అరకు అసెంబ్లీ సీటులో ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురికీ టీడీపీ అధినాయకత్వం హ్యాండ్ ఇచ్చింది. 2018లో మావోల దాడిలో హతుడైన అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుకు న్యాయం చేస్తామని ఆయన కుమారుడు శ్రావణ్ కుమార్ ని ఎమ్మెల్యే కాకుండా మంత్రిగా చంద్రబాబు చేశారు. 2019 ఎన్నికల్లో అరకు అసెంబ్లీ టికెట్ ఆయనకు ఇచ్చారు. అయితే ఆయన ఓటమి పాలు అయ్యారు.
అప్పట్లో మావోల దాడిలో అరకు టీడీపీ మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ కూడా మరణించారు. ఆయన కుమారుడు అబ్రహాంకి 2024లో టికెట్ ఇస్తామని అప్పట్లో బాబు హామీ ఇచ్చారు. తీరా చూస్తే కిడారి శ్రావణ్ కుమార్ కి టికెట్ ఇవ్వలేదు. అబ్రహం కి కూడా దక్కలేదు. వైసీపీ నుంచి వచ్చిన దొన్ను దొరకు టికెట్ ని మొదటి జాబితాలో టీడీపీ ప్రకటించింది.
బీజేపీ పొత్తులలో భాగంగా అరకు సీటుని ఆ పార్టీకి కేటాయించింది. మొదట బీజేపీకి పాడేరు ఇవ్వాలనుకున్నా అక్కడ నేతల అసంతృప్తుల నేపధ్యంలో అరకు సీటుకు బదలాయించారు. బీజేపీకి అరకులో ఏ మాత్రం పట్టు లేదు ఎలా టికెట్ ఇస్తారని దొన్ను దొర మండిపడుతున్నారు. ఆయనతో పాటు అబ్రహం తోడు అయ్యారు.
తన తండ్రి మావోల దాడిలో మరణించారు అని కిడారి కుటుంబానికి ఒకసారి టికెట్ ఇచ్చిన చంద్రబాబు తనకు కూడా న్యాయం చేయాలి కదా అని ఆయన అంటున్నారు. చంద్రబాబు తమకు వెన్నుపోటు పొడిచారు అని ఆయన ఫైర్ అయ్యారు. తాను ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలుచుకుని వస్తాను అంటున్నారు.
అరకు సీటు విషయంలో సొంత పార్టీకి చెందిన వారు 2009లో గెలిచి పార్టీ జెండా ఎగరేసిన సివేరి సోమ కుటుంబానికి తీరని అన్యాయం జరిగింది అని పార్టీ వర్గాలు అంటున్నారు. అబ్రహం అయితే టీడీపీ కోసం అందరూ తమ శ్రమను ఆర్ధికంగా సొమ్మును ఖర్చు పెట్టి ఉండవచ్చు కానీ తాము కుటుంబాన్నే ఫణంగా పెట్టి పనిచేశామని తన తండ్రి మరణాన్ని తలచుకుని రోదిస్తున్నారు. టీడీపీతో అట్లుంటంది అని ఆయనే అందరికీ చెబుతున్నారు.