమైన రాయితీలు ఇచ్చి పెట్టించిన కంపెనీ ఇది. దీని చుట్టూ ఇంటర్నల్ ట్రేడింగ్ చేసుకుని కొంతమంది కులనాయకులు రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుపుకున్నారేమో తప్ప రాష్ట్ర ప్రజలకి ఒరిగిన లాభమేమీ లేదు. సంపద సృష్టించడమంటే ఇదా?

ఇప్పుడు చెప్పండి.. పెట్టుబడులొచ్చేస్తే సంపద వెంటనే సృష్టించేసినట్టా? ఏ పెట్టుబడికి ఎంత లాభం రాష్ట్రానికొస్తోంది అనే లెక్కలు అడగమా? వేల ఎకరాల ప్రభుత్వ భూములు విదేశీ కంపెనీలకి కేటాయించేస్తే సామాన్యుడు అభివృద్ధి చెందుతున్నట్టా? ఆ భూముల విలువకి రాష్ట్ర ఆదాయానికి పొంతన ఉండొద్దా? 

ఒకవేళ మెడికల్ కాలేజీలు పెంచి, ఇంటింటికీ వైద్యాన్ని అందిస్తూ, ఇంటికే నిత్యావసారాలు అందిస్తూ, వృద్ధులకి ఇంటి వద్దె పించను అందిస్తూ, ప్రభుత్వ బడులు బాగు చేసి ఉచిత విద్యనందిస్తుంటే.. దానిని అభివృద్ధి అనకూడదా? ఎవడన్నా అనకపోయినా ఆ సుఖాన్ని పొందుతున్న పేదలు మాత్రం దానిని అభివృద్ధి అనే అంటారు. 

బుర్రలో ఏ మాత్రం నట్టున్నా దానిని గట్టిగా బిగించుకుని ఆలోచిస్తే ముందువెనుకలన్నీ అర్ధమవుతాయి. 

మన చుట్టూ ఉన్న ప్రజలు పేదరికంలోంచి బయటపడ్డప్పుడే సమాజంలో శాంతి ఉంటుంది. అంతే కానీ ధరలు అదుపులో ఉండాలంటే వాళ్లు తిండి లేక మాడాలని కోరుకునే చదువుకున్న మూర్ఖులున్నంత కాలం పచ్చమీడియాలు వాళ్లని మాయ చేస్తూనే ఉంటాయి. బాబుని ప్రత్యామ్నాయంగా వాళ్లకి చూపిస్తూనే ఉంటాయి. 

అందరి ప్రయోజనాలు చూసేవాడు రాజైతే, కొందరి ప్రయోజనాలు మాత్రమే కాపాడేవాడు స్వార్ధపరుడు. ఎవరేంటో వివరించి చెప్పక్కర్లేదు.

ఇదంతా చూస్తూ అసలు ప్రస్తుత కూటమికి ఎందుకు ఓటెయ్యాలో సహేతుకంగా అర్థం కాని పరిస్థితి బుర్రవాడుతున్నవాళ్లలో ఉంది. వాడని మూర్ఖులు మాత్రం ఇంకా బాబొస్తే ఏదో చేస్తాడనే భ్రమలో ఉన్నారు. వాళ్ళ సంఖ్య బాగా తగ్గిపోయింది అని కూడా వాళ్లకి తెలియట్లేదు. అంతా "పచ్చ"మాలోకాలు! 

- హరగోపాల్ సూరపనేని

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?