భీమిలీలో జేగంట మోగించి వైసీపీని మళ్లీ ఎన్నుకోవాలని ఆ పార్టీ కోరుతోంది. కేవలం ఎన్నికల ముందు మాత్రమే జనంలోకి వచ్చే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుని ఎన్నుకోవద్దని అంటోంది. గంటాను ఎన్నుకుంటే పెద్ద పొరపాటు చేసినట్లే అంటున్నారు వైసీపీ భీమిలీ అభ్యర్ధి మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు.
ఎన్నికల్లో తప్ప గంటా ఎపుడైనా జనంలో కనిపించారా అని ఆయన ప్రశ్నిస్తున్నారు. కరోనా రెండేళ్ల పాటు విలయతాండవం చేస్తే ఈయన ఎక్కడ ఉన్నారు అని నిలదీశారు. ఎన్నికల వేళకు సీటు మార్చి గెలుపు కోసం జనంలోకి వస్తున్నారని గంటా మీద అవంతి ఘాటు విమర్శలు చేశారు.
గంటా గతంలో గెలిచి అయిదేళ్ళు మంత్రిగా ఉన్నారు, భీమిలీకి ఆయన నికరంగా చేసిన ఒక్క మేలు అయినా ఉందా అని ఆయన అంటున్నారు. ఈ విషయంలో ప్రజలు ఆలోచించుకోవాలని ఆయన కోరారు. గంటాకు పదవి ఒక అలంకరణ అని ఆయన సెటైర్లు వేశారు. గంటా వల్ల టీడీపీ కార్యకర్తలు మాత్రమే బాగుపడతారు ప్రజలకు ఏమీ జరగదని ఆయన తేల్చి చెప్పారు. తాను నిరంతరం ప్రజలలో ఉంటున్నానని జగన్ ముఖ్యమంత్రి అయితే సంక్షేమ పధకాలు మళ్లీ ప్రజలకు అందుతాయని ఆయన అంటున్నారు.
భీమిలీ ప్రజలు అమాయకులు అని సులువుగా గెలుద్దామని ఎవరైనా అనుకుంటే పొరపాటే అని అవంతి గంటా మీద కామెంట్స్ చేశారు. ప్రజలకు అన్నం పెట్టే వారు ఎవరో సున్నం పెట్టే వారు ఎవరో బాగా తెలుసు అని ఆయన అన్నారు. గంటా ఎన్ని ప్రలోభాలు పెట్టినా ముచ్చటగా మూడవసారి భీమిలీకి తానే ఎమ్మెల్యేను అని అవంతి అంటున్నారు. ఒకనాటి తన స్నేహితుడి గురించి అవంతికి తెలిసినంతగా ఎవరికీ తెలియదు అందుకే ఆయన మాటలు జనంలోకి వెళ్తాయని వైసీపీ నేతలు అంటున్నారు. అవంతి వర్సెస్ గంటా టైట్ ఫైట్ గానే భీమిలీలో ఉంది అంటున్నారు