అభిమానులేమో పవన్ కల్యాణ్ మీద విపరీతమైన నమ్మకంతో కనీసం యాభై సీట్లయినా పట్టుపట్టి తీసుకోకపోతే మన పరువు పోతోంది కదా.. అని ఆక్రోశిస్తారు. అక్కడికేదో తమ పార్లీకి ఒక పరువు ఉన్నట్టుగా వారు భ్రమిస్తూ ఉంటారు. అదే సమయంలో హరిరామజోగయ్య లాంటి.. తనను తాను భీష్ముడిగా భావించుకునే వాళ్లేమో.. కనీసం 75 సీట్లు తీసుకోవాలి.. ముఖ్యమంత్రి పదవిలో మొదటి రెండున్నర సంవత్సరాల వాటా తీసుకోవాలి అని మార్గదర్శనం చేస్తుంటారు.
వీరు ఇన్ని అతివేషాలు వేస్తుండగా.. పవన్ కల్యాణ్ 24 అని చివరికి 21 తీసుకున్నారు. వారందరూ ఆగ్రహించారు. కానీ.. అయ్యో పాపం పవన్ కల్యాణ్ పరిస్థితి వారికి ఏం తెలుసు? తీసుకున్న 21 స్థానాలకే అభ్యర్థులకు దిక్కులేకుండా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి టికెట్లు కేటాయించుకుంటూ ముందుకు సాగుతున్నారు పవన్ కల్యాణ్.
చంద్రబాబునాయుడు ఎంతటి మాస్టర్ మైండ్ అంటే.. ఆయన పేరుకు పవన్ కు సీట్లు కేటాయించారే గానీ.. ఆ సీట్లలో కూడా తన పార్టీ వారినే పోటీచేయిస్తున్నారు. కాకపోతే.. వారికి సైకిలు గుర్తు ఉండదు. జనసేన బీఫాం మీద పోటీకి దిగుతారు.. అంతే!
మామూలుగా అయితే ముష్టిలాగా దక్కిన 21 స్థానాల్లో కూడా అభ్యర్థులను నిలిపే సత్తా పవన్ కల్యాణ్ కు లేదు. చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యేను ఫిరాయింపజేసి తిరుపతి నుంచి బరిలో నిలుపుతున్నారు. ఈ గతిలేనితనం చాలా బెటర్.
ఎందుకంటే.. వైసీపీ నుంచి ఫిరాయింపు గనుక.. ప్రత్యర్థి పార్టీని బలహీనపరచడం కూడా ఒక లక్ష్యమేమో అనుకోవచ్చు. కానీ.. తెలుగుదేశం వారిని జనసేనలో చేర్చుకుని వారికి టికెట్లు ఇవ్వడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.
పులవర్తి ఆంజనేయులు అలాగే తెలుగుదేశం నుంచి వచ్చారు. నిన్నటిదాకా అవనిగడ్డలో జనసేన అభ్యర్థిత్వానికి విపరీతమైన కాంపిటీషన్ ఉన్నదని.. సర్వేల మీద సర్వేలు చేయిస్తున్నాం అని.. నాయకుల్ని సర్దుబాటు చేయలేక చస్తున్నాం అని.. రకరకాల సాకులు చెప్పారు. తీరా.. ఆ పార్టీకి అక్కడ అభ్యర్థికి గతిలేదు. తెలుగుదేశం నాయకుడు, అక్కడ తనకు సీటు దక్కలేదని తిరుగుబాటు బావుటా ఎగరేసిన మండలి బుద్ధప్రసాద్ ను తీసుకువచ్చి టికెట్ కట్టబెట్టారు.
ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గంలో కూడా అచ్చంగా అదే జరుగుతోంది. ఎందుకంటే.. ఆ సీటు విషయంలోనూ ఇప్పటిదాకా రకరకాల సాకులతో తాత్సారం చేశారు. విషయం ఏంటంటే.. అక్కడ కూడా మనిషి లేరు. నిన్నటి దాకా తెలుగుదేశంలో ఉంటూ టికెట్ ఆశిస్తున్న నిమ్మక జయకృష్ణ ఇప్పుడు జనసేనలోకి వచ్చారు. ఆయన గత ఎన్నికలలో తెదేపా తరఫున ఓడిపోయారు. ఆయనను తెచ్చుకుని ఇప్పుడు పాలకొండ టికెట్ ఆయనకిస్తున్నారు.
నిన్న అవనిగడ్డలాగానే, ఇవాళ పాలకొండ కూడా. పాపం పవన్ కల్యాణ్ కు దక్కిన 21 సీట్లకు కూడా అభ్యర్థులకు దిక్కులేక సతమతం అవుతున్నారని ప్రజలు అనుకుంటున్నారు.